బ్యాంక్ రుణాలు, ఈఎంఐల భారంపై మరో మూడు రోజుల్లో స్పష్టత రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం అక్టోబర్ 5న ప్రారంభమై 7వ తేదీ వరకు కొనసాగనుంది. దేశీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన అనంతరం, అక్టోబర్ 7న ఎంపీసీ తన కీలక నిర్ణయాలను వెల్లడించనుంది. ఫిబ్రవరి 2023 తర్వాత మొదటిసారిగా ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశాలు ఉన్నాయా అనే అంశంపై పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2025లో వరుసగా 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ, గత నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేపో రేటును 5.25 శాతం వద్ద మార్చకుండా యథాతథంగా ఉంచింది. అయితే, దేశంలో మళ్లీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ఇంధన ధరలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వంటి కారణాల వల్ల ఈసారి ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి.
రేపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెరుగుతుందా?
అక్టోబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే, ఫిబ్రవరి 2023 తర్వాత ఆర్బీఐ చేసే తొలి వడ్డీ రేట్ల పెంపు ఇదే అవుతుంది. మారిన ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా ఆర్బీఐ తన విధానంలో మార్పులు చేస్తుందనడానికి ఇది స్పష్టమైన సంకేతంగా నిలుస్తుంది.
2026లో ఇప్పటి వరకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన ఆర్బీఐపై, అక్టోబర్ సమీక్షలో రెపో రేటును పెంచాలనే ఒత్తిడి పెరుగుతోందని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పరిశోధనా విభాగం అధిపతి రాజీవ్ శరణ్ తెలిపారు.
"రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరడం, పండుగల సీజన్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం రేట్ల పెంపు వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బారెల్‌కు 100 డాలర్ల పైన కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 96 దాటి క్షీణించింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడంతో రెండు దేశాల వడ్డీ రేట్ల వ్యత్యాసం తగ్గి రూపాయిపై ఒత్తిడి పెరిగింది" అని రాజీవ్ శరణ్ విశ్లేషించారు.
{{/usCountry}}"రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరడం, పండుగల సీజన్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం రేట్ల పెంపు వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బారెల్‌కు 100 డాలర్ల పైన కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 96 దాటి క్షీణించింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడంతో రెండు దేశాల వడ్డీ రేట్ల వ్యత్యాసం తగ్గి రూపాయిపై ఒత్తిడి పెరిగింది" అని రాజీవ్ శరణ్ విశ్లేషించారు.
{{/usCountry}}అయినప్పటికీ ద్రవ్యోల్బణం ఇంకా ఆర్బీఐ నిర్దేశిత పరిమితిలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ధరల ఒత్తిడి ఇంకా అన్ని రంగాలకూ విస్తరించలేదని, అందుకే ఎంపీసీ ఈసారికి కూడా రేట్లను మార్చకుండా, కఠిన వైఖరిని (Hawkish stance) మాత్రమే కొనసాగించే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి వడ్డీ రేట్ల కోత సాధ్యం కాదని, రాబోయే రోజుల్లో రేట్లను పెంచడమే తప్ప తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
వడ్డీ రేట్లను ప్రభావితం చేసే 5 కీలక అంశాలు
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా తెలిపారు. "దేశీయ ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగినందున రాబోయే ఎంపీసీ సమావేశంలో రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడమే ప్రాథమిక అంచనాగా ఉంది" అని ఆమె పేర్కొన్నారు.
రేపో రేటు నిర్ణయాన్ని శాసించే ఐదు ముఖ్యమైన అంశాలు ఇవే:
1. దేశీయ ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరలు
జూలైలో 4.45 శాతంగా ఉన్న సీపీఐ రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నాటికి 4.82 శాతానికి పెరిగింది. ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యం కంటే ఎక్కువ. నిత్యావసర వస్తువులు, త్వరగా పాడైపోయే ఆహార పదార్థాల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ద్రవ్యోల్బణ అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
"కోర్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, ఆహార ధరలు పదే పదే పెరగడం వల్ల వేతనాలు, సేవల రంగాలపై పరోక్ష ప్రభావం పడుతుంది. ఇది ఆర్బీఐ ముందుజాగ్రత్తగా వడ్డీ రేట్లను పెంచేందుకు దారితీసే అవకాశం ఉంది" అని సీమా శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
2. క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు
తన చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడే భారత్ వంటి దేశానికి, బారెల్ క్రూడాయిల్ ధర 100 నుంచి 107 డాలర్ల మధ్య ఊగిసలాడటం దిగుమతి ద్రవ్యోల్బణ ముప్పును తెచ్చిపెడుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే అది ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.
"ఇంధన ధరలు తగ్గితే దేశీయ రవాణా ఖర్చులు తగ్గుతాయి. వాణిజ్య లోటు తగ్గి, తయారీ రంగానికి ఊరట లభిస్తుంది. ఇది ఎంపీసీ వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా ఉంచేందుకు వీలుకల్పిస్తుంది" అని సీమా శ్రీవాస్తవ తెలిపారు.
3. రూపాయి క్షీణత
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం ఎక్కువవుతుంది. కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడటానికి, విదేశీ పెట్టుబడులు బయటకు తరలిపోకుండా నిరోధించటానికి వడ్డీ రేట్ల వ్యత్యాసాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
"రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 97 వైపు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. బలహీనమైన కరెన్సీ వల్ల ముడి చమురు, ఇతర వస్తువుల దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. రూపాయి బలహీనతను, విదేశీ నిధుల ప్రవాహాన్ని ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తుంది. అయినప్పటికీ, రూపాయి రక్షణ మాత్రమే రేపో రేటు నిర్ణయానికి ఏకైక ప్రాతిపదిక కాదు" అని సుగంధ సచ్‌దేవా వివరించారు.
4. విదేశీ బాండ్ ఈల్డ్స్, పెట్టుబడుల తరలింపు
అభివృద్ధి చెందిన దేశాల్లో, ముఖ్యంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ద్రవ్య లభ్యత తగ్గుతుంది. దీనివల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులు వెనుకాడతారు. మన దేశీయ వడ్డీ రేట్లకు, విదేశీ వడ్డీ రేట్లకు మధ్య వ్యత్యాసం తగ్గితే, భారత ఈక్విటీ, బాండ్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) వేగంగా బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది.
5. బ్యాంకింగ్ ద్రవ్య లభ్యత, పండుగల సీజన్
బ్యాంకింగ్ వ్యవస్థలోని ద్రవ్య లభ్యత, రుణాలు ఇవ్వడంలో పురోగతి, పాలసీ రేట్ల ప్రసారం (Monetary policy transmission) వంటి అంశాలు కూడా ఎంపీసీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని సుగంధ సచ్‌దేవా తెలిపారు. ఆర్బీఐ గతంలో తీసుకున్న చర్యలు డిపాజిట్లు, రుణాల వడ్డీ రేట్లలో ప్రతిబింబిస్తున్నాయో లేదో పరిశీలిస్తుందని ఆమె చెప్పారు.
అక్టోబర్ సమావేశం పండుగల కొనుగోళ్ల సమయంతో సరిపోలుతుందని సీమా శ్రీవాస్తవ గుర్తుచేశారు. ఆటోమొబైల్, రిటైల్, గృహ రుణాలకు ఇది అత్యంత కీలకమైన సమయం. ఒకవేళ ఆర్బీఐ ఇప్పుడు రెపో రేటును పెంచితే, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ల (EBLR) ద్వారా రుణాలపై వడ్డీ భారం పెరుగుతుంది. ఇది పండుగల వేళ వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.