టాటా మోటార్స్ జోరు.. వరుసగా రెండో నెల నెం. 2 స్థానం పదిలం! మహీంద్రా, హ్యుందాయ్‌లకు షాక్
పండుగ సీజన్లో టాటా మోటార్స్ దుమ్మురేపింది! భారీ మొత్తంలో సేల్స్‌తో నెం.2 స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది. అంతేకాదు, ఎం అండ్ ఎం, హ్యుందాయ్ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని తగ్గించుకోగలిగింది!
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) భారతీయ ప్యాసింజర్ వాహనాల రిటైల్ మార్కెట్‌లో తన నెం. 2 స్థానాన్ని వరుసగా రెండో నెల పదిలం చేసుకుంది! ప్రభుత్వ వాహన్ పోర్టల్ (తెలంగాణ మినహాయించి) నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ విషయం స్పష్టమైంది.
అక్టోబర్ 2025లో కంపెనీ మొత్తం 73,879 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య మహీంద్రా అండ్ మహీంద్రా (67,444 యూనిట్లు), హ్యుందాయ్ మోటార్ ఇండియా (65,048 యూనిట్లు) విక్రయాల కంటే చాలా ఎక్కువ!
టాటా మోటార్స్ తన సమీప ప్రత్యర్థుల మధ్య ఉన్న అంతరాన్ని మరింత పెంచుకుంది. సెప్టెంబర్‌లో మహీంద్రా కంటే 3,492 యూనిట్లు, హ్యుందాయ్ కంటే 5,339 యూనిట్లు మాత్రమే ముందున్న టాటా... అక్టోబర్‌లో ఆ ఆధిక్యాన్ని మహీంద్రాపై సుమారు 7,900 యూనిట్లకు, హ్యుందాయ్‌పై 9,660 యూనిట్లకు పెంచుకోగలిగింది. ఇది దేశీయ ఆటోమొబైల్ సంస్థ అయిన టాటా.. పండుగ సీజన్‌ను ఎంత బలంగా వినియోగించుకుందో స్పష్టం చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలపై నిరంతరంగా పెరుగుతున్న డిమాండ్.
టాటా మోటార్స్ సేల్స్- పండుగ జోష్, నెలవారీ వృద్ధి..
సెప్టెంబర్ 2025లోనే టాటా 41,151 యూనిట్లను డెలివరీ చేసి మహీంద్రా (37,659), హ్యుందాయ్ (35,812) లను అధిగమించింది. అయితే అక్టోబర్‌లో విక్రయాలు భారీగా పెరగడం చూస్తే, నవరాత్రి- దీపావళి సమయంలో పండుగ డిమాండ్‌ను కంపెనీ గరిష్టంగా అందిపుచ్చుకుందని తెలుస్తోంది.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. నవరాత్రి సమయంలో రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 34 శాతం పెరిగాయి! ఈ సానుకూల ధోరణి టాటా మోటార్స్‌కు బాగా కలిసొచ్చింది. నవరాత్రి, దీపావళి మధ్య కాలంలో టాటా లక్షకు పైగా వాహనాలను డెలివరీ చేసింది. ఇది గత సంవత్సరం కంటే 33 శాతం వృద్ధి కాగా, ఇందులో దాదాపు 70 శాతం వాటా ఎస్‌యూవీలదే.
టాటా మోడళ్లలో నెక్సాన్ ఒక్కటే పండుగ సమయంలో దాదాపు 38,000 యూనిట్లను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 73 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది! మరోవైపు, టాటా పంచ్ మరో 32,000 యూనిట్ల అమ్మకాలకు తోడ్పడింది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటాకున్న పట్టును మరింత బలోపేతం చేసింది. ఎలక్ట్రిక్ విభాగంలోనూ నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, పంచ్ ఈవీ వంటి మోడళ్లు కలిసి 10,000 రిటైల్ యూనిట్ల మార్కును అధిగమించాయి. ఇది గత సంవత్సరం పండుగ సీజన్ కంటే 37 శాతం అధిక వృద్ధిని సూచిస్తుంది.
ర్యాంకు | ఆటోమొబైల్ సంస్థలు | అక్టోబర్ సేల్స్ (వాహన్ పోర్టల్ ప్రకారం) | మోడల్స్ |
| 1 | మారుతీ సుజుకీ | 2,39,086 | స్విఫ్ట్, బ్రెజా, బలెనో, ఎర్టిగా, ఫ్రాంక్స్ |
| 2 | టాటా మోటార్స్ | 73,879 | నెక్సాన్, పంచ్, టియాగో ఈవీ, పంచ్ ఈవీ, హారియర్ |
| 3 | మహీంద్రా అండ్ మహీంద్రా | 67,444 | స్కార్పియో, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, బొలెరో నియో, థార్ |
| 4 | హ్యుందాయ్ మోటార్ ఇండియా | 65,048 | క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, ఐ20 |
టాటా మోటార్స్ సేల్స్- వృద్ధికి కారణాలేంటి?
ఈ అమ్మకాల పెరుగుదల ఆశ్చర్యమేమీ కాదు. నెక్సాన్, పంచ్ మోడళ్లు టాటా ప్యాసింజర్ వాహనాల శ్రేణికి వెన్నెముకగా నిలుస్తున్నాయి! ప్రత్యేకంగా, కొత్త ఫీచర్లు, అడాస్ రెడ్ #డార్క్ ఎడిషన్‌తో మెరుగుపరిచిన నెక్సాన్ శ్రేణి, సాంకేతికత, డిజైన్, విలువను కోరుకునే యువ కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది.
అదే సమయంలో, మాస్-మార్కెట్ ఈవీ విభాగంలో టాటాకు ఉన్న ఫస్ట్ మూవింగ్ బెనిఫిట్ బాగా పనిచేసింది. పంచ్ ఈవీ జోడింపుతో అమ్మకాలు మరింత పెరిగాయి. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంలో టాటా తన ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
ఉత్పత్తుల బలం తో పాటు, సరైన సమయానికి డీలర్ స్టాక్ ప్లానింగ్, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు, పండుగ డిమాండ్‌కు అనుగుణంగా కీలక మార్కెట్లలో చేసిన సమన్వయ మార్కెటింగ్ వ్యూహాలు కూడా ఈ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాయి!
ముందున్న సవాళ్లు
అక్టోబర్ అమ్మకాల సంఖ్య ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ జోరును కొనసాగించడం.. టాటాకు ముందున్న పెద్ద సవాలు! సాధారణంగా దీపావళి తర్వాత డిమాండ్ తగ్గుతుంది. ఈ సమయంలో ప్రత్యర్థులు కూడా తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మహీంద్రా త్వరలో తీసుకురానున్న ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ నుంచి రానున్న 2025 వెన్యూ, మరియు మారుతీ సుజుకీ ఇటీవల విడుదల చేసిన విక్టోరిస్ మోడళ్లతో పోటీ మరింత తీవ్రం కానుంది.
అయినప్పటికీ, టాటా కూడా ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగం కోసం సిద్ధమైంది. టాటా సియెర్రా, పంచ్ ఫేస్‌లిఫ్ట్ సహా అనేక కొత్త లాంచ్‌లను కంపెనీ ప్లాన్ చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












