Small Savings Schemes : 8.2శాతం వరకు వడ్డీ- చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్​ చేయొచ్చా?

Sukanya Samriddhi Yojana : 2026-27 ఆర్థిక సంవత్సరంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్ స్కీమ్స్ వంటివి 8.2% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిల్లో ఇన్వెస్ట్​ చేసే ముందు మీరు గమనించాల్సిన కీలక విషయాలను ఇక్కడ చూసేయండి..

Published on: Apr 5, 2026, 10:00:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన వేళ, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్- 7.1శాతం), సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై- 8.2శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్​సీఎస్​ఎస్- 8.2శాతం) వంటి పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం మార్కెట్​లో నెలకొన్న అస్థిరత, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. స్థిరమైన ఆదాయం కోసం చూసే వారికి 8.2% వరకు లభించే వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ తరహా స్కీమ్స్​లో పెట్టుబడి పెట్టే ముందు కేవలం వడ్డీని మాత్రమే కాకుండా, మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే గరిష్ఠ రిటర్నులను పొందవచ్చు. అవేంటంటే..

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్​ చేయొచ్చా?
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్​ చేయొచ్చా?

1. కేవలం వడ్డీ రేట్లకే ఆకర్షితులు కావద్దు..

8.2% రిటర్న్స్ బాగున్నాయి కదా అని మొత్తం సొమ్మును వీటిలో పెట్టేకూడదు! ఈ వడ్డీ రేట్లు శాశ్వతం కాదు. ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు, ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం వంటి కారణాల వల్ల ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ రేట్లను సమీక్షిస్తుంది. కాబట్టి, ప్రస్తుత వడ్డీని బట్టి తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగించవచ్చు.

పీపీఎఫ్​పై వడ్డీ రేటు ఒకానొక సమయంలో 12శాతం ఉండేదని మీకు తెలుసా? ఇప్పుడు 7.1శాతంగా ఉంది.

2. మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి..

ప్రతి పొదుపు పథకాన్ని ఒక ప్రత్యేక ఉద్దేశంతో రూపొందించారు. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నారా? రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? లేక స్వల్పకాలిక అవసరాల కోసమా? అన్నది ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యంతో సంబంధం లేని పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.

3. కాలపరిమితిని మర్చిపోవద్దు..

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వంటి పథకాలు దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టిస్తాయి, కానీ వీటికి ఓపిక చాలా అవసరం! తక్కువ కాలపరిమితి గల పథకాలు నగదును త్వరగా అందిస్తాయి కానీ రిటర్న్స్ తక్కువగా ఉండవచ్చు. అందుకే మీ అవసరానికి తగ్గట్టుగా కాలపరిమితిని ఎంచుకోవాలి.

4. లిక్విడిటీ (నగదు లభ్యత) ముఖ్యం..

చాలా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు 'లాక్-ఇన్' పీరియడ్ (నిర్దిష్ట కాలం వరకు డబ్బు తీయకూడదు) ఉంటుంది. అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఈ నిధులు అందుబాటులో ఉండవు. కాబట్టి, అత్యవసర నిధిని (ఎమర్జెన్సీ ఫండ్) పక్కన పెట్టిన తర్వాతే, మిగిలిన మొత్తాన్ని ఇలాంటి దీర్ఘకాలిక పథకాల్లో పెట్టడం ఉత్తమం.

5. పన్ను ప్రయోజనాలను గమనించండి..

పెట్టుబడిపై వచ్చే ఆదాయంతో పాటు పన్ను ఆదా కూడా మీ నికర లాభాన్ని పెంచుతుంది. ఉదాహరణకు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి పథకాల్లో పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. మరికొన్ని పథకాల్లో వడ్డీ కూడా పన్ను రహితం. ఈ కోణంలో ఆలోచిస్తే 8.2% వడ్డీ విలువ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఇరాన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో.. స్థిరమైన వడ్డీనిచ్చే ప్రభుత్వ పథకాలు పోర్ట్‌ఫోలియోకు రక్షణ కల్పిస్తాయి. అయితే సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి మాత్రమే మీ ఆర్థిక భవిష్యత్తును భద్రపరుస్తుంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ప్రస్తుతం ఏ చిన్న మొత్తాల పొదుపు పథకాలు అత్యధికంగా 8.2% వడ్డీని అందిస్తున్నాయి?

సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం అత్యధికంగా 8.2% వడ్డీ రేటును అందిస్తున్నాయి.

2. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు 'లిక్విడిటీ' (నగదు లభ్యత) గురించి ఎందుకు ఆలోచించాలి?

పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి వంటి పథకాలకు సుదీర్ఘమైన లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, అంటే అత్యవసర సమయంలో వెంటనే డబ్బు వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి లిక్విడిటీని పరిగణనలోకి తీసుకోవాలి.

3. వడ్డీ రేట్లతో పాటు పన్ను ప్రయోజనాలు పెట్టుబడిపై ఎలా ప్రభావం చూపుతాయి?

పీపీఎఫ్ వంటి పథకాల్లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభించడమే కాకుండా, వచ్చే వడ్డీ కూడా పన్ను రహితం కావడం వల్ల మీ నికర లాభం సాధారణ పథకాల కంటే ఎక్కువగా ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More