...
...
Next Story

ఓట్ల తొలగింపుపై సమరభేరి: సెప్టెంబర్ 1న బెంగళూరులో ప్రకాశ్ రాజ్ నిరసన ర్యాలీ

కర్ణాటకలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR)-2026 పై వివాదం ముదురుతోంది. ఏకంగా 1.08 కోట్ల మంది ఓటర్లను తొలగింపు జాబితాలో పెట్టడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published on: Aug 27, 2026, 17:53:27 IST
Advertisement

కర్ణాటక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలపై ప్రజా సంఘాలు, పౌర హక్కుల వేదికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై సినీ నటుడు, దర్శక-నిర్మాత ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సెప్టెంబర్ 1న బెంగళూరులో ‘ఛలో ఎలక్షన్ కమిషన్’ పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఓట్ల తొలగింపుపై సమరభేరి: సెప్టెంబర్ 1న బెంగళూరులో ప్రకాశ్ రాజ్ నిరసన ర్యాలీ (PTI)
ఓట్ల తొలగింపుపై సమరభేరి: సెప్టెంబర్ 1న బెంగళూరులో ప్రకాశ్ రాజ్ నిరసన ర్యాలీ (PTI)

బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, సీఐఆర్‌-2026 ప్రక్రియపై స్టే విధించాలని కోరుతూ పౌర సమాజ సంఘాలు త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు.

"ఈ దేశంలో ఒక ఓటరు, సాధారణ పౌరుడు తన హక్కుల కోసం ఎన్నేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగాలి? ఓటర్లను ఎందుకు ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు? కర్ణాటకలో శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అలాంటప్పుడు ఇంత హడావుడిగా ఓటర్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాల్సిన అత్యవసరమేమొచ్చింది?" అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు.

రాజ్యాంగబద్ధమైన ప్రక్రియేనా? ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు

ఎన్నికల కమిషనర్ల ఎంపిక విధానంపై కూడా ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియామక ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా లేదని ఆయన ఆరోపించారు.

"కమిటీలో అధికార పక్షం నుంచి ఇద్దరు, ప్రతిపక్షం నుంచి ఒక్కరు మాత్రమే ఉంటే అక్కడ ప్రజాస్వామ్యానికి చోటెక్కడుంది? అంతేకాకుండా ఎన్నికల కమిషన్ అధికారులకు చట్టపరమైన మినహాయింపు (Judicial Immunity) కల్పిస్తూ పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అధికారులు ఎలాంటి తప్పులు చేసినా వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుండదు. ఇది అధికారులకు మితిమీరిన స్వేచ్ఛను ఇస్తూ, జవాబుదారీతనాన్ని నిర్వీర్యం చేయడమే" అని ఆయన అభిప్రాయపడ్డారు.

1.08 కోట్ల ఓటర్లకు ముప్పు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆందోళన

అంతేకాకుండా, దాదాపు 43 లక్షల మంది ఓటర్లకు డేటా వ్యత్యాసాలు (Logical Discrepancies), 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ లింక్ లేదనే కారణంతో నోటీసులు పంపనున్నట్లు శివకుమార్ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు డీకే శివకుమార్ లేఖ రాశారు. అర్హులైన నిజమైన ఓటర్లు తమ అభ్యంతరాలను, ఆధారాలను దాఖలు చేయడానికి సమయాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

"ఓటర్లు ఇళ్లు మారడం, పేదరికం, ఆధారాలు లేకపోవడం లేదా అవగాహన లోపం వంటి కారణాల వల్ల ఓటు హక్కును కోల్పోకూడదు. భారీగా వస్తున్న దరఖాస్తులు, అభ్యంతరాలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడానికి ఎన్నికల నమోదు అధికారులు (ERO), జిల్లా ఎన్నికల అధికారుల (DEO) సంఖ్యను పెంచాలి" అని శివకుమార్ కోరారు.

ఎన్నికల సంఘం ఏమంటోంది?

ఈ వివాదంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందిస్తూ, సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) చేపట్టడానికి ఎంతో "గుండె ధైర్యం" (Guts) కావాలని అన్నారు. లక్నోలో జరిగిన 'ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ (ELC 2.0)' ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.

"ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను దిగ్విజయం చేయడానికి ఎన్నికల సంఘానికి ధైర్యంతో పాటు ఓటర్ల సహకారం కూడా చాలా అవసరం. భారత ఎన్నికల సంఘం పనితీరును చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. దేశంలో ఎన్నికల ప్రక్రియ అంతా రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, రాజకీయాధికారులు, అభ్యర్థుల సమక్షంలోనే జరుగుతుంది" అని CEC జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో బెంగళూరు వేదికగా జరగనున్న నిరసనలు, న్యాయపోరాటాలు కర్ణాటక రాజకీయంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe