...
...
Next Story

FASTag : షాకింగ్! అనుమతి లేకుండానే ఫాస్టాగ్​ డీయాక్టివేట్, మరొకరి చేతికి అకౌంట్- భారీ భద్రతా లోపం..

FASTag updates : ఫాస్టాగ్ సిస్టమ్‌లో ఉన్న ఒక పెద్ద భద్రతా లోపం వల్ల తన అనుమతి లేకుండానే తన కారు ఫాస్టాగ్ డీయాక్టివేట్ అయిపోయిందని ముంబైకి చెందిన ఒక వాహనదారుడు ఆరోపించారు. రవాణా సంస్థ డ్రైవర్ తన సొంత వివరాలతో కొత్త ట్యాగ్‌ను యాక్టివేట్ చేశాడని వివరించారు. తనకు అసలు సమాచారమే రాలేదని అన్నారు.

Published on: May 19, 2026 09:58 AM IST
Advertisement

FASTag Security Loophole : భారతదేశంలో టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీల కోసం తీసుకొచ్చిన ‘ఫాస్టాగ్’ వ్యవస్థలో ఉన్న ఒక ఊహించని సెక్యూరిటీ లోపం ఇప్పుడు వాహనదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది! వాహన యజమాని అనుమతి, ఎలాంటి ఓటీపీ వెరిఫికేషన్ లేకుండానే.. కేవలం వేరొకరు దరఖాస్తు చేయగానే పాత ఫాస్టాగ్ రద్దు అయ్యి, కొత్తది యాక్టివేట్ అయిపోతోందని ముంబైకి చెందిన రషీల్ అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ఆరోపించారు.

అసలేం జరిగింది?

ఫాస్టాగ్ భద్రతా లోపంపై షాకింగ్ వివరాలు.. (AI-generated representational image)
ఫాస్టాగ్ భద్రతా లోపంపై షాకింగ్ వివరాలు.. (AI-generated representational image)

రషీల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఆయన తన కారును ముంబై నుంచి దిల్లీకి ఒక రవాణా సంస్థ ద్వారా పంపించారు. కారును తీసుకెళ్లే ముందు ట్రాన్స్‌పోర్టర్ డ్రైవర్ క్యాజువల్‌గా ‘ఫాస్టాగ్​లో బ్యాలెన్స్ ఉందా?’ అని అడిగారు. అయితే, మరుసటి రోజు ఉదయం రషీల్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఆయన కారు నంబర్‌పై ఒక కొత్త ఫాస్టాగ్ యాక్టివేట్ అయిందని, ‘వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్’ నిబంధన ప్రకారం ఆయన వాడుతున్న పాత ఐసీఐసీఐ ఫాస్టాగ్ డీయాక్టివేట్/బ్లాక్‌లిస్ట్ అయ్యిందని ఉంది.

యజమానికి తెలియకుండానే నియంత్రణ!

ఈ వ్యవహారంపై ఆశ్చర్యపోయిన రషీల్.. కస్టమర్ కేర్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఆ కారు డ్రైవర్ తన సొంత మొబైల్ నంబర్, వివరాలను ఉపయోగించి ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్’ ద్వారా ఆ కారుకు కొత్త ఫాస్టాగ్​ని సృష్టించాడు. ఈ మొత్తం ప్రక్రియలో కారు అసలు యజమానికి ఎలాంటి ఓటీపీ రాలేదు, ఎలాంటి అనుమతు అడగలేదు!

దీని కంటే ఘోరమైన విషయం ఏంటంటే.. కారు తన పేరు మీదే ఉన్నప్పటికీ, ఆ కొత్త ఫాస్టాగ్​ని క్లోజ్ (రద్దు) చేయడం రషీల్‌కు సాధ్యం కాలేదు. ఫాస్టాగ్​ని ఎవరు యాక్టివేట్ చేశారో, వారు మాత్రమే దానిని డీయాక్టివేట్ చేయగలరని కస్టమర్ సపోర్ట్ తేల్చి చెప్పింది. దీనివల్ల అసలు వాహన యజమానికి ఫాస్టాగ్​పై 'జీరో కంట్రోల్' ఉంటుందని, మోసపూరితంగా యాక్టివేట్ చేసిన డ్రైవర్ చేతిలో పూర్తి నియంత్రణ ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్..

రషీల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో సంబంధిత బ్యాంకులు వెంటనే స్పందించాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ స్పందన: "ఈ విషయం మా దృష్టికి రావడం ఆందోళన కలిగించింది. మీ సమస్యను త్వరగా పరిష్కరించడానికి మీ కాంటాక్ట్ వివరాలను డీఎం చేయండి. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా ఐసీఐసీఐ బ్యాంక్ ఎప్పుడూ మీ పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ లేదా ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డు వివరాలను అడగదని గుర్తుంచుకోండి," అని పేర్కొంది.

"మీకు జరిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి మీ కాంటాక్ట్ వివరాలు, వాహనం నంబర్‌ను మాకు డీఎం చేయండి. ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్యను పరిష్కరిస్తాము," అని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్పందించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe