Foldable smartphones : శాంసంగ్​ నుంచి ఒకేసారి 3 ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్ లాంచ్​- ఇండియాలో ధరలు ఇలా..

Samsung Foldable smartphones : లండన్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా, జెడ్ ఫ్లిప్ 8 ఫోన్లను ఆవిష్కరించింది. కొత్త డిజైన్, ఫ్లెక్స్ టైటానియమ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం..

Published on: Jul 23, 2026, 06:50:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రీమియం ఫోన్ల ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజూ రానే వచ్చింది. లండన్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్' ఈవెంట్‌లో శాంసంగ్ తన తదుపరి తరం ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఈసారి ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు ఫోల్డెబుల్ ఫోన్లను ఒకే వేదికపైకి తెచ్చి శాంసంగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫ్లాగ్‌షిప్‌లకు ఏమాత్రం తగ్గకుండా, ఫోల్డెబుల్ సెగ్మెంట్‌పై కూడా తాము ఎంత సీరియస్‌గా ఉన్నామో ఈ లాంచ్‌తో స్పష్టం చేసింది.

శాంసంగ్ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్.. (HT)
శాంసంగ్ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్.. (HT)

గత ఏడాది వచ్చిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7కి సక్సెసర్​గా 'గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా', 'గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8'లతో పాటు, సరికొత్త డిజైన్ లూప్‌తో కూడిన 'గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8'ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. టాప్-ఎండ్ హార్డ్‌వేర్, సరికొత్త డిస్‌ప్లే, మెరుగైన హింజ్ టెక్నాలజీతో వస్తున్న ఈ ఫోన్లలో గెలాక్సీ ఏఐకి పదును పెట్టారు. నౌ బ్రీఫ్, నౌ నడ్జ్, జెమినీ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లు యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి.

డేటా భద్రత కోసం శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీతో పాటు 'నాక్స్ ఎన్‌హ్యాన్స్డ్ ఎన్‌క్రిప్టెడ్ ప్రొటెక్షన్' అనే కొత్త సెక్యూరిటీ లేయర్‌ను ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​కి జోడించింది. ఇది యూజర్ల వ్యక్తిగత డేటా ఆధారంగా పనిచేసే పర్సనల్ డేటా ఇంజిన్​కి రక్షణగా నిలుస్తుంది. ఆటో బ్లాకర్, తెఫ్ట్ ప్రొటెక్షన్, ప్రైవేట్ షేరింగ్, సెక్యూర్ వైఫై వంటి ఫీచర్లు ఫోన్‌కు అదనపు రక్షణ ఇస్తాయి.

లండన్ ఈవెంట్‌లో పరిచయమైన ఈ మూడు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ఇండియా ధరల వివరాలు ఇవే..

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8..

ఈసారి జెడ్ ఫోల్డ్ 8 మోడల్‌లో శాంసంగ్ కొత్త రూపురేఖలను పరిచయం చేసింది. నోట్‌బుక్ శైలిలో ఉండేలా దీని డిస్‌ప్లే నిష్పత్తులను మార్చారు. మడతబెట్టినప్పుడు 10:16 రేషియో, విప్పినప్పుడు 4:3 డిస్‌ప్లే రేషియోతో కంటెంట్ చూడటానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం 201 గ్రాముల బరువుతో రావడం విశేషం. మడత పడే చోట గీత తక్కువగా కనిపించేందుకు, ఫోన్ పడిపోయినా తట్టుకునేందుకు టైటానియమ్ ప్లేట్‌తో కూడిన 'ఫ్లెక్స్ టైటానియమ్' టెక్నాలజీని ఉపయోగించారు.

డిస్‌ప్లే: 7.6-అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్రధాన డిస్‌ప్లే (3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్). బయటి వైపు 5.5-అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ కవర్ స్క్రీన్ ఉంటుంది.

కెమెరాలు: వెనుక వైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా (OIS, 2ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్) + 50ఎంపీ ఆల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ఉంది. కవర్ స్క్రీన్‌పై 10ఎంపీ, లోపల 10ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఇచ్చారు.

ప్రాసెసర్ అండ్ మెమరీ: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్. 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ అండ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యుఐ 9పై పనిచేస్తుంది. 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కలర్స్: గ్రాఫైట్, క్రీమ్, లావెండర్, పిస్తా రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా..

మరింత అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్​ 8 ఆల్ట్రా మోడల్‌ను తీసుకొచ్చారు.

డిస్‌ప్లే: 8-అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్‌ప్లే, బయట 6.5-అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ కవర్ స్క్రీన్ ఇచ్చారు. రెండూ 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి.

కెమెరా విప్లవం: వెనుక భాగంలో ఏకంగా 200ఎంపీ ప్రధాన కెమెరా (OIS, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్) అమర్చారు. దీనికి తోడు 50ఎంపీ ఆల్ట్రా వైడ్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10ఎంపీ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 10ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

ప్రొసెసర్ అండ్ బ్యాటరీ: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.

కలర్స్: గ్రాఫైట్, క్రీమ్, వైలెట్ షాడో, గ్రీన్ షాడో కలర్స్‌లో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8..

స్టైలిష్ క్లామ్‌షెల్ మోడల్ ఇష్టపడే వారి కోసం జెడ్ ఫ్లిప్ 8 సిద్ధమైంది.

డిస్‌ప్లే: లోపల 6.9-అంగుళాల ఎఫ్​హెచ్​డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్, బయట నోటిఫికేషన్లు, విజెట్ల కోసం 4.1-అంగుళాల సూపర్‌ అమోలెడ్ కవర్ డిస్‌ప్లే ఉన్నాయి.

కెమెరా: 50ఎంపీ మెయిన్ కెమెరా (OIS, 2ఎక్స్ జూమ్) + 12ఎంపీ ఆల్ట్రా వైడ్ కెమెరా. లోపల 10ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

ప్రాసెసర్ అండ్ అదర్స్: ఇందులో శాంసంగ్ ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ ఉపయోగించారు. 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది. 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కలర్స్: గ్రాఫైట్, క్రీమ్, పింక్, మింట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

భారతదేశంలో ధరలు, లభ్యత వివరాలు..

భారత మార్కెట్లో వీటి ధరల వివరాలను శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది:

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8:12GB + 256GB: రూ. 1,79,999 12GB + 512GB: రూ. 1,99,999 16GB + 1TB: రూ. 2,29,999

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా:12GB + 256GB: రూ. 1,99,999 12GB + 512GB: రూ. 2,19,999 16GB + 1TB: రూ. 2,59,999

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8:12GB + 256GB: రూ. 1,24,999 12GB + 512GB: రూ. 1,44,999

ప్రస్తుతం భారతదేశంలో ఈ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వినియోగదారులకు ఆగస్టు 4, 2026 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని శాంసంగ్ వెల్లడించింది.

కాగా.. యాపిల్​ నుంచి త్వరలోనే విడుదలకానున్న తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​కి ముందు శాంసంగ్ ఏకంగా 3 గ్యాడ్జెట్స్​ని లాంచ్​ చేయడం గమనార్హం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More