Renault Duster vs Tata Sierra : రెండు కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీలు- ఏది బెస్ట్?
టాటా సియెర్రా వర్సెస్ రెనాల్ట్ డస్టర్.. మార్కెట్లోకి రెండు కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీలు వచ్చేశాయి. మరి వీటిల్లో ఏది బెస్ట్? ఎందులో ఫీచర్స్ ఎక్కువ? ఎందులో సేఫ్టీ ఎక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఇప్పుడు కొత్త పరిణామం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన పేర్లు ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అవే టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్. టాటా మోటార్స్ చాలా కాలం పాటు పక్కన పెట్టిన తన పాత బ్రాండ్ ‘సియెర్రా’ను ప్రీమియం లుక్‌లో తిరిగి ప్రవేశపెట్టగా, రెనాల్ట్ సంస్థ తన లెజెండరీ ‘డస్టర్’ కొత్త తరం మోడల్‌తో దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? వేటి ప్రత్యేకతలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకోండి..

టాటా సియెర్రా వర్సెస్ రెనాల్ట్ డస్టర్- ఇంజిన్ సామర్థ్యం, పనితీరు..
టాటా సియెర్రా కొనుగోలుదారులకు ఆప్షన్ల జాతర కనిపిస్తుంది. ఇందులో 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్పోర్టియర్ ఫీల్ ఇచ్చే 1.5 లీటర్ హైప్రియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 160 పీఎస్ పవర్, 255 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ ప్రేమికుల కోసం 1.5 లీటర్ క్రయోజెట్ ఇంజిన్ ఉంది. ఇది 118 పీఎస్ పవర్‌ను, 280 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటి మూడు రకాల గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజీ కోరుకునే వారికి, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి సియెర్రా అన్ని రకాలుగా సరిపోతుంది.
మరోవైపు రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. దీని టర్బో-పెట్రోల్ ఇంజిన్ 163 పీఎస్ పవర్, 280 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ వెట్-క్లచ్ డీసీటీని జత చేశారు. ఇందులో అత్యంత ఆకర్షణీయమైనది ‘ఈ-టెక్ 160’ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. నగరం లోపల డ్రైవింగ్ చేసేటప్పుడు 80 శాతం వరకు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడపవచ్చని రెనాల్ట్ చెబుతోంది.
సాధారణ అవసరాల కోసం 100 పీఎస్ పవర్ ఇచ్చే పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది.
టాటా సియెర్రా వర్సెస్ రెనాల్ట్ డస్టర్- ప్లాట్‌ఫామ్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం..
టాటా సియెర్రాను సరికొత్త 'ఎర్గో' ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్‌కు కూడా సహకరిస్తుంది. ఆఫ్-రోడింగ్ కోసం ఇది భేష్ అనిపించేలా 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 450 ఎంఎం లోతు వరకు నీటిలో వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇక డస్టర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, 90 శాతం ఇండియా-స్పెసిఫిక్ విడిభాగాలతో కూడిన 'ఆర్జీఎంబీ' ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 212 ఎంఎంగా ఉంది, ఇది సియెర్రా కంటే కొంచెం ఎక్కువ. ఇందులో అదనంగా 50 కిలోల బరువు మోయగల రూఫ్ బార్స్ ఉన్నాయి. ఇక బూట్ స్పేస్ 700 లీటర్లు ఉండటం విశేషం. ఇది తన ప్రత్యర్థి వాహనాల కంటే దాదాపు 80 లీటర్లు ఎక్కువని రెనో ధీమా వ్యక్తం చేస్తోంది.
| Category | Tata Sierra | Renault Duster |
|---|---|---|
| Platform | ARGOS (ICE & EV ready) | RGMB (India-specific) |
| Petrol Engines | 1.5 NA, 1.5 TGDi | 1.3 TCe turbo, TCe 100 |
| Petrol Output | Up to 160 PS / 255 Nm | 163 PS / 280 Nm | 100 PS / 160 Nm |
| Diesel Option | 1.5 Kryojet | - |
| Hybrid Option | - | Strong hybrid E-Tech |
| Gearboxes | 6MT, 7DCT, 6AT | 6DCT, 8DHT |
| Ground Clearance | 205 mm | 212 mm |
| Off-road Angles | 26.5° / 23.1° / 31.6° | 26.9° / — / 34.7° |
| Boot Space | Not disclosed | 700 litres |
| ADAS | Level 2 (up to 22 features) | ADAS (17 features) |
| Airbags | 6 standard | 6 expected |
| Infotainment | 12.29-inch | 10.1-inch |
| Instrument Cluster | 10.23-inch | 10.25-inch |
టాటా సియెర్రా వర్సెస్ రెనాల్ట్ డస్టర్- టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు..
టాటా సియెర్రా ఎస్‌యూవీ తన హై-టెక్ ఫీచర్లతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఇందులో 5జీ కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్స్, 12.29-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ కాక్‌పిట్ ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రెండు 65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు ఇచ్చారు. భద్రత విషయంలో రాజీ పడకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 22 రకాల ఫంక్షన్లతో కూడిన లెవల్-2 అడాస్ని టాటా జత చేసింది.
రెనాల్ట్ డస్టర్ కూడా టెక్నాలజీలో వెనుకబడలేదు. ఈ ఎస్‌యూవీలో 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. అలాగే గూగుల్ అసిస్టెంట్ ఇన్-బిల్ట్‌గా వస్తోంది. ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు డస్టర్ సొంతం. ఇందులో 17 రకాల ఫంక్షన్లతో కూడిన అడాస్ ప్యాకేజీని అందించారు.
మొత్తానికి, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి టాటా సియెర్రా, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం- హైబ్రిడ్ టెక్నాలజీ కావాలనుకునే వారికి రెనాల్ట్ డస్టర్ సరైన ఎంపికగా కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


