...
...
Next Story

PM RAHAT : రోడ్డు ప్రమాద బాధితులకు వరం ఈ కొత్త పథకం! రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం..

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'PM RAHAT' పథకాన్ని ప్రారంభించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి 'గోల్డెన్ అవర్'లో నగదు రహిత చికిత్స అందించడమే దీని లక్ష్యం. బాధితులకు రూ. 1.5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Feb 17, 2026 06:46 AM IST
Advertisement

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షణక్షణం ఎంతో విలువైనది. ఆ సమయంలో డబ్బు లేకో, ఆసుపత్రి ఫార్మాలిటీల వల్లో వైద్యం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 'పీఎం రాహత్​' (రోడ్​ యాక్సిడెంట్​ విక్టిమ్​ హాస్పిటలైజేషన్​ అండ్​ అష్యూర్డ్​ ట్రీట్​మెంట్​) పథకాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ఎటువంటి ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే అత్యుత్తమ వైద్యం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

పీఎం రాహత్​ పథకం- గోల్డెన్ అవర్‌లో ప్రాణ రక్షణే లక్ష్యం..

రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స కోసం పీఎం రాహత్​..
రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స కోసం పీఎం రాహత్​..

ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో 'గోల్డెన్ అవర్' అంటారు. ఈ సమయంలో సరైన చికిత్స అందితే బాధితుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని నివారించేందుకు పీఎం రాహత్​ ద్వారా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సను ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తోంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

పీఎం రాహత్​ పథకం- ఎక్కడైనా.. ఎవరికైనా..

ఈ పథకం కేవలం జాతీయ రహదారులకే పరిమితం కాదు. రాష్ట్ర రహదారులు, నగరంలోని వీధులు.. ఇలా ఎక్కడ ప్రమాదం జరిగినా బాధితులు ఈ లబ్ధిని పొందవచ్చు.

సాధారణ గాయాలైతే: 24 గంటల వరకు స్టెబిలైజేషన్​ చికిత్స అందిస్తారు.

తీవ్రమైన గాయాలైతే: డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా చికిత్సను 48 గంటల వరకు లేదా అవసరాన్ని బట్టి పొడిగిస్తారు.

పీఎం రాహత్​ పథకం- అత్యవసర సేవల అనుసంధానం

ప్రమాదం జరిగినప్పుడు బాధితులు కానీ, అటుగా వెళ్లే వారు (రహ-వీర్) లేదా సాక్షులు ఎవరైనా సరే వెంటనే 112 (ఈఆర్​ఎస్​ఎస్​) నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా సమీపంలోని ఆసుపత్రిని గుర్తించడం, అంబులెన్స్ సదుపాయం కల్పించడం సులభతరమవుతుంది. పోలీసు విభాగం, ఆరోగ్య శాఖ, అత్యవసర సేవల మధ్య సమన్వయం పెంచడం ద్వారా బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి చేర్చేలా ఈ నెట్‌వర్క్‌ను రూపొందించారు.

ఆసుపత్రులకు చెల్లింపులు ఎలా?

ప్రమాదానికి కారణమైన వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటే, ఆ బీమా కంపెనీలు ఖర్చును భరిస్తాయి.

ఒకవేళ వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోయినా లేదా హిట్ అండ్ రన్ (ప్రమాదం చేసి ఆపకుండా వెళ్లడం) కేసుల్లో ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఈ ఖర్చులను చెల్లిస్తుంది.

ఆసుపత్రులు సమర్పించిన క్లెయిమ్స్‌ను స్టేట్ హెల్త్ ఏజెన్సీ 10 రోజుల్లోపు పరిష్కరిస్తుంది. దీనివల్ల ఆసుపత్రులకు పేమెంట్ విషయంలో భరోసా ఉంటుంది. తద్వారా వారు బాధితులకు చికిత్స అందించడంలో వెనకడుగు వేయరు.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- PM RAHAT పథకం కింద ఉచిత వైద్యం పొందడానికి ప్రమాదం ఎక్కడ జరిగి ఉండాలి?

సమాధానం- ఈ పథకం దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. ప్రమాదం జాతీయ రహదారి పైనే జరగాలని నిబంధన ఏమీ లేదు. రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు లేదా నగరంలోని గల్లీల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా బాధితులు ఈ నగదు రహిత చికిత్సను పొందవచ్చు.

ప్రశ్న- ప్రమాదానికి కారణమైన వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే బాధితులకు వైద్యం అందుతుందా?

సమాధానం- అవును, తప్పకుండా అందుతుంది. ప్రమాదానికి కారణమైన వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, లేదా అది 'హిట్ అండ్ రన్' కేసు (ప్రమాదం చేసి వాహనం పరారవ్వడం) అయినా సరే, బాధితులకు చికిత్స ఆగిపోదు. అటువంటి సందర్భాల్లో అయ్యే ఖర్చును ప్రభుత్వమే తన బడ్జెట్ నిధుల ద్వారా భరిస్తుంది.

ప్రశ్న- ఈ పథకం కింద గరిష్టంగా ఎంతవరకు ఆర్థిక సాయం లభిస్తుంది?

సమాధానం- PM RAHAT పథకం ద్వారా ప్రతి బాధితుడికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత (క్యాష్​లెస్​) చికిత్స అందుతుంది. ప్రమాదం జరిగిన సమయం నుంచి ఏడు రోజుల వరకు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించి ప్రాణాలను కాపాడటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe