Nissan Tekton Vs Renault Duster : ఒకే ప్లాట్‌ఫామ్.. ఒకే ధర! మరి ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
Nissan Tekton and Renault Duster : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో నిస్సాన్ టెక్టాన్, రెనాల్ట్ డస్టర్ మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది. ఒకే ప్లాట్‌ఫామ్, ఒకే ఇంజన్ ఆప్షన్లతో వస్తున్న ఈ రెండు కార్లలో ఉన్న తేడాలు, ధరలు, ఫీచర్ల సమగ్ర విశ్లేషణ మీకోసం..
భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల రోడ్లపై చూస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి భారీ డిమాండ్ ఉన్న మార్కెట్లోకి జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్.. తన సరికొత్త అస్త్రం ‘టెక్టాన్’ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. అయితే, అంతర్జాతీయంగా నిస్సాన్-రెనాల్ట్ సంస్థల మధ్య ఉన్న భాగస్వామ్యం కారణంగా.. నిస్సాన్ టెక్టాన్ కారును రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే రూపొందించారు! రెండు కార్లు ఒకే రకమైన ఇంజన్లు, ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటున్నప్పటికీ, డిజైన్, ఫీచర్ల పరంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి తమదైన శైలిలో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది దేనికి సాటి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నిస్సాన్ టెక్టాన్ వర్సెస్ రెనాల్ట్ డస్టర్- డిజైన్..
మొదటగా నిస్సాన్ టెక్టాన్ విషయానికి వస్తే, దీని లుక్ అంతర్జాతీయ మార్కెట్లో నిస్సాన్ కంపెనీకి చెందిన లగ్జరీ ఎస్‌యూవీ ‘నిస్సాన్ పాట్రోల్’ని పోలి ఉంటుంది. నిటారుగా ఉండే ఫ్రంట్ గ్రిల్, దానిపై రెండు క్రోమ్ లైన్లు, ఇరువైపులా స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్ కారుకు అద్భుతమైన రాయల్ లుక్‌ను ఇచ్చాయి. కారు వెడల్పు అంతటా సాగే సి-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్లు, దాని కింద ఉన్న రెడ్ స్ట్రిప్ కారును మరింత స్పోర్టీగా మార్చాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 18-ఇంచుల అల్లాయ్ వీల్స్, వెనుక తలుపుల హ్యాండిల్స్‌ను సీ-పిల్లర్‌లో అమర్చడం విశేషం. వెనుక వైపు కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్, రూఫ్ స్పాయిలర్, 'Tekton' బ్యాడ్జింగ్‌తో కారు ఎంతో క్లాస్‌గా కనిపిస్తుంది.
మరోవైపు, సరికొత్త రెనాల్ట్ డస్టర్ డిజైన్ పూర్తిగా రగ్గడ్ (రఫ్ అండ్ టఫ్) లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్రంట్ గ్రిల్‌పై లావుపాటి వర్టికల్ లైన్లు, పెద్ద అక్షరాలతో 'Duster' అని రాసి ఉండటం వల్ల ఇది పక్కా ఆఫ్-రోడర్ లాంటి ఫీలింగ్‌ను ఇస్తుంది. టెక్టాన్ తరహాలో కాకుండా, డస్టర్ ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్‌ను పక్కనబెట్టింది. హెడ్‌ల్యాంప్స్ పైభాగంలో విడిగా డీఆర్‌ఎల్‌లను ఇచ్చారు. దీని సైడ్ ప్రొఫైల్‌లో 18-ఇంచుల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, చుట్టూ నల్లటి ప్లాస్టిక్ క్లాడింగ్ కారుకు మరింత బోల్డ్ లుక్‌ను తెచ్చాయి. వెనుక వైపు వై-షేప్ లేదా సీ-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్‌తో డస్టర్ డిజైన్ చాలా విభిన్నంగా ఉంటుంది.
నిస్సాన్ టెక్టాన్ వర్సెస్ రెనాల్ట్ డస్టర్- ఇంజిన్..
ఈ రెండు ఎస్‌యూవీల బాడీ కింద ఒకే రకమైన ఇంజన్ ఉంది. నిస్సాన్ టెక్టాన్, రెనాల్ట్ డస్టర్ రెండు మోడళ్లలోనూ ఒకే రకమైన రెండు పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను అందించారు.
