...
...
Next Story

Rain Alert : రుతుపవనాల ఎఫెక్ట్- కేరళ, బెంగళూరులో భారీ వర్షాలు! ఏపీ, తెలంగాణలో కూడా..

Southwest monsoon : సాధారణం కంటే మూడు రోజులు ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

Published on: Jun 5, 2026, 09:08:18 IST
Advertisement

దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. సాధారణ షెడ్యూల్ కంటే మూడు రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. దక్షిణ ద్వీపకల్పం అంతటా ఈ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో శుక్రవారం దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుందని ఐఎండీ వెల్లడించింది. రాబోయే వారం రోజుల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోనూ విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

నైరుతి రుతుపవనాలతో వర్షాలే వర్షాలు.. (PTI)
నైరుతి రుతుపవనాలతో వర్షాలే వర్షాలు.. (PTI)

మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి భిన్నంగా వాయవ్య, మధ్య భారత ప్రాంతాల్లో మాత్రం ఒకవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరోవైపు ముంచుకొస్తున్న వడగాల్పులు ప్రజలను ఇబ్బంది పెట్టనున్నాయి.

తెలంగాణ, ఏపీల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?

తెలంగాణవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కోస్తా ఆంధ్రా, యానాంలో శుక్రవారం (జూన్ 5) వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్లీ జూన్ 9, 10 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇతర దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఇలా..

కర్ణాటక: నైరుతి రుతుపవనాల కారణంగా రాజధాని బెంగళూరుతో పాటు కర్ణాటకలోని మెజారిటీ ప్రాంతాలకు వాతావరణ శాఖ 'యెల్లో అలెర్ట్' ప్రకటించింది. అదే సమయంలో దక్షణ కన్నడ జిల్లాకు 'ఆరెంజ్ అలెర్ట్' జారీ అయింది, అక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.

దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలు, ఉరుములు ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచాయి. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఏకంగా 19 డిగ్రీల వరకు పడిపోవడం గమనార్హం. దిల్లీ, హరియాణా, చండీగఢ్‌లలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

ఉత్తర, మధ్య భారత దేశంలోని పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

“మధ్య పాకిస్తాన్, హరియాణా, వాయవ్య రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన కొత్త వెస్టర్న్ డిస్టర్బెన్స్, ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన వాతావరణం ఉంటుంది,” అని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ వివరించారు.

అయితే, ఎండల తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. జూన్ 6 నుంచి బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో, జూన్ 7 నుంచి తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అప్రమత్తం చేసింది.

ఈశాన్య రాష్ట్రాల్లో జలప్రళయం? అరుణాచల్‌కు ప్రత్యేక హెచ్చరిక!

ఈశాన్య భారతంలో వర్షాల జోరు తగ్గడం లేదు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాలకు 'వాచ్' కేటగిరీ కింద హెచ్చరికలు జారీ చేశారు. కురుంగ్ కుమే, లోయర్ సుబన్‌సిరి, పపుమ్ పరే, లేపరాడ జిల్లాలకు అలెర్ట్ లెవెల్ హెచ్చరికలు జారీ కాగా, క్రా దాది జిల్లాకు అత్యంత తీవ్రమైన వాతావరణ హెచ్చరికను జారీ చేశారు. రాబోయే ఐదు రోజుల పాటు ఇక్కడ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks