El Mencho : మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్ 'ఎల్ మెంచో' ఖతం! సైనిక దాడిలో హతం.. అట్టుడుకుతున్న నగరం

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ లార్డ్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అధినేత 'ఎల్ మెంచో' మెక్సికో సైనిక ఆపరేషన్‌లో మరణించాడు. అతడి మరణంతో మెక్సికోలో హింస చెలరేగగా, అమెరికా తన పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.

Published on: Feb 23, 2026, 07:30:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ దేశాలను వణికించిన అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ట్రాఫిక్కర్, మెక్సికో మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్యురా సెర్వాంటెస్ (ఎల్ మెంచో) కథ ముగిసింది! మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో జరిగిన భారీ సైనిక ఆపరేషన్‌లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచో మరణించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం విమానంలో మెక్సికో సిటీకి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.

మెక్సికో డ్రగ్​ లార్డ్​ ఎల్​ మెంచో..
మెక్సికో డ్రగ్​ లార్డ్​ ఎల్​ మెంచో..

ఎవరు ఈ ఎల్​ మెంచో?

గత దశాబ్ద కాలంలో 'ఎల్ మెంచో' తన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్​జీ)ని ఒక ప్రాంతీయ ముఠా నుంచి అంతర్జాతీయ నెట్‌వర్క్‌గా మార్చాడు. భారీ ఆయుధాలు, సైనిక తరహా కాన్వాయ్‌లు, దారుణమైన హత్యలతో ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఇతడి శైలి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ఎల్ చాపో' కంటే క్రూరమైన నేర సామ్రాజ్యాన్ని ఎల్ మెంచో నిర్మించగలిగాడు.

ఎల్ మెంచో నేర సామ్రాజ్యం ఎంతటిదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్రమ డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిన ఇతడు, ప్రపంచంలోనే అత్యంత సంపన్న నేరగాళ్లలో ఒకరిగా ఎదిగాడు.

ఎల్ మెంచో కచ్చితమైన ఆస్తి వివరాలు బయటి ప్రపంచానికి తెలియవు కానీ, అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అంచనా ప్రకారం.. ఇతని వ్యక్తిగత సంపద 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) దాటి ఉండవచ్చు.

ఇక ఇతను నడిపిన 'జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' అనే ముఠా ఆస్తుల విలువ పదుల బిలియన్ డాలర్లలో (లక్షల కోట్లు) ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు కొకైన్ సరఫరా చేయడంలో ఈ ముఠాది అగ్రస్థానం. ఫెంటానిల్, మెతాంఫెటమైన్ వంటి ప్రమాదకర రసాయన డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడంలో కూడా వీరికి తిరుగులేదు.

ఎల్ మెంచో 1996లో రోసలిండా గొంజాలెజ్ వాలెన్సియాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ 2018లో చట్టబద్ధంగా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. రోసలిండా కుటుంబం (లోస్ కుయినిస్) ఈ నేర ముఠాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఎల్ మెంచోకు ముగ్గురు పిల్లలు ఉన్నారు:

రుబెన్ ఒసెగ్యురా గొంజాలెజ్

జెస్సికా జోహానా ఒసెగ్యురా

లైషా ఒసెగ్యురా

ఎల్ మెంచో మరణించిన అనంతరం ఈ నేర సామ్రాజ్యానికి అధికారికంగా ఇంకా ఎవరినీ వారసుడిగా ప్రకటించలేదు. అయితే, ఇతని పిల్లలే ఈ ముఠా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆధిపత్య పోరులో మెక్సికోలో మరిన్ని గ్యాంగ్ వార్‌లు జరిగే ముప్పు ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అట్టుడుకుతున్న మెక్సికో!

ఎల్ మెంచో మరణవార్త తెలియగానే మెక్సికోలో ఒక్కసారిగా హింస చెలరేగింది. జాలిస్కో సహా అనేక రాష్ట్రాల్లో కార్టెల్ సభ్యులు వీరంగం సృష్టించారు. తుపాకులు చేతబట్టిన దుండగులు వాహనాలను తగులబెట్టడమే కాకుండా, ప్రధాన హైవేలను దిగ్బంధించారు.

పర్యాటక నగరమైన పోర్టో వల్లర్టా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

జాలిస్కో రాజధాని గ్వాడలజారా విమానాశ్రయంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయి.

పరిస్థితి విషమించడంతో గవర్నర్ పాబ్లో లెమస్ నవార్రో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెంట్ క్లాడియా షైన్‌బామ్ మాట్లాడుతూ.. ఫెడరల్, స్టేట్ ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో హింసను అదుపు చేస్తున్నాయని ప్రకటించారు.

అమెరికాకు లభించిన భారీ విజయం

అమెరికాలోకి కొకైన్, మెతాంఫెటమైన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకర డ్రగ్స్‌ను తరలించడంలో ఎల్ మెంచో కీలక సూత్రధారి. అతడి సమాచారం అందించిన వారికి అమెరికా ప్రభుత్వం గతంలోనే 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 125 కోట్లు) రివార్డు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మెక్సికో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతోనే ఈ తాజా ఆపరేషన్ సాధ్యమైంది. గత ఏడాదే సీజేఎన్​జీని అమెరికా 'విదేశీ ఉగ్రవాద సంస్థ'గా గుర్తించింది. ఈ పరిణామంపై అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ స్పందిస్తూ.. ఇది లాటిన్ అమెరికా మొత్తానికి గొప్ప పరిణామమని కొనియాడారు.

అమెరికా, కెనడా దేశాల సెక్యూరిటీ అలర్ట్

హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. జాలిస్కో, తమౌలిపాస్, మిచోకాన్, గెర్రెరో, న్యూవో లియోన్ రాష్ట్రాల్లో ఉన్న అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. కెనడా సైతం జాలిస్కోలో ఉన్న తన పౌరులను అప్రమత్తం చేసింది.

ప్రశ్నలు- సమాధానాలు :-

1. ఎల్ మెంచో మరణం తర్వాత మెక్సికోలో హింస ఎందుకు అంతగా పెరిగింది?

సాధారణంగా మెక్సికోలో ఏదైనా పెద్ద డ్రగ్ కార్టెల్ నాయకుడు పట్టుబడ్డా లేదా మరణించినా, ఆ ముఠా సభ్యులు సైన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు, తమ నాయకుడిని తరలించకుండా అడ్డుకునేందుకు ‘నార్కో-బ్లాకేడ్స్’ సృష్టిస్తారు. ఎల్ మెంచో విషయంలో కూడా అదే జరిగింది. అతని అనుచరులు వాహనాలను తగులబెట్టి రోడ్లను దిగ్బంధించడం ద్వారా దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. దీనివల్ల పర్యాటక ప్రాంతాలైన పోర్టో వల్లర్టా వంటి నగరాల్లో విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.

2. ఎల్ మెంచో నేర సామ్రాజ్యం ఇంత శక్తివంతంగా ఎలా ఎదిగింది?

ఎల్ మెంచో నాయకత్వంలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ కేవలం 10-15 ఏళ్లలోనే మెక్సికోలో అత్యంత బలమైన ముఠాగా ఎదిగింది. దీనికి ప్రధాన కారణం వారి సైనిక తరహా వ్యూహాలు! వీరు కేవలం డ్రగ్స్ తరలించడమే కాకుండా, విమానాలను కూల్చగల రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉండేవారు. అలాగే, అమెరికాలో విపరీతంగా అమ్ముడయ్యే 'ఫెంటానిల్' వంటి సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తిపై పట్టు సాధించడం వల్ల వీరికి బిలియన్ల కొద్దీ ఆదాయం సమకూరింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More