...
...
Next Story

NSE IPO : ఎన్​ఎస్​ఈ ఐపీఓ ఫస్ట్​ డే సబ్​స్క్రిప్షన్ ఎంత? జీఎంపీ ఎంత? అప్లై చేయాలా? వద్దా?

దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్​ఛేంజ్ 'నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్' (ఎన్​ఎస్​ఈ) రూ.22,569 కోట్ల మెగా ఐపీఓ ప్రారంభమైంది. మొదటి రోజు సాధించిన సబ్‌స్క్రిప్షన్, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ), వివిధ దిగ్గజ బ్రోకరేజ్ సంస్థల సిఫార్సులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ చూడండి..

Published on: Sep 18, 2026, 09:59:15 IST
Advertisement

దేశీయ షేర్ మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) రూ.22,569 కోట్ల భారీ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చింది. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూకి మొదటి రోజు నుంచే ఇన్వెస్టర్ల నుంచి నిలకడైన స్పందన లభించింది. డే 2 సబ్​స్క్రిప్షన్ నేపథ్యంలో ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- తొలిరోజు సబ్‌స్క్రిప్షన్ ఎలా ఉందంటే?

ఎన్​ఎస్​ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్ అప్డేట్స్.. (Photo: AI generated )
ఎన్​ఎస్​ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్ అప్డేట్స్.. (Photo: AI generated )

బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ) గణాంకాల ప్రకారం.. మొదటి రోజు వ్యాపారం ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ మొత్తం 43 శాతం సబ్‌స్క్రిప్షన్ సాధించింది.

రిటైల్ ఇన్వెస్టర్ల కోటా: 44 శాతం భర్తీ అయింది.

నాన్-ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్​ఐ): 72 శాతానికి పైగా బిడ్లు వేశారు.

క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ): 19 శాతం దరఖాస్తులు వచ్చాయి.

ఉద్యోగుల కేటాయింపు: అత్యధికంగా 98 శాతం పూర్తి అయింది.

మొత్తం 8,86,42,911 షేర్లను విక్రయానికి ఉంచగా, తొలిరోజు సాయంత్రం నాటికి 3,83,94,696 షేర్ల కోసం బిడ్లు నమోదయ్యాయి.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ ముఖ్యమైన తేదీలు, ప్రైజ్ బ్యాండ్ వివరాలు..

ఈ మెగా ఐపీఓ సెప్టెంబర్ 21 (సోమవారం) వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది.

ప్రైస్ బ్యాండ్: ఒక్కో షేరు ముఖ విలువ రూ.1 కాగా, ధరల శ్రేణిని రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించారు.

లాట్ సైజ్: కనీసం 8 షేర్లు, ఆ తర్వాత 8 గుణిజాల్లో బిడ్ దాఖలు చేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక లాట్ కొనుగోలుకు కనీసం రూ.14,280 అవసరమవుతాయి.

రీఫండ్ అండ్ డీమ్యాట్ క్రెడిట్: ఎన్​ఎస్​ఈ షేర్లు అలాట్​ అవ్వని వారికి డబ్బులు వాపసు చేయడం, అర్హులైన వారి డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల బదిలీ జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఎన్‌ఎస్‌ఈ తన షేర్లను బిఎస్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేయనుంది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ ఎంతంటే..

అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేర్లకు గట్టి డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ.142 వద్ద కొనసాగుతోంది. అప్పర్ ప్రైజ్ బ్యాండ్ రూ.1,785తో పోలిస్తే, ఇది దాదాపు 7.96 శాతం ప్రీమియంతో రూ.1,927 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న హెచ్చుతగ్గుల వల్ల లిస్టింగ్ సమయానికి ఈ అంచనాల్లో మార్పులు ఉండవచ్చు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- అప్లై చేయాలా? వద్దా?

దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓపై సానుకూల ధోరణిని వ్యక్తం చేశాయి:

"భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, క్యాపిటల్ మార్కెట్లలో పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఎన్‌ఎస్‌ఈకి ప్రధాన బలంగా నిలుస్తాయి. కొత్త ప్రొడక్ట్ విభాగాలు, అధునాతన సాంకేతిక వేదిక ద్వారా కంపెనీ తన ఆదాయ మార్గాలను విస్తరించుకుంటోంది," అని ఎస్బీఐ సెక్యూరిటీస్ పేర్కొంది.

"బీఎస్‌ఈ వ్యాల్యుయేషన్‌తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ధర చాలా ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఈ పీ/ఈ మల్టిపుల్ 54.2xగా ఉండగా, ఎన్‌ఎస్‌ఈ పోస్ట్-ఇష్యూ పీ/ఈ 35.4x వద్ద లభిస్తోంది. డెరివేటివ్స్ వాల్యూమ్స్ విషయంలో నియంత్రణల పరంగా తాత్కాలిక సవాళ్లు ఉన్నప్పటికీ, సుదీర్ఘ కాలానికి ఇది మంచి ఎంపిక," అని ఏంజెల్ వన్ సంస్థ 'సబ్‌స్క్రైబ్' రేటింగ్ ఇచ్చింది.

"ఎన్‌ఎస్‌ఈకి చెందిన అసెట్-లైట్ బిజినెస్ మోడల్ వల్ల మార్జిన్లు, క్యాష్ ఫ్లో చాలా బలంగా ఉంటాయి. మధ్యస్థ నుంచి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవడం మంచిది," అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ సూచించింది.

"డెరివేటివ్స్ రంగంలో రోజురోజుకు పోటీ పెరుగుతున్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఈ వద్ద ఉన్న భారీ నెట్‌వర్క్, అధిపత్యం కలిగిన మార్కెట్ షేర్ దానికి గొప్ప రక్షణగా నిలుస్తాయి," అని నిర్మల్ బ్యాంగ్ సెక్యూరిటీస్ స్పష్టం చేస్తూ 'సబ్‌స్క్రైబ్' చేయవచ్చని తెలిపింది.

"ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ లీడర్‌షిప్ బలంగా ఉన్నప్పటికీ, ఎఫ్‌అండ్ఓ విభాగానికి సంబంధించి సెబీ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు కంపెనీ లాభాలపై కొంత ప్రభావం చూపవచ్చు. ప్రస్తుత వ్యాల్యుయేషన్ల దృష్ట్యా ఈ ఇష్యూకి 'న్యూట్రల్' రేటింగ్ ఇస్తున్నాం," అని రెలిగేర్ బ్రోకింగ్ కాస్త ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించింది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ వివరాలు..

ఎన్‌ఎస్‌ఈ ఈ ఐపీఓ ద్వారా మునుపటి ప్రణాళిక ప్రకారం 14.89 కోట్ల షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ, సవరించిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఆ సంఖ్యను 12.644 కోట్ల షేర్లకు కుదించింది. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 5.1 శాతానికి సమానం. ఈ ఆఫర్ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) రూపంలోనే జరుగుతోంది. అంటే ఐపీఓ ద్వారా వచ్చే సొమ్ము కంపెనీకి వెళ్లకుండా, తమ వాటాలను విక్రయిస్తున్న పాత వాటాదారులకే చేరుతుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొదించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks