...
...
Next Story

Automatic cars : మారుతీ సుజుకీ స్విఫ్ట్, డిజైర్ సీఎన్జీ ఆటోమేటిక్ లాంచ్- 36.47 కి.మీ వరకు మైలేజ్​!

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ పాప్యులర్ మోడళ్లయిన స్విఫ్ట్, డిజైర్ సీఎన్జీ వెర్షన్లలో ఆటోమేటిక్ (ఏఎంటీ) గేర్‌బాక్స్‌ను విడుదల చేసింది. ఈ కార్ల ధరలు, వేరియంట్లు, ప్రత్యేకతల సమగ్ర సమాచారం ఇక్కడ చూడండి..

Published on: Sep 20, 2026, 05:28:34 IST
Advertisement

హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో నిత్యం పెరిగిపోతున్న ట్రాఫిక్ నరకంలో గేర్లు మారుస్తూ, క్లచ్ నొక్కి నొక్కి అలిసిపోతున్న వాహనదారులకు మారుతీ సుజుకీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఇంధన ఖర్చుతో పాటు హాయిగా కారు నడుపుకునేలా తమ అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్, డిజైర్ సీఎన్జీ మోడళ్లలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) వెర్షన్లను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

మారుతీ సుజుకీ డిజైర్..
మారుతీ సుజుకీ డిజైర్..

తమ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కార్లలో కంపెనీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందించడం ఇదే తొలిసారి. భారత కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ (టాటా టియాగో, టిగోర్) తర్వాత సీఎన్జీతో పాటు ఏఎంటీ గేర్‌బాక్స్ ఆఫర్ చేస్తున్న రెండో తయారీ సంస్థగా మారుతి నిలిచింది.

వేరియంట్లు, ధరల వివరాలు..

సరికొత్త స్విఫ్ట్ సీఎన్జీ ఏఎంటీ ప్రారంభ ధరను రూ. 7.92 లక్షలుగా నిర్ణయించగా, కాంపాక్ట్ సెడాన్ డిజైర్ సీఎన్జీ ఏఎంటీ ప్రారంభ ధర రూ. 8.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సాధారణ సీఎన్జీ మాన్యువల్ వేరియంట్ల కంటే ఈ కొత్త ఏఎంటీ కార్ల ధరలు కేవలం రూ. 35,000 మాత్రమే ఎక్కువ ఉండటం గమనార్హం.

స్విఫ్ట్ సీఎన్జీ ఏఎంటీ మోడల్ వీఎక్స్ఐ, వీఎక్స్ఐ(ఓ), జెడ్​ఎక్స్​ఐ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రాగా.. డిజైర్ సీఎన్జీ ఏఎంటీ మోడల్ వీఎక్స్ఐ, జెడ్​ఎక్స్​ఐ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇవి రెండూ మార్కెట్లో నేరుగా టాటా టియాగో సీఎన్జీ ఏఎంటీ, టిగోర్ సీఎన్జీ ఏఎంటీ కార్లతో పోటీపడనున్నాయి.

మైలేజ్‌లో సరికొత్త రికార్డు..

సాధారణ మాన్యువల్ మోడళ్ల కంటే ఈ ఏఎంటీ వేరియంట్లే ఎక్కువ మైలేజ్ ఇస్తుండటం ఇక్కడ విశేషం. స్విఫ్ట్ సీఎన్జీ ఏఎంటీ కిలో సీఎన్జీకి 35.34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా (మాన్యువల్ కంటే 2.49 కిమీ/కిలో ఎక్కువ).. డిజైర్ సీఎన్జీ ఏఎంటీ ఏకంగా 36.47 కిలోమీటర్ల రికార్డు మైలేజ్‌ను అందిస్తోంది (మాన్యువల్ కంటే 2.74 కిమీ/కిలో ఎక్కువ). ప్రస్తుతం దేశంలో లభించే సెడాన్ కార్లన్నింటిలోకి డిజైర్ సీఎన్జీ ఏఎంటీయే అత్యంత పొదుపైన కారుగా నిలిచింది.

'ఆటో గ్రీన్ మిషన్'లో భాగంగా లాంచ్..

సీఎన్జీ సిలిండర్ అమర్చడం వల్ల పెరిగిన బరువుకు తగినట్లుగా కార్ల సస్పెన్షన్ వ్యవస్థలో మారుతీ సుజుకీ ప్రత్యేక మార్పులు చేసింది. కారులో పెట్రోల్ నుంచి సీఎన్జీకి, సీఎన్జీ నుంచి పెట్రోల్‌కు మారడానికి ప్రత్యేక స్విచ్‌తో పాటు డిజిటల్ మీటర్ బోర్డుపై సీఎన్జీ ఇంధన స్థాయిని చూపే ఇండికేటర్‌ను అందించారు. అయితే టాటా కార్లలో ఉండే 'ట్విన్ సిలిండర్' సాంకేతికతలా కాకుండా, మారుతీ సుజుకీ ఇందులోని డిక్కీలో 55 లీటర్ల ఒకే సిలిండర్‌ను అమర్చడం వల్ల లగేజ్ పెట్టుకోవడానికి స్థలం పరిమితంగానే ఉంటుంది.

"కస్టమర్ల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతను అందించడమే మా ప్రాధాన్యత. స్విఫ్ట్, డిజైర్ సీఎన్జీ మోడళ్లలో ఏఎంటీ ప్రవేశపెట్టడం వల్ల నగరాల్లో ప్రయాణించే వారికి అత్యంత సౌకర్యవంతమైన, పొదుపైన డ్రైవింగ్ అనుభవం లభిస్తుంది," అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.

పర్యావరణ హితమైన ప్రయాణంతో పాటు రన్నింగ్ కాస్ట్ తగ్గించాలనే లక్ష్యంతో 'ఆటో గ్రీన్ మిషన్' కింద మారుతీ సుజుకీ ఈ లైనప్‌ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే హ్యాచ్‌బ్యాక్ ప్రీమియం వెర్షన్ బలెనో సీఎన్జీ ఏఎంటీని కూడా రూ. 8.32 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చారు. ఈ మోడల్​ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks