Maruti Suzuki e Vitara బుక్ చేశారా? వెయిటింగ్ పీరియడ్ కాస్త ఎక్కువే!
Maruti Suzuki e Vitara waiting period : మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ విటారా'ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవీ వేరియంట్లు, రంగులు, డెలివరీ టైమ్‌లైన్‌పై పూర్తి వివరాలు మీకోసం..
మారుతీ సుజుకీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈ విటారా’ ఫిబ్రవరి 17, 2026న గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఆటో ఎక్స్‌పో 2025లో తొలిసారి మెరిసిన ఈ కారు కోసం ఏడాదికి పైగా ఎదురుచూసిన కస్టమర్ల నిరీక్షణకు తెరపడింది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారును ఇప్పుడే బుక్ చేసుకుంటే మీ చేతికి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? డీలర్ వర్గాల సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ ఈ విటారా వెయిటింగ్ పీరియడ్ వివరాలు మీకోసం..

మారుతీ సుజుకీ ఈ విటారా- వేరియంట్ ఏదైనా.. వెయిటింగ్ తప్పదు!
మారుతీ సుజుకీ ఈ విటారా ప్రస్తుతం డెల్టా , జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. మీరు ఏ వేరియంట్ ఎంచుకున్నా సరే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 నుంచి 8 వారాల (సుమారు 1.5 నుంచి 2 నెలలు) వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎక్కువమంది కస్టమర్లు బేస్ వేరియంట్ అయిన 'డెల్టా' వైపు మొగ్గు చూపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు.
అంతేకాదు మీరు ఎంచుకునే కలర్ ఆప్షన్ని బట్టి కూడా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ డెలివరీ టైమ్‌లైన్ మారుతుంది.
ఆపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్ రంగులకు అత్యధిక డిమాండ్ ఉండటంతో, వీటికి 2 నెలల (8-9 వారాలు) వెయిటింగ్ పీరియడ్ ఉంది.
నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యూర్ గ్రే వంటి మిగిలిన రంగులకు సుమారు 1.5 నెలల (6-7 వారాలు) సమయం పడుతుంది.
గమనిక: మీ నగరం లేదా డీలర్‌షిప్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్‌లో మార్పులు ఉండవచ్చు. ఖచ్చితమైన సమాచారం కోసం సమీపంలోని నెక్సా షోరూమ్‌ను సంప్రదించండి.
మారుతీ సుజుకీ ఈ విటారా- బ్యాటరీ, రేంజ్ వివరాలు..
డెల్టా (Delta): 49కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 440 కిమీ రేంజ్ (ఏఆర్ఏఐ ప్రకారం).
జీటా అండ్ ఆల్ఫా : 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 543 కిమీ రేంజ్.
మారుతీ సుజుకీ ఈ విటారా- బీఏఏఎస్ స్కీమ్‌తో ధర భారీగా తగ్గింపు!
ఈ ఎలక్ట్రిక్ కారుతో పాటు మారుతీ 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) స్కీమ్‌ని కూడా ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు కొనుగోలు చేసేటప్పుడు చెల్లించాల్సిన ప్రారంభ ధర చాలా తగ్గుతుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ కోసం కిలోమీటరుకు రూ. 3.99 లేదా రూ. 4.39 (బ్యాటరీ ప్యాక్‌ను బట్టి) చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణ ఎక్స్-షోరూమ్ ధర: రూ. 15.99 లక్షల నుంచి రూ. 20.01 లక్షలు.
బీఏఏఎస్ స్కీమ్ కింద ధర: రూ. 10.99 లక్షల నుంచి రూ. 14.51 లక్షలు మాత్రమే (బ్యాటరీ ఫీజు అదనం).
తక్కువ డౌన్ పేమెంట్ కావాలనుకునే వారు ఈ బీఏఏఎస్ స్కీమ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఎంజీ విండ్‌సర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఈ విటారా బ్యాటరీ, రేంజ్ సామర్థ్యం ఎంత?
సమాధానం- మారుతీ ఈ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది:
49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది సుమారు 440 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు అనువైనది.
61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది అత్యధికంగా 543 కిమీ రేంజ్ అందిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది సరైన ఛాయిస్.
రెండు వెర్షన్లు కూడా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి, దీనివల్ల కేవలం 45 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
2. మారుతీ ఈ విటారాలో ఉన్న వారెంటీ, మెయింటెనెన్స్ ప్రయోజనాలు ఏంటి?
సమాధానం- కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు మారుతీ సుజుకీ ఈ కారుపై మంచి వారెంటీ ప్యాకేజీని ప్రకటించింది:
బ్యాటరీ వారెంటీ: 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్లు.
వెహికల్ వారెంటీ: స్టాండర్డ్ 3 ఏళ్ల వారెంటీ ఉంటుంది (దీనిని 8 ఏళ్ల వరకు పొడిగించుకునే ఆప్షన్ ఉంది).
అదనంగా, మొదటి ఏడాది పాటు మారుతీ డీలర్ పాయింట్ల వద్ద ఉచిత ఛార్జింగ్ (1,000 యూనిట్ల వరకు), ఉచితంగా 7.4 కేడబ్ల్యూ హోమ్ ఛార్జర్ ఇన్‌స్టాలేషన్ సౌకర్యం కూడా అందిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


