లక్ష్యం పట్ల పట్టుదల, దాన్ని చేరుకోవాలనే కసి ఉంటే పేదరికం కూడా అడ్డుకాదని ఒక యువకుడు నిరూపించాడు! ఫ్యాక్టరీలో వర్కర్‌గా పని చేస్తూనే, కోడింగ్ నేర్చుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదిగిన పుణెకు చెందిన సంభవ్ వఖారియా కథ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో వైరల్‌గా మారింది.

"కేవలం ఏడాదిన్నర కఠోర శ్రమతో.. ఫ్యాక్టరీ వర్కర్ నుంచి ఫుల్-స్టాక్ డెవలపర్‌గా మారాను," అంటూ సంభవ్ తన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.
కన్నీటి నుంచి కోడింగ్ వైపు..
సంభవ్ పోస్ట్ ప్రకారం.. ఏడాదిన్నర క్రితం అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే కాలేజీ చదువు ఆపేయాల్సి వచ్చింది. దానితో కుటుంబాన్ని పోషించడానికి ఒక కూరగాయల ఫ్యాక్టరీలో రోజుకు 10 గంటల పాటు కష్టపడేవాడు. ప్యాకింగ్ చేయడం, బరువులు మోయడం వంటి పనులతో శారీరకంగా చాలా అలసిపోయేవాడు.
"చదువు ఆగిపోవడంతో నా కెరీర్ ఇక ముగిసిపోయింది అనుకున్నాను," అని అతను నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
అయితే, ఒక స్నేహితుడు ఇచ్చిన సలహా సంభవ్ జీవితాన్ని మలుపు తిప్పింది. కోడింగ్ నేర్చుకోమని ఆ స్నేహితుడు చెప్పడంతో.. తన వద్ద ఉన్న కొద్దిపాటి సేవింగ్స్, తల్లిదండ్రుల సహాయంతో ఒక లాప్‌టాప్ కొన్నాడు. వెంటనే ఫ్యాక్టరీ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి ఇంటర్నెట్టే తన ప్రపంచంగా మార్చుకున్నాడు.
"ఏదైనా నేర్చుకోవడానికి కావలసిన సమాచారం అంతా ఇంటర్నెట్‌లో ఉచితంగా దొరుకుతుంది అని ఎలాన్ మస్క్ చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి," అని సంభవ్ తెలిపాడు.
కృషి ఉంటే.. ఏదైనా సాధ్యమే!
ఖరీదైన కోర్సుల్లో చేరకుండానే.. కేవలం ఒక్క నెలలోనే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాడు సంభవ్. ఆ తర్వాత రియాక్ట్ వంటి అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అఫీషియల్ డాక్యుమెంట్లు, ప్రాజెక్టుల మీద ఆధారపడ్డాడు. తప్పుల నుంచే కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాడు.
{{/usCountry}}ఖరీదైన కోర్సుల్లో చేరకుండానే.. కేవలం ఒక్క నెలలోనే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాడు సంభవ్. ఆ తర్వాత రియాక్ట్ వంటి అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అఫీషియల్ డాక్యుమెంట్లు, ప్రాజెక్టుల మీద ఆధారపడ్డాడు. తప్పుల నుంచే కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాడు.
{{/usCountry}}మొదట్లో ఇంటర్న్‌షిప్ సాధించడం కష్టమైనా, పట్టు వదలకుండా ప్రయత్నించి విజయం సాధించాడు. ఈ ప్రయాణంలో అతనికి వ్యక్తిగత సమస్యలు కూడా ఎదురయ్యాయి. తన తాతయ్యకు గుండెపోటు రావడంతో కొన్ని రోజులు విరామం ఇవ్వాల్సి వచ్చింది. అ కష్టకాలం నుంచి తిరిగి కోలుకున్నాక ఫ్రీలాన్స్ ప్రాజెక్టులతో మళ్లీ బిజీ అయ్యాడు.
"నా ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, అనిశ్చితి, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మీరు సున్నా నుంచి మొదలుపెట్టినా సరే.. ఒకటి లేదా రెండేళ్ల పాటు ఏకాగ్రతతో కష్టపడితే మీ జీవితమే మారిపోతుంది," అంటూ తనలాంటి ఎంతోమంది యువతకు సంభవ్ భరోసానిచ్చాడు.
“నేనేదో గొప్ప అని చెప్పుకునేందుకు ఇదంతా నేను చెప్పడం లేదు. వాస్తవానికి ఇది సాధ్యం అవుతుందని నేను కూడా ఊహించలేదు,” అని సంభవ్ చెప్పుకొచ్చాడు.
నెటిజన్ల ప్రశంసలు..
సంభవ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. అతని నిజాయితీని, పట్టుదలను నెటిజన్లు కొనియాడుతున్నారు.
"ఇది నిజంగా అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథ.. ఇలాగే ముందుకు సాగండి," అని ఒకరు కామెంట్ చేయగా..
"నేను ఇంటర్నెట్ బిల్లు కట్టేది ఇలాంటి మంచి పోస్టులు చూడటానికే," అని మరొక యూజర్ ప్రశంసించారు.
కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, కొత్త దారి వెతుక్కుంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని సంభవ్ నిరూపించాడు.