Tata new cars : టాటా మోటార్స్​ క్రేజీ ప్లాన్- మార్కెట్లోకి 6 కొత్త మోడళ్లు..

Upcoming Tata cars : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు భారీ వ్యూహాన్ని ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి తన కార్ల సంఖ్యను 9 నుంచి 15కు పెంచాలని, మార్కెట్లో 18-20 శాతం వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published on: Jun 25, 2026, 05:27:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ కార్ల తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’.. భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపింది. కంపెనీ నిర్వహించిన 'ఇన్వెస్టర్ డే' వేదికగా భవిష్యత్తుకు సంబంధించిన ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న 9 కార్ల మోడళ్లను, 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 15 మోడళ్లకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో 20కి పైగా ప్రొడక్ట్ అప్‌డేట్లను తీసుకురానుంది. ఇందులో 6 సరికొత్త బ్రాండ్ న్యూ మోడళ్లతో పాటు ప్రస్తుతం ఉన్న కార్ల ఫేస్‌లిఫ్ట్‌లు, పవర్‌ట్రెయిన్ అప్‌గ్రేడ్‌లు, కొత్త ఫీచర్లు, సరికొత్త వేరియంట్లు ఉన్నాయి.

మార్కెట్లోకి 6 కొత్త టాటా కార్లు..
మార్కెట్లోకి 6 కొత్త టాటా కార్లు..

ఈ భారీ విస్తరణ ద్వారా ఈ దశాబ్దం ముగిసేనాటికి భారత ప్యాసింజర్ వాహన రంగంలో 18 నుంచి 20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది.

టాటా మోటార్స్​ నుంచి 6 సరికొత్త మోడళ్లు..

టాటా మోటార్స్ వృద్ధి వ్యూహంలో 6 సరికొత్త మోడళ్ల లాంచ్ అత్యంత కీలకమైనది. ఇవి మార్కెట్లోని వివిధ విభాగాల్లో టాటా పట్టును పెంచడమే కాకుండా, కస్టమర్లకు విభిన్న బాడీ స్టైల్స్, ఇంజన్ ఆప్షన్లను అందిస్తాయి. ఈ కొత్త కార్లలో దేశంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సియెర్రా ఈవీ’ జూన్ 30న ప్రపంచం ముందుకు రానుంది. ఆ తర్వాత, ఈ ఏడాది పండగ సీజన్ కానుకగా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘సఫారీ ఈవీ’ మార్కెట్లోకి విడుదల కానుంది. వీటితో పాటు టాటా మోటార్స్ తన నెక్స్ట్ జనరేషన్ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన శ్రేణి ‘అవిన్యా’ మోడళ్లను వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది.

ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలపై భారీ బెట్!

భవిష్యత్తు ఆటోమొబైల్ రంగాన్ని శాసించబోయే ఎలక్ట్రిక్ వాహనాలపై టాటా మోటార్స్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ అంచనాల ప్రకారం, భవిష్యత్తులో టాటా విక్రయించే మొత్తం ప్యాసింజర్ కార్లలో 30 శాతం కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండనున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 6 ఈవీ మోడళ్లను 10 మోడళ్లకు పెంచాలని టాటా భావిస్తోంది. 2030 నాటికి భారతదేశ మొత్తం కార్ల మార్కెట్లో ఈవీల వాటా 15 నుంచి 20 శాతానికి చేరుకుంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.

మరోవైపు, పర్యావరణహిత ఇంధనమైన సీఎన్జీ వాహనాలు కూడా మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తాయని టాటా బలంగా నమ్ముతోంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో టాటా మోటార్స్ విక్రయించే కార్లలో ఈవీలు, సీఎన్జీ మోడళ్లు కలిపి ఏకంగా 45 శాతం వాటాను ఆక్రమిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

ప్రొడక్షన్ కెపాసిటీని రెట్టింపు చేయనున్న టాటా!

తాజా కార్యాచరణలో భాగంగా టాటా మోటార్స్ తన విక్రయాల లక్ష్యాన్ని భారీగా పెంచుకుంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ఏడాదికి 12 లక్షల కంటే ఎక్కువ ప్యాసింజర్ వాహనాలను విక్రయించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇది ప్రస్తుతం కంపెనీ సాధిస్తున్న వార్షిక విక్రయాల (దాదాపు 6.4 లక్షల యూనిట్లు) కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం.

ఈ భారీ విక్రయాల లక్ష్యానికి అనుగుణంగా, కంపెనీ తన వాహన ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచుతోంది. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 9 లక్షల కార్లను తయారు చేయగల సామర్థ్యం ఉండగా, రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలలో దీనిని ఏకంగా 13 లక్షల యూనిట్లకు పెంచేందుకు ప్లాంట్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. పక్కా వ్యూహాలు, అత్యాధునిక ఈవీ సాంకేతికతతో రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ తన నంబర్ వన్ స్థానం కోసం గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More