సరికొత్త అవతారంలో Mahindra Scorpio N ఫేస్​లిఫ్ట్​.. బడా ఎస్​యూవీలో భారీ మార్పులు!

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తొలిసారి టెస్టింగ్‌లో కనిపించింది. డిజైన్ మార్పులు, అధునాతన ఫీచర్లతో రానున్న ఈ ఎస్‌యూవీ, మార్కెట్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.

Published on: Jan 31, 2026, 06:00:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రోడ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇప్పుడు సరికొత్తగా మన ముందుకు రాబోతోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఛండీగఢ్‌లో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు రాగా, అందులో రెండు టెస్ట్ వాహనాలు కనిపించాయి.

మహీంద్రా స్కార్పియో ఎన్​ ఫేస్​లిఫ్ట్​..
మహీంద్రా స్కార్పియో ఎన్​ ఫేస్​లిఫ్ట్​..

దాదాపు పూర్తిగా కవర్​ చేసి ఉన్న ఈ రెండు వాహనాల్లో ఒకటి స్టీల్ వీల్స్‌తో ఉండగా, మరొకటి సరికొత్త అలాయ్ వీల్స్‌తో ఉంది. దీని బట్టి చూస్తే మహీంద్రా సంస్థ ఒకేసారి ఈ కారుకు సంబంధించిన లోయర్ వేరియంట్, హయ్యర్ వేరియంట్లను పరీక్షిస్తోందని స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఎస్​యూవీ ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో ఎన్​ ఫేస్​లిఫ్ట్​- ఎక్స్​టీరియర్​లో మార్పులు..

టెస్టింగ్‌లో ఉన్న వాహనాలను పూర్తిగా కప్పి ఉంచడం గమనిస్తే, ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో స్పష్టమైన మార్పులు చేయాలని మహీంద్రా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వాహనాలకు వాడిన హెడ్ ల్యాంప్స్ కేవలం తాత్కాలికమైనవి మాత్రమే, అంటే అసలు ప్రొడక్షన్ వెర్షన్‌లో సరికొత్త హెడ్ ల్యాంప్స్ రానున్నాయి.

ఈ బడా ఎస్​యూవీ ముందు భాగంలో రీ-డిజైన్ చేసిన గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, అలాగే అప్‌డేట్ చేసిన హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్‌తో స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ సరికొత్తగా దర్శనమివ్వనుంది. వెనుక భాగంలో కూడా టెయిల్ ల్యాంప్స్ డిజైన్ మారడంతో పాటు టెయిల్ గేట్, రియర్ బంపర్‌లో స్వల్ప మార్పులు ఉండబోతున్నాయి. ఒక టెస్ట్ కారుకు కొత్త సెట్ అలాయ్ వీల్స్ అమర్చడం చూస్తుంటే, ఈ అప్‌డేట్‌తో సరికొత్త వీల్ డిజైన్లను కూడా పరిచయం చేయబోతున్నారు.

మహీంద్రా స్కార్పియో ఎన్​ ఫేస్​లిఫ్ట్​- ఇంటీరియర్, అప్‌గ్రేడ్ టెక్నాలజీ..

మహీంద్రా స్కార్పియో ఎన్​ ఫేస్​లిఫ్ట్​ లోపలి భాగంలో ప్రధానంగా సాంకేతికతపై అప్‌గ్రేడ్స్ ఉండబోతున్నాయి. ఇటీవల లాంచ్ అయిన ‘థార్ రాక్స్’ నుంచి స్ఫూర్తి పొంది, ఇందులో సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అనలాగ్ సెటప్ స్థానంలో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రానుంది. అంతేకాకుండా, లోపల మరింత ఫ్రెష్ లుక్ ఇవ్వడం కోసం సీట్ల రంగులు, ఇతర చిన్న చిన్న మార్పులు చేయనున్నారు.

మహీంద్రా స్కార్పియో ఎన్​ ఫేస్​లిఫ్ట్​- ఇంజిన్, ధరల అంచనా..

మెకానికల్ పరంగా చూస్తే ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఇంజిన్ ఆప్షన్లనే మహీంద్రా కొనసాగించనుంది. అంటే 203 హెచ్​పీ పవర్‌నిచ్చే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 175 హెచ్​పీ పవర్‌నిచ్చే 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంటాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా కూడా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లు కొనసాగుతాయి

ధర విషయానికి వస్తే, ప్రస్తుతం స్కార్పియో-ఎన్ ధర రూ. 13.49 లక్షల నుంచి రూ. 24.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త అప్‌డేట్స్ కారణంగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

ఈ ఎస్​యూవీ లాంచ్ సమయానికి సంబంధించి మహీంద్రా సంస్థ త్వరలోనే మరిన్ని స్పష్టమైన వివరాలు వెల్లడించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More