Telegram ban : టెలిగ్రామ్​పై నిషేధం సరైన నిర్ణయమే- దిల్లీ హైకోర్టు..

Telegram banned in India : నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో పేపర్ లీకేజీలు, కాపీయింగ్ ముఠాల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌ని నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని సమర్థిస్తూ దిల్లీ హైకోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. టెలిగ్రామ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Published on: Jun 19, 2026, 10:45:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం తమ యాప్‌పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ని దిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. టెలిగ్రామ్ యాప్‌ను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సరైన, బలమైన కారణాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

టెలిగ్రామ్ నిషేధంపై దిల్లీ హైకోర్టు తీర్పు..
టెలిగ్రామ్ నిషేధంపై దిల్లీ హైకోర్టు తీర్పు..

నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్​కు ముందు, పేపర్ లీక్ ముఠాలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే నెట్‌వర్క్‌లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి కేంద్రం తీసుకున్న చర్య సమంజసమేనని కోర్టు అభిప్రాయపడింది.

రెండు రోజుల పాటు వరుసగా వాదనలు విన్న దిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్, గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ కింద కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించడంతో, అత్యవసర విచారణ జరపాలని కోరుతూ టెలిగ్రామ్ సంస్థ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

టెలిగ్రామ్ వాదన ఏంటి?

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా, నిబంధనలను సరిగ్గా సమీక్షించకుండానే ఈ నిషేధాన్ని విధించిందని టెలిగ్రామ్ కోర్టులో వాదించింది. యాప్ మొత్తాన్ని పూర్తిగా బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది.

“ప్రభుత్వం జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వులు అత్యంత కఠినమైనవి. ఇది పిటిషనర్ల హక్కులను దెబ్బతీయడమే కాకుండా, భారతదేశంలో ఉన్న 15 కోట్ల (150 మిలియన్లు) మంది టెలిగ్రామ్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంతటి కఠినమైన చర్య తీసుకోవడానికి బలమైన ప్రాతిపదిక ఏదీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో లేదు,” అని టెలిగ్రామ్ సంస్థ కోర్టుకు తెలిపింది.

తమ కంటెంట్ పర్యవేక్షణ వ్యవస్థ ఎంతో బలంగా ఉందని టెలిగ్రామ్ సమర్థించుకుంది. తాము ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్స్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 3500 కోట్ల కంటెంట్ ఐటమ్స్‌ను నిశితంగా పరిశీలిస్తామని చెప్పింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను గుర్తించడంలో తమ వ్యవస్థ 99 శాతం కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని కోర్టుకు వివరించింది.

టెలిగ్రామ్​పై నిషేధం- కేంద్రం వాదన ఏంటి?

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్ సాంకేతిక నిర్మాణం మిగతా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే భిన్నంగా ఉంటుందని, దీనివల్ల ఆ యాప్ దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడం సదరు కంపెనీకి కూడా చాలా కష్టమైన విషయమని చెప్పారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా టెలిగ్రామ్ ఒక ప్రధాన వేదికగా మారిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అసలు వివాదం ఏంటి?

ఈ ఏడాది దేశవ్యాప్తంగా మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు దాదాపు 22.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ కేంద్రాలలో ఈ పరీక్ష జరిగింది. అయితే, పరీక్ష ముగిసిన తర్వాత పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, దర్యాప్తులు జరిగాయి. దీంతో అధికారులు పాత ఫలితాలను రద్దు చేసి, నష్టపోయిన అభ్యర్థుల కోసం తిరిగి రీ-టెస్ట్ (మళ్లీ పరీక్ష) నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకారం.. లీకైన ప్రశ్నపత్రాలను సర్క్యులేట్ చేయడానికి, అభ్యర్థులను తప్పుదోవ పట్టించడానికి కొన్ని ముఠాలు టెలిగ్రామ్ గ్రూపులను విరివిగా వాడుతున్నట్లు గుర్తించారు. ఈ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే తాత్కాలికంగా టెలిగ్రామ్‌పై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు భారతదేశంలో గతంలో పోస్ట్ చేసిన సందేశాలను ఎడిట్ చేసే ‘మెసేజ్-ఎడిటింగ్’ ఫీచర్‌ను కూడా జూన్ 30 వరకు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌ను ఆదేశించింది. దేశ సార్వభౌమత్వం, భద్రత, ప్రజా శాంతిని కాపాడే ఉద్దేశంతో ఆన్‌లైన్ కంటెంట్‌ను లేదా ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసే అధికారాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69ఏ ప్రభుత్వానికి కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారమే కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని దిల్లీ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More