...
...
Next Story

Tata cars price hike : వాహనదారులకు షాక్! టాటా కార్ల ధరలు పెంపు- ఎంతంటే..

Tata motors price hike : టాటా కార్లను కొనాలనుకునే వారికి జులై 1 నుంచి అదనపు భారం పడనుంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా తన ప్యాసింజర్ వాహనాల ధరలను 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది.

Published on: Jun 12, 2026, 13:37:42 IST
Advertisement

సొంతకారు కల నిజం చేసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రయాణికులకు ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గట్టి షాక్ ఇచ్చింది! తన ప్యాసింజర్ వాహనాల శ్రేణి మొత్తంపై ధరలను పెంచుతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ధరలు కూడా పెరగనున్నాయి. ఈ పెరిగిన కొత్త ధరలు 2026 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

టాటా కార్ల ధరలు పెంపు- ఎంతంటే..
టాటా కార్ల ధరలు పెంపు- ఎంతంటే..

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్ల మోడళ్లు, వేరియంట్లను బట్టి ధరల పెంపు గరిష్టంగా 1.5 శాతం వరకు ఉండనుంది.

టాటా కార్ల ధరలు పెంచడానికి కారణం ఏంటి?

కార్ల తయారీకి అయ్యే ముడిసరుకుల వ్యయం భారీగా పెరగడం, మార్కెట్లో నిరంతరం కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని టాటా మోటార్స్ వివరించింది. ఇప్పటివరకు పెరిగిన భారాన్ని కంపెనీయే భరిస్తూ వచ్చినప్పటికీ.. ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భారాన్ని పాక్షికంగానైనా కస్టమర్లపై వేయాల్సి వస్తోందని వాహన తయారీ సంస్థ పేర్కొంది.

ఏయే కార్ల ధరలు పెరుగుతాయి?

వచ్చే నెల ప్రారంభం నుంచి టాటా మోటార్స్‌కు చెందిన దాదాపు అన్ని పాపులర్ మోడళ్ల ధరలు మారనున్నాయి. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కింది కార్లపై ఈ ప్రభావం పడనుంది:

  • టాటా పంచ్
  • టాటా నెక్సాన్
  • టాటా కర్వ్
  • టాటా హారియర్
  • టాటా సఫారీ
  • టాటా టియాగో
  • టాటా ఆల్ట్రోజ్
  • టాటా ఈవీ సిరీస్ (టియాగో ఈవీ, పంచ్​ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ)

ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా ఇప్పటికే పలు ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచే యోచనలో ఉన్న తరుణంలోనే టాటా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కార్ల ధరల పెంపు వార్త కాస్త నిరాశకు గురిచేసినప్పటికీ.. ఆటోమొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా సియెర్రా ఈవీ' జూన్ 30న భారత మార్కెట్​లోకి అధికారికంగా విడుదల కానుంది. మొదట ఆటో ఎక్స్‌పో 2020లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన ఈ కారును, ఆ తర్వాత ఆటో ఎక్స్‌పో 2023లో మరిన్ని అప్‌డేట్స్‌తో లాంచ్ చేయడానికి సిద్ధం చేశారు. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ ఈవీ లాంచ్‌లలో సియెర్రా ఈవీ టాప్‌లో ఉంది.

టాటా మోటార్స్ విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో ఈ సరికొత్త సియెర్రా ఈవీ.. కర్వ్ ఈవీకి, హారియర్ ఈవీకి మధ్యలో నిలవనుంది. హారియర్ ఈవీని తయారు చేసిన బ్రాండ్స్ అడ్వాన్స్‌డ్ 'acti.ev+' ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పైనే ఈ సియెర్రా ఈవీని కూడా రూపొందించారు.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేర్-వీల్-డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ), ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) అనే రెండు వర్షన్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అలాగే హారియర్ ఈవీ తరహాలోనే ఇందులో 65కేడబ్ల్యూహెచ్, 75కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. పెద్దదైన 75కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్‌లో ఇచ్చే అవకాశం ఉంది. ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పాటు లాంగ్ డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe