...
...
Next Story

ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఎఫ్‌డీఏ ఉక్కుపాదం: బాక్స్-8, మోజో పిజ్జాల లైసెన్స్ రద్దు

ముంబైలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ప్రముఖ ఫుడ్ బ్రాండ్లు, బేకరీలపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కఠిన చర్యలు చేపట్టింది. బాక్స్-8, మోజో పిజ్జా మాతృ సంస్థ ఈట్‌క్లబ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, రూ.75.52 లక్షల విలువైన నకిలీ ఎక్స్‌పైరీ తేదీల దందాను అధికారులు ఛేదించారు.

Published on: Sep 6, 2026, 09:27:02 IST
Advertisement

ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) యంత్రాంగం పలు సంస్థలకు షాకిచ్చింది. ఈ బృందం ముంబైలోని పలు ప్రముఖ ఫుడ్ డెలివరీ అవుట్‌లెట్లు, బేకరీలపై మెరుపు దాడులు నిర్వహించింది. ప్రముఖ ఆన్‌లైన్ బ్రాండ్లు బాక్స్-8 (Box8), మోజో పిజ్జా (Mojo Pizza) మాతృ సంస్థ 'ఈట్‌క్లబ్ బ్రాండ్స్' సహా పలు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది.

బాక్స్-8, మోజో పిజ్జా లైసెన్స్ రద్దు

తుకారాం ముండే
తుకారాం ముండే

ముంబై ఆరే మిల్క్ కాలనీలోని రాయల్ పామ్స్‌లో ఉన్న ఈట్‌క్లబ్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్‌లెట్‌లో ఎఫ్‌డీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం ఇక్కడ తీవ్ర ఉల్లంఘనలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆహార పదార్థాలు, రసాయనాలు, కార్మికుల వ్యక్తిగత వస్తువులను ఒకే చోట నిల్వ ఉంచడం, శుభ్రమైన నీటి వసతి లేకపోవడం, తగినంత గాలి వెలుతురు రాకపోవడం, ఈగలు-పురుగుల నివారణ చర్యలు తీసుకోకపోవడాన్ని అధికారులు గమనించారు. అంతేకాకుండా ఆహారాన్ని తయారుచేసే సిబ్బందికి రక్షణ దుస్తులు అందించకపోవడం, వార్షిక వైద్య పరీక్షల రికార్డులు లేకపోవడం, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లోపించడంతో సెప్టెంబర్ 2 నుంచే అమలులోకి వచ్చేలా ఈట్‌క్లబ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.

ఎలుకల సంచారం.. కుళ్ళిన మాంసం

కుర్లా వెస్ట్‌లోని 'రాణి డైట్స్ కన్సల్టెంట్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్'పై కూడా ఎఫ్‌డీఏ కఠిన చర్యలు తీసుకుంది. తనిఖీల్లో భాగంగా వంటగదిలో ఎలుకలు తిరగడం, మురుగునీరు నిలిచిపోవడం, చెత్తను నిబంధనల ప్రకారం తొలగించకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

రెఫ్రిజిరేటర్లలో పచ్చి మాంసం, అత్యంత సున్నితమైన ఆహార పదార్థాలను మూతలు లేకుండా ఉంచడమే కాకుండా, వాటిపై తయారీ, కాలం చెల్లిన తేదీల లేబుళ్లు కూడా లేవని స్పష్టం చేశారు. ఆహార భద్రతా ఆడిట్ రికార్డులు పూర్తిగా అసంపూర్తిగా ఉండటంతో దీని లైసెన్స్‌ను కూడా ఎఫ్‌డీఏ అధికారులు రద్దు చేశారు.

చెంబూర్ బేకరీలకు ఎఫ్‌డీఏ నోటీసులు

నవీ ముంబైలో సాగుతున్న భారీ ఆహార మోసాన్ని ఎఫ్‌డీఏ, నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా బట్టబయలు చేశారు. తుర్భే టీటీసీ ఇండిస్ట్రియల్ ఏరియాలోని 'సాధన ఎంటర్‌ప్రైజెస్' ప్రాంగణంలో తనిఖీలు చేసి రూ.75.52 లక్షల విలువైన నిల్వలను సీజ్ చేశారు.

ప్రముఖ బ్రాండ్లు అయిన మ్యాగీ మసాలా, అట్టా నూడుల్స్, లేస్ పొటాటో చిప్స్, కుర్‌కురే, ఫన్ ఫ్లిప్స్ వంటి ఉత్పత్తులపై ఉన్న అసలు తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను రసాయనాలతో చెరిపేసి, కొత్త స్టిక్కర్లను అతికిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. మొత్తం 8,442 కార్టన్ల సరుకుతో పాటు కాలం చెల్లిన స్టాక్‌ను జప్తు చేసి సాధన ఎంటర్‌ప్రైజెస్ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe