Renault Duster mileage : క్రెటా, సెల్టోస్ కంటే.. రెనాల్ట్ డస్టర్ మైలేజే ఎక్కువ!
Renault Duster : కొత్త రెనాల్ట్ డస్టర్ టర్బో టీసీఈ 100 మైలేజ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ లీటరుకు 19.41 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్‌ను ఇస్తుందని ఏఆర్ఏఐ ధృవీకరించింది. రూ. 10.49 లక్షల ఆరంభ ధరతో లభించే ఈ కారు క్రెటా, సెల్టోస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్రెండ్‌కు ఊపిరి పోసిన మోడల్ 'రెనాల్ట్ డస్టర్' ఇప్పుడు సరికొత్తగా రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. డస్టర్ టర్బో టీసీఈ 100 మోడల్‌కు సంబంధించిన అధికారిక మైలేజ్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ సరికొత్త 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వెర్షన్ లీటరుకు ఏకంగా 19.41 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇప్పటివరకు కొత్త జనరేషన్ డస్టర్ సిరీస్‌లో ప్రకటించిన అన్ని వేరియంట్లలో కెల్లా ఇదే అత్యంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కావడం విశేషం.

రెనాల్ట్ డస్టర్ మైలేజ్- పెద్ద ఇంజన్ కంటే చిన్నదే బెటర్!
మైలేజ్ పరంగా చూస్తే, ఈ చిన్న 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. డస్టర్‌లోని పెద్దదైన 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ కంటే చాలా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. పోలిక కోసం చూసుకుంటే, డస్టర్ 1.3 లీటర్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 17.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, దాని డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) వెర్షన్ లీటరుకు 18.45 కిలోమీటర్ల మైలేజ్‌ను మాత్రమే ఇస్తుంది.
రెనాల్ట్ సంస్థ ఈ సరికొత్త టర్బో టీసీఈ 100 ఇంజన్‌ను డస్టర్ అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లో ఈ వేరియంట్ల ధరలు రూ. 10.49 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
పవర్‌ఫుల్ 1.0 లీటర్ టర్బో ఇంజన్..
కొత్త రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ టర్బో టీసీఈ 100 మోడల్‌లో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 హెచ్‌పీ పవర్‌ను, 166 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే జత చేశారు. ఈ పవర్‌ట్రెయిన్‌ను ఎస్‌యూవీ సరికొత్త ఆర్జీఎమ్పీ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌కు సరిపోయేలా ప్రత్యేకంగా ట్యూన్ చేసినట్లు రెనో పేర్కొంది.
రెనాల్ట్ డస్టర్ మైలేజ్- పోటీదారులతో ఇలా..
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఈ 2026 రెనాల్ట్ డస్టర్ ప్రధానంగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి పాపులర్ కార్లతో తలపడాల్సి ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా: క్రెటా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ మోడల్ ఏఆర్ఏఐ గుర్తింపు ప్రకారం లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
కియా సెల్టోస్: సెల్టోస్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ వెర్షన్ లీటరుకు 18.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా: మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే గ్రాండ్ విటారా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లీటరుకు 21.11 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 20.58 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ టర్బో వెర్షన్ల కంటే స్వల్పంగా ఎక్కువ మైలేజీని ఇస్తుంది. అయితే, అత్యంత సమర్థవంతమైన మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా మాత్రం డస్టర్ కంటే మైలేజ్ రేసులో ముందంజలో ఉంది.
రెనాల్ట్ నుంచి 2 కొత్త ఎస్‌యూవీలు..
భారత మార్కెట్లో రాబోయే కొద్ది నెలల్లోనే డస్టర్ హైబ్రిడ్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి రెనాల్ట్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఈ ఎస్‌యూవీ హైబ్రిడ్ వెర్షన్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను వాడనున్నారు, ఇది 109 హెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. దీనికి అదనంగా 49 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్, 1.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 20 హెచ్‌పీ హైబ్రిడ్ స్టార్టర్ జనరేటర్‌ను జత చేయనున్నారు. ఇవన్నీ కలిసి కారుకు సంయుక్తంగా 160 హెచ్‌పీ పవర్‌ను, 172 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తాయి.
ఈ డస్టర్ హైబ్రిడ్ లాంచ్ అయిన తర్వాత, రెనాల్ట్ సంస్థ భారత మార్కెట్లోకి 7-సీటర్ డస్టర్‌ని ప్రవేశపెట్టనుంది. ఇది మార్కెట్లో ఇప్పటికే ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్ వంటి పెద్ద కార్లకు గట్టి సవాల్ విసరనుంది.
గతేడాది అంతర్జాతీయంగా విడుదల చేసిన ‘రెనాల్ట్ బోరియల్’ మోడల్ ఆధారంగా ఈ 7-సీటర్ కారును రూపొందించారు. అయితే భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇందులో చిన్నపాటి డిజైన్ మార్పులు చేసి, సరికొత్త పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 7-సీటర్ రెనాల్ట్ డస్టర్ మోడల్.. డిజైన్ ఎలిమెంట్స్, ఫీచర్లు, విడిభాగాలు, ఇంజన్ ఆప్షన్లను దాదాపు తన 5-సీటర్ డస్టర్ మోడల్ నుంచే పంచుకోనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


