...
...
Next Story

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? భవిష్యత్తు కోసం ఈ 7 విషయాలు తప్పక తెలుసుకోండి

కుటుంబ ఆర్థిక భద్రతకు టర్మ్ ఇన్సూరెన్స్ కవచం లాంటిది. ఎంత కవరేజ్ ఉండాలి, ఏ వయసులో తీసుకోవాలి, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఎంచుకోవచ్చా అనే సందేహాలకు నిపుణుల సలహాలతో కూడిన సమగ్ర మార్గదర్శి ఇది.

Published on: Nov 17, 2026, 20:42:06 IST
Advertisement

జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. అనుకోని విపత్తు ఎదురైనప్పుడు కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కాపాడే ఏకైక ఆయుధం 'టర్మ్ ఇన్సూరెన్స్'. కేవలం తక్కువ ప్రీమియంతో కోట్లాది రూపాయల ఆర్థిక భద్రత కల్పించే ఈ పాలసీపై ఎందరికో ఎన్నో సందేహాలు. ఎప్పుడు తీసుకోవాలి? కవరేజ్ ఎంత ఉండాలి? ఏ ఫీచర్లు ఎంచుకోవాలి? లాంటి ప్రశ్నలన్నింటికీ లైఫ్ ఇన్సూరెన్స్ నిపుణుల సలహాలు, సూచనలు ఇక్కడ తెలుసుకుందాం.

1. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం? ఎప్పుడు తీసుకోవాలి?

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? భవిష్యత్తు కోసం ఈ 7 విషయాలు తప్పక తెలుసుకోండి
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? భవిష్యత్తు కోసం ఈ 7 విషయాలు తప్పక తెలుసుకోండి

ఆదాయం ఆర్జిస్తూ తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరికీ టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. పెళ్లికాని యువత సైతం తమ తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటే ఈ పాలసీ తీసుకోవాలి. దీన్ని వీలైనంత త్వరగా అంటే 25 నుంచి 30 ఏళ్ల లోపు తీసుకోవడం అత్యుత్తమం. వయసు తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి చాలా తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజ్ దొరుకుతుంది. పైగా ఆ ప్రీమియం జీవితాంతం మారకుండా స్థిరంగా ఉంటుంది.

2. వయసు పెరిగే కొద్దీ తీసుకోవడం ఎందుకు కష్టం?

వయసు ముప్పై, ముప్పైఐదు దాటిన తర్వాత జీవనశైలి వ్యాధులు (బీపీ, మధుమేహం తదితర) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఇచ్చే ముందు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయిస్తాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం అమాంతం పెరుగుతుంది. కొన్నిసార్లు కంపెనీలు పాలసీ ఇవ్వడానికి నిరాకరించవచ్చు కూడా. అందుకే ఈ విషయంలో ఆలస్యం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

3. ఎంత కవరేజ్ ఉండాలి? ఏ ఫీచర్లు అవసరం?

మీ వార్షికాదాయానికి కనీసం 15 నుంచి 20 రెట్లు లైఫ్ కవర్ ఉండేలా చూసుకోవాలి. దీనికి తోడు మీకున్న హోమ్ లోన్, ఇతర అప్పులను కూడా కలుపుకుని కవరేజ్ నిర్ణయించుకోవాలి. కవరేజ్‌తో పాటు కొన్ని రైడర్లు కూడా ముఖ్యమే. ప్రమాదవశాత్తు మరణిస్తే అదనపు మొత్తం వచ్చేలా 'యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్', ఏదైనా తీవ్రమైన వ్యాధి వస్తే కవరేజ్ ఇచ్చే 'క్రిటికల్ ఇల్‌నెస్', వికలాంగులుగా మారితే తదుపరి ప్రీమియంలు మాఫీ అయ్యే 'వేవర్ ఆఫ్ ప్రీమియం', ‘టోటల్ డిజేబులిటీ’ వంటి రైడర్లను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం.

4. పాలసీ వ్యవధి.. ప్రీమియం చెల్లింపులు ఎలా ఉండాలి?

