NPS ఫండ్ ఎంపికలో లాభాలే ప్రామాణికమా? ఈ 3 విషయాలు చూడకుంటే పొరపాటే
ఎన్పీఎస్ పెన్షన్ ఫండ్ ఎంపికలో ఏడాది రాబడిని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం ముప్పు తెచ్చిపెడుతుంది. సుదీర్ఘకాలంలో స్థిరమైన రాబడుల కోసం రోలింగ్ రిటర్న్స్, మార్కెట్ హెచ్చుతగ్గుల తట్టుకునే శక్తిని ఎలా పరిశీలించాలో నిపుణుల విశ్లేషణ ఇక్కడ చూడండి.
పదవీ విరమణ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను ఎంచుకునే సమయంలో కేవలం గడిచిన ఏడాది రాబడి (Trailing Returns) ఆధారంగా నిర్ణయం తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక సంవత్సరంలో అత్యధిక రాబడిని అందించిన ఫండ్, సుదీర్ఘకాలంలో కూడా అదే స్థాయిలో రాబడులను ఇస్తుందని లేదా మార్కెట్ పతనమైనప్పుడు నష్టాలను నియంత్రిస్తుందని చెప్పలేం.

15 నుంచి 20 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం డిపాజిట్లు చేసే చందాదారులకు మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకుని నిలబడే స్థిరత్వమే అత్యంత ముఖ్యం. 'ఫ్రీఫిన్కాల్' ప్లాట్‌ఫారమ్ వ్యవస్థాపకుడు ఎం. పట్టాభిరామన్ చేసిన విశ్లేషణ ప్రకారం.. ఒక పెన్షన్ ఫండ్ ఎంత సంపాదించిందనే దానికంటే, మార్కెట్ సూచీతో (Benchmark) పోలిస్తే ఎంత తరచుగా మెరుగైన ప్రదర్శన ఇచ్చిందో పరిశీలించడం అవసరం. దీనికోసం ప్రధానంగా మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
రోలింగ్ రిటర్న్స్ ఎందుకు చూడాలి?
ట్రైలింగ్ రిటర్న్స్ అనేది కేవలం రెండు నిర్దిష్ట తేదీల మధ్య సాధించిన లాభాలను మాత్రమే చూపుతాయి. ఇవి ఫండ్ యొక్క స్థిరమైన పనితీరును ప్రతిబింబించలేవు. ఈ లోపాన్ని సరిదిద్దడానికి 'రోలింగ్ రిటర్న్స్' ఉపయోగపడతాయి. అంటే నిర్దిష్ట తేదీ నాటి 5 ఏళ్ల రాబడిని మాత్రమే కాకుండా, అందుబాటులో ఉన్న డేటాలోని అన్ని 5 ఏళ్ల కాల వ్యవధులను లెక్కించి ఫండ్ పనితీరును అంచనా వేస్తారు.
ఉదాహరణకు, ఒక ఫండ్ సూచీతో పోల్చడానికి 876 కాల వ్యవధులను పరిశీలించినప్పుడు, అందులో 675 సార్లు ఆ ఫండ్ మార్కెట్ సూచీ కంటే ఎక్కువ రాబడిని ఇస్తే.. దాని రోలింగ్ రిటర్న్ కన్సిస్టెన్సీ దాదాపు 77 శాతంగా ఉంటుంది. ఈ శాతం ఎంత ఎక్కువగా ఉంటే, ఆ ఫండ్ మార్కెట్ సూచీని అంత తరచుగా దాటి ముందుకు వెళ్లినట్లు అర్థం. మూడేళ్లు, ఐదేళ్ల వ్యవధిలో ఈ కన్సిస్టెన్సీని పరిశీలించడం ద్వారా ఫండ్ యొక్క సుదీర్ఘకాల స్థిరత్వాన్ని గుర్తించవచ్చు.
మార్కెట్ ర్యాలీలు, పతనాల్లో ఫండ్ ప్రదర్శన
మార్కెట్ పెరిగేటప్పుడు లాభాలను అందించడం ఒక ఎత్తయితే, మార్కెట్ పడిపోయేటప్పుడు నష్టాలను తగ్గించడం మరొక ఎత్తు. ఈ రెండింటినీ చందాదారులు విడివిడిగా పరిశీలించాలి.
