...
...
Next Story

PM Modi new video : ‘నన్ను దూషించిన విద్యార్థులను క్షమించాలని ఉంది’- ప్రధాని మోదీ..

PM Modi Instagram : దిల్లీ జంతర్ మంతర్ నిరసనల్లో తనను, తన దివంగత తల్లిని దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. యువతను శిక్షించకుండా సరైన మార్గంలో నడిపించాలని సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.

Published on: Aug 1, 2026, 06:50:23 IST
Advertisement

ఇటీవల దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా కొందరు విద్యార్థులు తనపై, తన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. సదరు విద్యార్థులను తాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని, వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడమే సమాజ బాధ్యత అని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. (@narendramodi X)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. (@narendramodi X)

జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనలో.. దేశవ్యాప్తంగా వచ్చిన కొందరు పిల్లలు అత్యంత దారుణమైన పదజాలాన్ని ఉపయోగించారు. నన్ను, నా దివంగత తల్లిని కూడా దూషించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా కలచివేశాయి,” అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఇటువంటి ఘటనల్లో సుదీర్ఘ చట్టపరమైన చర్యలు లేదా శిక్షలు ఏమాత్రం పరిష్కారం కావని మోదీ స్పష్టం చేశారు. “పిల్లలు తప్పులు చేయడం సహజం. ఆ తప్పులను దిద్దుకునేందుకు వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం కూడా ఇదే (చిన్నతనమే),” అని ఆయన వ్యాఖ్యానించారు.

వారిని క్షమించాలనే తన నిర్ణయాన్ని సమాజం కూడా ఏకీభవించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. “నన్ను దూషించిన వారిని నేను క్షమించాలనుకుంటున్నాను. నా ఈ నిర్ణయాన్ని సమాజం కూడా ఆమోదించాలని కోరుతున్నాను,” అని ఆయన చెప్పారు.

“కొన్నిసార్లు మన పళ్ల మధ్య మన నాలుక అనుకోకుండా నలిగి రక్తం వస్తుంది. అంతమాత్రాన మన పళ్లను మనం విరగ్గొట్టుకోము కదా! ఎందుకంటే పళ్లు, నాలుక రెండూ మనవే,” అని పేర్కొన్నారు.

విద్యార్థులను సమాజం నుంచి వెలివేయకుండా దగ్గరకు తీసుకోవాలని మోదీ కోరారు. “వారు దారితప్పారు.. వారికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా సామాజికంగా వేధించడం వల్ల ఏ మార్పూ రాదు,” అని వివరించారు.

"తప్పుల నుంచి నేర్చుకుందాం.. దేశాన్ని నిర్మిద్దాం"

“దూషణలు ఎప్పటికీ దేనికీ పరిష్కారం కావు. దారితప్పిన వారికి మార్గం చూపుదాం. కలిసికట్టుగా పనిచేద్దాం. భారత్ కోసం శ్రమిద్దాం,” అనే పిలుపుతో ప్రధాని తన వీడియోను ముగించారు.

జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు..

మరోవైపు ఈ వివాదానికి సంబంధించి చట్టపరమైన చర్యలు కూడా కొనసాగుతున్నాయి. నీట్ నిరసనల్లో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాకు చెందిన ఒక మహిళపై పోలీసులు 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించేలా, ప్రజల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా ప్రధానిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఘాజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్​ఎస్)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద పోలీసులు ఈ కేసును నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు ఉండటంతో, ఈ కేసును విచారణాధికార పరిధి ఉన్న పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ముగిసిన నీట్ నిరసనలు..

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్‌పై గత ఐదు వారాల పాటు జరిగిన నిరసనలు జులై 25న ముగిశాయి. ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షతో పాటు వేలాది మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తీవ్రమైన ఉద్రిక్తతలు, జులై 20న జరిగిన 'చలో సంసద్' మార్చ్ అనంతరం అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేలా సంస్కరణలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సీజేపీ తమ నిరసనలను విరమించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe