...
...
Next Story

ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్ గాంధీ.. CJP విద్యార్థులపై దాడికి నిరసనగా ధర్నా

సీజేపీ విద్యార్థి ఆందోళనకారులపై ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్, దాడిని నిరసిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం (7, లోక్ కళ్యాణ్ మార్గ్) ముట్టడికి దిగారు.

Published on: Jul 21, 2026, 17:07:56 IST
Advertisement

ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల వేడి తీవ్రరూపం దాల్చింది. మంగళవారం (జూలై 21, 2026) పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం (7, లోక్ కళ్యాణ్ మార్గ్) వెలుపల భారీ ధర్నా చేపట్టారు.

ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్ గాంధీ.. CJP విద్యార్థులపై దాడికి నిరసనగా ధర్నా (X/@RahulGandhi)
ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్ గాంధీ.. CJP విద్యార్థులపై దాడికి నిరసనగా ధర్నా (X/@RahulGandhi)

సోమవారం 'సన్సద్ ఛలో' మార్చ్ చేపట్టిన సిజెపి (CJP) విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్‌కు నిరసనగా రాహుల్ గాంధీ ఈ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ ధర్నాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరాతో సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఒక ప్రతిపక్ష నేత నేరుగా ప్రధాని నివాసం ఎదుట బైఠాయించి నిరసన తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

“నిన్న యువ విద్యార్థులపై జరిగిన క్రూరమైన దాడికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఈ అంశంపై బాధ్యత వహించడానికి కానీ, పార్లమెంట్‌లో చర్చించడానికి కానీ సిద్ధంగా లేదు. దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధాని, హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి” అని రాహుల్ గాంధీ (సామాజిక మాధ్యమం 'X' లో) పేర్కొన్నారు.

'ఆయన్ను నిద్రలేపేందుకే ఇక్కడికి వచ్చాం'

పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యపై చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తమకు అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. సభలో చర్చ జరగాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ తనకు చెప్పారని వెల్లడించారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్, "పదండి.. ఈ విషయంలో ప్రధానిని నిద్రలేపుదాం" అని ఎంపీలతో చెప్పి నిరసన ప్రదర్శనగా ప్రధాని నివాసానికి బయలుదేరారు.

ప్రధాని నివాసానికి బయలుదేరే ముందు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని విమర్శించారు. దేశ విద్యా వ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్ (RSS) తన గుప్పెట్లోకి తీసుకుందని, మోదీ ప్రభుత్వం విద్యార్థుల కంటే పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.

ఆస్పత్రిలో విద్యార్థుల పరామర్శ:

మీడియా సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో కలిసి రామ్‌ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష

మరోవైపు ప్రముఖ పర్యావరణ వేత్త, విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. జూలై 18న ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన రక్తంలో పొటాషియం స్థాయిలు 3.2 mEq/L కి పడిపోయాయి. ఆయన సెలైన్ (IV fluids), గ్లూకోజ్ తీసుకోవడానికి నిరాకరిస్తూ కేవలం ఓఆర్‌ఎస్ (ORS), పొటాషియం టాబ్లెట్లు మాత్రమే తీసుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks