Maruti Suzuki Brezza : మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..
Maruti Suzuki Brezza facelift : భారత్‌లో పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతీ సుజుకీ బ్రెజ్జా కొత్త ఫేస్‌లిఫ్ట్ వర్షన్ రూ. 7.40 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ కారు పూర్తి వివరాలు ఇవే..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటిగా వెలుగొందుతున్న మారుతీ సుజుకీ బ్రెజ్జాలో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్ అయ్యింది. రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్‌లో మెరుగులు దిద్దడంతో పాటు, అనేక అధునాతన ఫీచర్లు, కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్, సరికొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న విశ్వసనీయమైన 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఇందులో కొనసాగిస్తున్నారు.

కొత్త రూపం.. ఫీచర్ల పండగ!
కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ముందుభాగం డిజైన్ సరికొత్తగా కనిపిస్తుంది. స్మోక్డ్ క్రోమ్ గ్రిల్, మరింత బల్కీగా ఉండే బుల్ బార్ ఎలిమెంట్స్ ఈ కారుకు రోడ్డుపై మరింత రాజసాన్ని, ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. దీనికి తోడు మారుతీ సుజుకీ ఈ మోడల్‌లో ‘బీజ్’, 'ఆరెంజ్' అనే రెండు సరికొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లను కూడా పరిచయం చేసింది.
ఇక క్యాబిన్ లోపలికి వస్తే.. ఫీచర్ల పరంగా భారీ మార్పులే జరిగాయి.
10.1-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
64 రంగుల యాంబియంట్ లైటింగ్
లగ్జరీ అనుభూతినిచ్చే లెథరెట్ అప్‌హోల్స్టరీ
35కి పైగా యాప్‌లు, అలెక్సా సపోర్ట్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ అర్కమిస్ సౌండ్ సిస్టమ్
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్యూరిఫైయర్ (PM 2.5 ఎయిర్ ఫిల్టర్)
ఇన్-బిల్ట్ కూలింగ్ ప్యాడ్‌తో కూడిన వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
శ్రేణిలోకి కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్
ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు.. సరికొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులోకి రావడం. ఈ ఇంజన్ 109 PS పవర్, 170 Nm గరిష్ట టాప్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. ఈ టర్బో-పెట్రోల్ వర్షన్ లీటరుకు ఏకంగా 20.47 కి.మీ మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) ఇస్తుందని మారుతి ప్రకటించింది.
అలాగే, మార్కెట్లో ప్రాచుర్యం పొందిన 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లీటరుకు 21.09 కి.మీ మైలేజ్ అందిస్తుంది. సీఎన్జీ ప్రియుల కోసం ఈసారి అండర్‌బాడీలో అమర్చే ప్రత్యేక సీఎన్జీ ట్యాంక్ టెక్నాలజీని అందించారు. దీనివల్ల బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) ఏమాత్రం వృథా కాదు. ఈ సీఎన్జీ మోడల్ కేజీకి 26.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
భద్రత, యాక్సెసరీలు..
భద్రత విషయంలో మారుతీ సుజుకీ బ్రెజ్జా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
కస్టమర్ల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ‘టెర్రాస్కేప్’, ‘మెట్రోస్కేప్’ అనే రెండు కంపెనీ ఫిట్టెడ్ యాక్సెసరీ ప్యాకేజీలను అందిస్తున్నారు. రగ్గడ్ లేదా ఆఫ్‌రోడ్ లుక్ ఇష్టపడేవారు టెర్రాస్కేప్‌ను, మోడరన్ అర్బన్ స్టైలింగ్ కోరుకునేవారు మెట్రోస్కేప్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్.. టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, స్కోడా కైలాక్, కియా సైరోస్ మోడళ్లకు సవాలు విసరనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