అప్‌సైడ్ పెర్ఫార్మన్స్ కన్సిస్టెన్సీ: మార్కెట్ సూచీలు పెరుగుతున్నప్పుడు ఫండ్ ఎంత తరచుగా సూచీ కంటే ఎక్కువ లాభాలను ఇచ్చిందో ఇది తెలుపుతుంది. ఉదాహరణకు, 70 శాతం స్కోరు ఉంటే.. మార్కెట్ పెరిగిన ప్రతి 10 సందర్భాలలో 7 సార్లు ఆ ఫండ్ సూచీ కంటే మెరుగైన ఫలితాన్ని ఇచ్చినట్లు అర్థం.
డౌన్‌సైడ్ పెర్ఫార్మన్స్ కన్సిస్టెన్సీ: మార్కెట్ పడిపోతున్నప్పుడు ఫండ్ నష్టాలను ఏ మేర తగ్గించిందో ఇది చూపుతుంది. 60 శాతం స్కోరు ఉంటే.. మార్కెట్ పడిన ప్రతి 10 సందర్భాలలో 6 సార్లు ఆ ఫండ్ మార్కెట్ సూచీ కంటే మెరుగైన రక్షణను ఇచ్చిందని భావించవచ్చు.
పదవీ విరమణకు దగ్గరగా ఉన్న డిపాజిటర్లు డౌన్‌సైడ్ పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రిటైర్మెంట్ సమయంలో పెద్ద ఎత్తున మార్కెట్ పతనమైతే, ఆ నష్టాల నుంచి కోలుకోవడం చాలా కష్టం.
ఎక్కువ రాబడి అంటే ఎక్కువ ప్రమాదమేనా?
పెన్షన్ ఫండ్ సాధించిన రాబడితో పాటు, ఆ రాబడి కోసం ఆ ఫండ్ ఎంతటి ముప్పు (Volatility) ఎదుర్కొందో పోల్చడం ముఖ్యం. దీని కోసం ఎక్సెస్ రిటర్న్స్, ఎక్సెస్ రిస్క్ సూచికలను చూడాలి.
పట్టాభిరామన్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్ స్కీమ్ E (టైర్ I) ను ఒక ఉదాహరణగా చూపిస్తూ ఈ విషయాన్ని వివరించారు. ఈ స్కీమ్ ఏడాది కాలంలో 35.089 శాతం రాబడిని అందించగా, దాని మార్కెట్ సూచీ 22.704 శాతం రాబడిని మాత్రమే ఇచ్చింది. అంటే ఫండ్ 12.385 శాతం మేర అదనపు రాబడిని సాధించింది. అదే సమయంలో ఫండ్ హెచ్చుతగ్గులను కొలిచే స్టాండర్డ్ డెవియేషన్ 3.592 శాతంగా నమోదు కాగా, బెంచ్‌మార్క్ డీవియేషన్ 3.732 శాతంగా ఉంది. అంటే ఫండ్ సాధించిన అదనపు రాబడి ఎక్కువ ముప్పుతో కాకుండా, తక్కువ వోలటాలిటీతోనే వచ్చింది. అయితే ఇవి కేవలం అవగాహన కోసం ఉపయోగించిన గణాంకాలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఫండ్ మేనేజర్లను ఎలా ఎంచుకోవాలి?
ఎన్పీఎస్ చందాదారులు అన్ని ఫండ్లను ఒకే వరుసలో పెట్టి పోల్చకూడదు. ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, గిల్ట్ స్కీమ్‌లు వేర్వేరు నిబంధనలు, రిస్క్ ప్రొఫైళ్లను కలిగి ఉంటాయి. కాబట్టి ఆయా కేటగిరీల పరిధిలోనే పోటీ ఫండ్లతో పోల్చాలి.
పెన్షన్ ఫండ్ల షార్ట్‌లిస్టింగ్ కోసం ఇవి పాటించవచ్చు.
- మూడేళ్లు, ఐదేళ్ల రోలింగ్ రిటర్న్ కన్సిస్టెన్సీ 60 నుంచి 70 శాతం ఉన్న ఫండ్లను మొదట ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత వాటి అప్‌సైడ్, డౌన్‌సైడ్ ప్రదర్శనలను పరిశీలించాలి.
- మరీ కఠినమైన నిబంధనలు పెడితే మంచి ఫండ్లను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి 5 నుంచి 6 ఫండ్లను షార్ట్‌లిస్ట్ చేసుకుని వాటిని లోతుగా పరిశీలించడం శ్రేయస్కరం.
- గతంలో సాధించిన అద్భుతమైన ప్రదర్శన భవిష్యత్తు రాబడులకు గ్యారెంటీ కాదని గుర్తుంచుకోవాలి. చందాదారులు తమ రిటైర్మెంట్ వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యం, వయస్సు ఆధారంగానే సరిపోయే ఫండ్ ఎంచుకోవాలి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


