Neet refund : నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్- ఫీజు రీఫండ్‌పై అప్డేట్..
NEET UG 2026 : నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్. రద్దైన పరీక్షకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభంకానుంది. వాటితో పాటు జూన్‌లో జరగబోయే రీ- నీట్కి సంబంధించిన ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
పేపర్ లీక్ కారణంగా నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దాని స్థానంలో జూన్ 21న రీ-నీట్ జరగనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల కోసం ముఖ్యమైన గైడ్‌లైన్స్, క్లారిఫికేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. రద్దైన నీట్ పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియ, కొత్తగా ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపు, పరీక్ష రాయబోయే భాష తదితర అంశాలపై విద్యార్థుల్లో ఉన్న గందరగోళానికి ఈ తాజా అప్డేట్ ద్వారా ఎన్టీఏ తెరదించింది. ఆ వివరాలు..

నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ అప్డేట్..
మే 3న రాసిన నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయినందున, అభ్యర్థులు చెల్లించిన ఎగ్జామినేషన్ ఫీజును తిరిగి రీఫండ్ చేసేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. ఇందుకోసం అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించడానికి మే 21, 2026 నాటికి నీట్ అధికారిక పోర్టల్‌లో ఒక ప్రత్యేక మాడ్యూల్ అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం విద్యార్థులకు ఈ కింది మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు..
- తమ ప్రస్తుత చిరునామాను అప్డేట్ చేసుకోవచ్చు.
- రీ-ఎగ్జామ్ రాయాలనుకుంటున్న ప్రాధాన్యత పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
విద్యార్థులకు ఎంత రీఫండ్ వస్తుంది?
అభ్యర్థులు ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు ఏ కేటగిరీ (జనరల్/ ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ) కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఆ కేటగిరీ ఆధారంగానే రీఫండ్ మొత్తం లభిస్తుంది. అప్లికేషన్ ఫీజుతో పాటు అప్పట్లో చెల్లించిన ప్రాసెసింగ్ ఛార్జీలు, జీఎస్టీని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
- జనరల్- అప్లికేషన్ ఫీజు రూ. 1700
- జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్- అప్లికేషన్ ఫీజు రూ. 1600
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్- అప్లికేషన్ ఫీజు రూ. 9500
- విదేశాల్లో నీట్ యూజీ రాసిన వారి అప్లికేషన్ ఫీజు- రూ. 9500
అయితే, రాబోయే రీ-నీట్ 2026 రాసేందుకు విద్యార్థులు మళ్లీ రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.
రీ- నీట్ యూజీ 2026 పరీక్ష రాసే భాష మార్చుకోవచ్చా?
లేదు. అభ్యర్థులు మొదట అప్లికేషన్ సమర్పించినప్పుడు ఏ భాషనైతే (ఇంగ్లీష్, తెలుగు, హిందీ మొదలైనవి) ఎగ్జామినేషన్ మీడియంగా ఎంచుకున్నారో.. ఇప్పుడు అదే భాషలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. మీడియం మార్చుకోవడానికి ఎన్టీఏ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించదు.
ఎగ్జామ్ సిటీ సెలక్షన్ 'అన్‌అవైలబుల్' అని ఎందుకు వస్తోంది?:
కొంతమంది విద్యార్థులు తమ అడ్రస్ మార్చినప్పుడు ఎగ్జామ్ సిటీ సెలక్షన్ నాట్ అవైలబుల్ అని చూపిస్తోంది. దీనిపై ఎన్టీఏ స్పందిస్తూ.. కొన్ని ప్రాంతీయ భాషల పరీక్షా కేంద్రాలు కేవలం నిర్దిష్ట రాష్ట్రాలు లేదా నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థి ఎంచుకున్న పరీక్షా మాధ్యమాన్ని బట్టే నగరాల ఎంపిక ఆధారపడి ఉంటుందని వివరించింది.
మళ్లీ పాత పరీక్షా కేంద్రమే వస్తుందా?
రీ-ఎగ్జామ్‌కు మళ్లీ అదే సెంటర్ వస్తుందనే గ్యారెంటీ లేదు. అభ్యర్థులు ఎంచుకున్న ఎగ్జామ్ సిటీ, ఆయా కేంద్రాలలో ఉన్న సీట్ల లభ్యత, రాండమ్ అలాట్‌మెంట్ ప్రక్రియ ఆధారంగా కంప్యూటర్ కొత్త సెంటర్లను కేటాయిస్తుంది. కాబట్టి ఈసారి మీ పరీక్షా కేంద్రం మారే అవకాశం ఉంది.
గత పరీక్షలో సమస్యలు ఎదుర్కొన్నారా?
మే 3, 2026 న జరిగిన నీట్ యూజీ పరీక్ష సమయంలో ఏవైనా సెంటర్ల వద్ద ఇబ్బందులు లేదా సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు తమ ఫిర్యాదులను నేరుగా ఎన్టీఏకి తెలియజేయవచ్చు. విద్యార్థులు తమ ఫిర్యాదులను తగిన ఆధారాలు/పత్రాలతో కలిపి neetug2026@nta.ac.in అనే అధికారిక ఈమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


