Sunita Williams retires : సునీత విలియమ్స్ ఏం చదువుకున్నారు? నాసాలోకి ఎలా వెళ్లారు?

సుమారు మూడు దశాబ్దాల అద్భుతమైన కెరీర్ తర్వాత భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అయ్యారు. పశువైద్యురాలు కావాలనుకుని, అనుకోకుండా అంతరిక్షంలో రికార్డులు సృష్టించిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఇక్కడ చదవండి..

Published on: Jan 23, 2026, 05:29:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో తనకంటూ కొన్ని సువర్ణ పేజీలను లిఖించుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు 27 ఏళ్ల పాటు నాసాలో విశేష సేవలు అందించిన ఆమె.. 2025 డిసెంబర్ 27న అధికారికంగా పదవీ విరమణ చేశారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో అత్యంత విజయవంతమైన వ్యోమగాముల్లో ఒకరిగా ఆమె తన ప్రస్థానాన్ని ముగించారు.

సునీత విలియమ్స్ ఏం చదువుకున్నారు? (REUTERS)
సునీత విలియమ్స్ ఏం చదువుకున్నారు? (REUTERS)

రికార్డుల రారాణి..

తన సుదీర్ఘ కెరీర్‌లో సునీతా విలియమ్స్ మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్​ఎస్​) వెళ్లారు. అక్కడ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.

యూఎస్ నేవల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె.. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అంతకుముందు యూఎస్ నేవీలో ఆమెకు ఉన్న అపారమైన అనుభవం నాసా ఎంపికలో కీలక పాత్ర పోషించింది.

సైన్స్ ఫిక్షన్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు..

గతంలో, దిల్లీలోని అమెరికన్ సెంటర్‌లో విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంలో సునీత తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

"చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో అంతరిక్ష చిత్రాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, కొత్తగా అనిపించేది. కానీ, నేను ఎప్పటికైనా వ్యోమగామిని అవుతానని అప్పట్లో అస్సలు అనుకోలేదు. స్టార్ ట్రెక్ వంటి సైన్స్ ఫిక్షన్ కథలంటే నాకు ఇష్టం ఉండేది కానీ, నిజంగానే అంతరిక్షంలోకి వెళతానని ఎప్పుడూ ఊహించలేదు," అని ఆమె గుర్తుచేసుకున్నారు.

వెటర్నరీ డాక్టర్ కావాలని కలలు కని..

సునీత విలియమ్స్ తండ్రి వైద్యుడు, తల్లికి జంతువులంటే ప్రాణం. అందుకే ఆమె కూడా పశువైద్యురాలు (వెటర్నరీ డాక్టర్) కావాలని బలంగా కోరుకున్నారు.

"నాకు జంతువులంటే చాలా ఇష్టం. డాక్టర్ కావాలనే అనుకున్నాను కానీ, పాఠశాల చదువు తర్వాత ఏ దారిలో వెళ్లాలో స్పష్టత ఉండేది కాదు," అని ఆమె వివరించారు. అనుకున్న కాలేజీలో సీటు రాకపోవడంతో, అన్నయ్య ఇచ్చిన చిన్న సలహాతో ఆమె మిలిటరీలో చేరారు. ఆ ఒక్క నిర్ణయం ఆమె జీవిత గమనాన్నే మార్చేసింది.

హెలికాప్టర్ పైలట్‌గా, ఎయిర్‌క్రాఫ్ట్ కమాండర్‌గా, టెస్ట్ పైలట్‌గా రాణించిన తర్వాత మాత్రమే ఆమెకు అంతరిక్ష ప్రయాణంపై ఆసక్తి కలిగింది. నాసాలోని జాన్సన్ స్పేస్ సెంటర్‌ను సందర్శించినప్పుడు, అక్కడి శిక్షణను చూసిన తర్వాతే 'నేను కూడా అంతరిక్షంలోకి వెళ్లగలనా?' అనే ఆలోచన మొదటిసారి వచ్చిందని సునీత విలియమ్స్ పేర్కొన్నారు.

"జీవితంలో చిన్న వయసులోనే అన్నిటికీ సమాధానాలు తెలిసి ఉండక్కర్లేదు! కాలమే మనల్ని నడిపిస్తుంది," అని నేటి యువతకు ఆమె భరోసా ఇచ్చారు.

సునీత సృష్టించిన అద్భుతాలు..

608 రోజులు: అంతరిక్షంలో సునీత విలియమ్స్​ గడిపిన మొత్తం కాలం. నాసా వ్యోమగాముల్లో అత్యధిక కాలం కక్ష్యలో ఉన్న వారిలో ఆమె రెండో స్థానంలో ఉన్నారు.

స్పేస్‌వాక్: మొత్తం 9 సార్లు స్పేస్‌వాక్ చేశారు. సుమారు 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు.

అంతరిక్షంలో మ్యారథాన్: అంతరిక్షంలో మ్యారథాన్ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కారు.

"నన్ను బాగా తెలిసిన ఎవరికైనా ఒక విషయం తెలుసు.. అంతరిక్షం అంటే నాకు ప్రాణం. అది నా ఫేవరెట్ ప్లేస్," అని సునీత గర్వంగా చెబుతారు.

ఆమె నిష్క్రమణపై సహచరులు స్పందిస్తూ.. సునీతా విలియమ్స్ ఒక అసాధారణ నాయకురాలని, రాబోయే తరాల వ్యోమగాములకు ఆమె ఒక గొప్ప మార్గదర్శి అని కొనియాడారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More