ప్రీమియం చెల్లింపుల విషయంలో నెలవారీ కంటే 'వార్షిక' (ఏడాదికి ఒకసారి) విధానం ఎంచుకోవడం మేలు. వార్షిక చెల్లింపులపై కంపెనీలు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ప్రతి నెలా ఖాతాలో డబ్బులు ఉంచుకోవడం, ట్రాకింగ్ చేసుకోవడం లాంటి ఇబ్బందులు తప్పుతాయి.

5. లిమిటెడ్ పే వర్సెస్ రెగ్యులర్ పే.. ఏది బెస్ట్?

పాలసీ ఉన్నంత కాలం ప్రీమియం చెల్లించే విధానాన్ని (రెగ్యులర్ పే) ఎంచుకోవడమే లాభదాయకమే. ద్రవ్యోల్బణాన్ని (ఇన్‌ఫ్లేషన్) లెక్కలోకి తీసుకుంటే భవిష్యత్తులో మీరు కట్టే ప్రీమియం విలువ తగ్గుతూ వస్తుంది. కాబట్టి రెగ్యులర్ పే విధానమే ఉత్తమం. అయితే భవిష్యత్తులో మీకు ఆదాయ మార్గం ఉండదని భావిస్తే మీరు లిమిటెడ్ పే.. అంటే ఓ పది పన్నేండేళ్లలో ప్రీమియం చెల్లించేస్తే మేలు. ఇలా లిమిటెడ్ పేలో చెల్లించడం వల్ల మీరు మొత్తంగా చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది. వ్యాపారాలు చేసేవారు, భవిష్యత్తు ఆదాయంపై స్పష్టత లేని వారు, ఉద్యోగ భద్రత లేనివారు లిమిటెడ్ పే వైపు మొగ్గుచూపాలి.

6. రిటర్న్ ఆఫ్ ప్రీమియం.. అదొక మాయ

పాలసీ గడువు ముగిశాక మనం కట్టిన డబ్బులు వెనక్కి వస్తే బాగుంటుంది కదా అని చాలామంది 'రిటర్న్ ఆఫ్ ప్రీమియం' (టీఆర్ఓపీ) ఆప్షన్ ఎంచుకుంటారు. ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇది ఒక తప్పుడు నిర్ణయం. ఈ ఫీచర్ కోసం మీరు రెట్టింపు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకుని ఆ మిగిలిన ప్రీమియం మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే.. పాలసీ గడువు ముగిసేనాటికి మీకు వచ్చే రాబడి, ఇన్సూరెన్స్ కంపెనీ వెనక్కి ఇచ్చే మొత్తంతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది.

7. ఆటో-పే ముఖ్యం.. గ్రేస్ పీరియడ్ ఎంతంటే?

ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకు 'ఆటో-పే' (బ్యాంకు ఖాతా నుంచి ఆటోమెటిక్‌గా కట్ అయ్యేలా ఈ-మ్యాండేట్) సెట్ చేసుకోవడం అత్యంత అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రీమియం తేదీ మర్చిపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఒకవేళ గడువు తేదీ దాటినా కంపెనీలు నిబంధనల ప్రకారం కొంత 'గ్రేస్ పీరియడ్' ఇస్తాయి. వార్షిక చెల్లింపులకు 30 రోజులు, నెలవారీ చెల్లింపులకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ వ్యవధిలో ఎలాంటి పెనాల్టీ లేకుండా ప్రీమియం కట్టొచ్చు. గ్రేస్ పీరియడ్ కూడా దాటితే పాలసీ పూర్తిగా రద్దవుతుంది. ఒకవేళ ఆ సమయంలో పాలసీదారుడికి ఏమైనా జరిగితే కుటుంబానికి ఒక్క రూపాయి కూడా రాదు. గ్రేస్ పీరియడ్ లో ఏదైనా జరిగితే ఆ ప్రీమియం మైనస్ చేసి డెత్ బెనిఫిట్ చెల్లిస్తారు.

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడి కాదు, అదొక రక్షణ కవచం. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకుని మీ కుటుంబ ఆర్థిక భద్రత కోసం సరైన కవరేజ్‌తో స్వచ్ఛమైన టర్మ్ పాలసీని ఎంచుకోండి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks