కీలకమైన రెపో రేటు విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ప్రస్తుతానికి వడ్డీ రేట్లను పెంచకూడదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తాజా పరపతి విధాన సమీక్షకు సంబంధించి బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఫలితంగా రెపో రేటు 5.25శాతంగానే కొనసాగనుంది.

ఆర్బీఐ రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా రెండోసారి. గత ఏడాది డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్ల కోత విధించిన తర్వాత.. ఫిబ్రవరిలో, ఇప్పుడు ఏప్రిల్‌లోనూ రేట్లను స్థిరంగా ఉంచారు.
బ్యాంకుల వడ్డీ రేట్లు.. ఇతర గణాంకాలు
రెపో రేటులో మార్పు లేకపోవడంతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే ఎస్‌డీఎఫ్ రేటు 5% వద్దే ఉంటుంది. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు (ఎంఎస్ఎఫ్), బ్యాంక్ రేటు 5.50% వద్ద కొనసాగుతాయి. ప్రస్తుతం మార్కెట్లో నగదు లభ్యత సమతుల్యంగా ఉండాలని కమిటీ ఈ 'తటస్థ' (న్యూట్రల్) వైఖరిని అవలంబిస్తోంది.
ద్రవ్యోల్బణంపై నిఘా.. సామాన్యుడికి ఊరట ఎంత?
ధరల పెరుగుదల అనేది సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 4.6% గా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలను పెంచే ప్రమాదం ఉందని గవర్నర్ హెచ్చరించారు.
ఆహార ధరలు: రబీ పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటం, జలాశయాల్లో నీటి నిల్వలు సరిపడా ఉండటం ఊరటనిచ్చే అంశం.
ఎల్ నినో ముప్పు: ఒకవేళ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే రుతుపవనాలపై ప్రభావం పడి, ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది.
వృద్ధి రేటు అంచనాలు ఇవే..
{{/usCountry}}ఎల్ నినో ముప్పు: ఒకవేళ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే రుతుపవనాలపై ప్రభావం పడి, ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది.
వృద్ధి రేటు అంచనాలు ఇవే..
{{/usCountry}}భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి కొంత నెమ్మదించే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.6% గా ఉంటుందని భావించగా, 2026-27 లో ఇది 6.9% కి పరిమితం కావొచ్చని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి, వాతావరణ మార్పులు దేశీయ వృద్ధికి సవాళ్లుగా మారుతాయని సంజయ్ మల్హోత్రా వివరించారు.
మన జేబుపై ప్రభావం ఏంటి?
ఆర్బీఐ రెపో రేటును పెంచకపోవడం వల్ల మీ హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐల పై తక్షణ భారం పడదు. అయితే, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే, అది రవాణా రంగం ద్వారా నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఎంతవరకు కట్టడి చేయగలుగుతుందనే దానిపైనే మధ్యతరగతి ప్రజల పొదుపు ఆధారపడి ఉంటుంది.
ముందే ఊహించిన విశ్లేషకులు..
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ నేపథ్యంలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను కట్ చేయకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడదే నిజమైంది.
“సాధారణంగా ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీలను తగ్గిస్తాయి. దీనివల్ల హోమ్ లోన్లు, కార్ లోన్లు తీసుకున్న మధ్యతరగతి ప్రజల ఈఎంఐలు తగ్గుతాయి. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా ఈసారి రెపో రేటు తగ్గే అవకాశం లేదు,” అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే విశ్లేషించింది.
స్టాక్ మార్కెట్ పరిస్థితి ఇలా..
అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ వార్తలతో భారీ లాభాల్లో దూసుకెళుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఆర్బీఐ ప్రకటన మరింత ఊతమిచ్చింది.
బుధవారం ఉదయం 11 గటంల 20 నిమిషాలకు బీఎస్ఈ సన్సెక్స్ 2592 పాయింట్లు పెరిగి 77,208 వద్దకు ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 777 పాయింట్లు వృద్ధిచెంది 23,902 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 2538 పాయింట్లు పెరిగి 55,215 వద్ద ఉంది.