1.0 లీటర్ టీ160 టర్బో పెట్రోల్: ఈ 3-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 99 బీహెచ్పీ పవర్‌ను, 166 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.
1.3 లీటర్ టీ280 టర్బో పెట్రోల్: ఎక్కువ పవర్ ఆశించే వారి కోసం తీసుకొచ్చిన ఈ 4-సిలిండర్ ఇంజన్ ఏకంగా 160 బీహెచ్పీ పవర్‌ను, 280 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనితో పాటు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఆటోమొబైల్ వర్గాల సమాచారం: మైలేజ్, టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు తెస్తున్న స్ట్రాంగ్ హైబ్రిడ్ (1.8 లీటర్) ఇంజన్ ఆప్షన్ ఈ ఏడాది చివర్లో రానున్న రెనాల్ట్ డస్టర్‌లో లభించనుంది. కానీ నిస్సాన్ టెక్టాన్‌లో మాత్రం ప్రస్తుతానికి ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను పరిచయం చేయడం లేదు.
నిస్సాన్ టెక్టాన్ వర్సెస్ రెనాల్ట్ డస్టర్- ఫీచర్లు..
క్యాబిన్ కంఫర్ట్ విషయానికొస్తే నిస్సాన్ టెక్టాన్, రెనాల్ట్ డస్టర్లు అత్యాధునిక ఫీచర్లతో నిండిపోయాయి. అయితే ఇక్కడే చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అవి..
| ఫీచర్లు | నిస్సాన్ టెక్టాన్ | రెనాల్ట్ డస్టర్ |
|---|---|---|
| ఇన్ఫోటైన్‌మెంట్ | 10.1-ఇంచుల డిజిటల్ స్క్రీన్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే) | 10.1-ఇంచుల స్క్రీన్ (డ్రైవర్ వైపు వంగి ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ ఇన్‌బిల్ట్) |
| సౌండ్ సిస్టమ్ | 6-స్పీకర్లతో కూడిన ఆర్కామిస్ ఆడియో సిస్టమ్ | స్టాండర్డ్ ఆడియో సిస్టమ్ |
| సీట్లు | వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (ఎండకాలంలో చల్లదనాన్ని ఇస్తాయి) | 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ & కో-ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్లు |
| ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ | 10.25-ఇంచుల పూర్తి డిజిటల్ స్క్రీన్ | 10.25-ఇంచుల స్క్రీన్ (టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో) |
| అదనపు ఫీచర్లు | కూల్డ్ వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, USB-C పోర్టులు | క్లైమేట్ కంట్రోల్ ఫిజికల్ బటన్స్, 12V సాకెట్, USB-C పోర్టులు |
నిస్సాన్ టెక్టాన్ వర్సెస్ రెనాల్ట్ డస్టర్- ధరలు..
భారతీయ కస్టమర్లను ఆకర్షించడంలో ధర అనేది అత్యంత కీలకమైన అంశం. నిస్సాన్, రెనాల్ట్ కంపెనీలు రెండూ ఒకే రకమైన వ్యూహాన్ని అనుసరించాయి. ఈ రెండు కార్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సరిగ్గా రూ.10.49 లక్షలుగా ఉంది.
అయితే, టాప్-ఎండ్ వేరియంట్ల విషయానికి వస్తే నిస్సాన్ టెక్టాన్ ధర రూ.18.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, రెనాల్ట్ డస్టర్ టాప్ వేరియంట్ ధర రూ.18.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే టెక్టాన్ టాప్ మోడల్, డస్టర్ కంటే రూ.10,000 తక్కువ ధరకే లభిస్తోంది.
మోడ్రన్, క్లాసీ లుక్, మెరుగైన మ్యూజిక్ సిస్టమ్ కోరుకుంటే టెక్టాన్ వైపు, లేదు రగ్గడ్ ఆఫ్-రోడ్ లుక్, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ ముఖ్యం అనుకుంటే డస్టర్ వైపు మొగ్గు చూపవచ్చు.
మరి ఈ రెండు స్టైలిష్ ఎస్‌యూవీల్లో మీరు దేనిని ఎంచుకుంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


