...
...
Next Story

PM Kisan : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధులు విడుదల ఎప్పుడు?

పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదలైన వేళ, కోట్లాది మంది రైతులు 24వ విడత రూ.2,000 కోసం ఎదురుచూస్తున్నారు. తదుపరి విడత ఎప్పుడు రావచ్చు? రూ.2,000 మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవ్వాలంటే పూర్తి చేయాల్సిన పనులేంటో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 30, 2026, 09:59:25 IST
Advertisement

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ప్రస్తుతం ఎదురుచూస్తున్న ప్రధాన అంశం.. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ 24వ విడత సహాయం! ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న ప్రతి రైతుకు ప్రతీ నాలుగు నెలలకొకసారి రూ.2,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయన్న సంగతి తెలిసిందే. ఎక్కడా దళారీల ప్రసక్తి లేకుండా, ఎలాంటి కాగితాల హడావుడి లేకుండా 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (డీబీటీ) పద్ధతిలో ప్రభుత్వం ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తోంది.

పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు పడేది ఎప్పుడు?
పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు పడేది ఎప్పుడు?

ఇప్పటికే 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంతో, ఇప్పుడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతలో రూ.2,000 ఎప్పుడు ఖాతాల్లో పడతాయి? ఆ సొమ్ము ఆగకుండా రావాలంటే మనం ముందే ఏం పూర్తి చేయాలి? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము..

అసలు ఏంటి ఈ 'పీఎం కిసాన్' పథకం?

దేశంలోని చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశిష్ట పథకమే పీఎం కిసాన్. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 అందిస్తారు. ఈ మొత్తాన్ని ఏడాదికి మూడు విడతల్లో, ఒక్కో విడతకు రూ.2,000 చొప్పున ప్రతి నాలుగు నెలలకొకసారి డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుతో పాటు ఇతర వ్యవసాయ సాగు ఖర్చుల కోసం రైతులు ఇతరులపై ఆధారపడకుండా ఈ నిధులు తోడ్పడుతున్నాయి.

పీఎం కిసాన్ 24వ విడత: డబ్బులు ఎప్పుడు రావచ్చు?

రైతులందరూ ఆసక్తిగా వేచి చూస్తున్న సమాచారం ఇదే.

గత 23వ విడత నిధులను 2026 జూన్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దాదాపు 9.4 కోట్లకు పైగా రైతు కుటుంబాల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లకు పైగా నిధులు నేరుగా జమ అయ్యాయి.

పీఎం కిసాన్ ఆర్థిక సంవత్సరాన్ని మూడు సైకిల్స్​గా విభజించారు:

  • ఏప్రిల్ నుంచి జులై
  • ఆగస్టు నుంచి నవంబర్
  • డిసెంబర్ నుంచి మార్చి

జూన్ 20న విడుదలైన 23వ విడత నిధులు ఏప్రిల్ - జులై కాలానికి సంబంధించినవి. కాబట్టి, రాబోయే 24వ విడత ఆగస్టు - నవంబర్ కాలానికి వర్తిస్తుంది. అందుకే అక్టోబర్‌లో ఈ నిధులు జమ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

24వ విడత డబ్బులు ఎవరికి వస్తాయి?

  • రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన అందరి ఖాతాల్లోనూ ప్రతీసారి డబ్బులు పడవు. 24వ విడత సహాయం మీ అకౌంట్‌లో జమ కావాలంటే ఈ కింది అర్హతలు/నిబంధనలు తప్పనిసరిగా ఉండాలి:
  • మీ పేరిట లేదా మీ కుటుంబం పేరిట వ్యవసాయ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉండాలి.
  • మీ పీఎం కిసాన్ ఖాతాకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయి ఉండాలి.
  • బ్యాంక్ ఖాతా, పీఎం కిసాన్ ఐడీకి ఆధార్ అనుసంధానం పూర్తయి ఉండాలి.
  • భూమి వివరాల సమగ్ర పరిశీలన పూర్తయి 'YES' అని ఉండాలి.
  • పోర్టల్‌లో మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా, యాక్టివ్​గా ఉండాలి.
  • వీటిలో ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా, మీకు అర్హత ఉన్నప్పటికీ రూ.2,000 ఖాతాలో పడవు.

మీ పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా..

ఈ దఫా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడత నిధులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పనిలేదు. మీ మొబైల్‌లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు:

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలోని "Farmers Corner" విభాగానికి వెళ్లండి.
  • అక్కడ "Know Your Status" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయండి (ఒకవేళ నంబర్ గుర్తులేకపోతే, మీ మొబైల్ లేదా ఆధార్ నంబర్ ఓటీపీ ద్వారా నంబర్ పొందవచ్చు).
  • స్క్రీన్ పై కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి "Get Data" పై క్లిక్ చేయండి.
  • వెంటనే మీ పీఎం కిసాన్ స్టేటస్, ఇ-కేవైసీ, ల్యాండ్ సీడింగ్ వివరాలు, గతంలో వచ్చిన విడతల హిస్టరీ మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

అలాగే మీ ఖాతాలో డబ్బులు జమ కాగానే మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు "PM-KISAN-BNFT" నుంచి ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో మెసేజ్ కూడా వస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe