వెనిజులా చమురుపై ట్రంప్ మాస్టర్ ప్లాన్: 50 మిలియన్ బారెళ్ల విక్రయానికి సిద్ధం
వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 50 మిలియన్ బారెళ్ల వెనిజులా చమురును విక్రయించి, ఆ నిధులను ఇరు దేశాల ప్రయోజనాల కోసం వాడనున్నట్లు ప్రకటించారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న కొద్దిరోజులకే, ఆ దేశ చమురు నిల్వలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని బయటపెట్టారు. వెనిజులా నుంచి సుమారు 50 మిలియన్ బారెళ్ల నాణ్యమైన చమురును సేకరించి, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాలోని ప్రస్తుత తాత్కాలిక యంత్రాంగం ఈ చమురును అమెరికాకు అప్పగిస్తుందని ఆయన తెలిపారు.
"వెనిజులాలోని తాత్కాలిక అధికారులు 30 నుంచి 50 మిలియన్ బారెళ్ల అత్యంత నాణ్యమైన చమురును అమెరికాకు అప్పగిస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ చమురు విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16,000 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా.
నిధులపై అమెరికా నియంత్రణ ఈ విక్రయం ద్వారా వచ్చే సొమ్ముపై తనకే పూర్తి నియంత్రణ ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. "ఈ చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తాం. అమెరికా అధ్యక్షుడిగా ఆ నిధులు నా పర్యవేక్షణలోనే ఉంటాయి. వెనిజులా, అమెరికా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఈ సొమ్మును వినియోగించేలా నేను చూస్తాను" అని ఆయన వివరించారు.
నిజానికి వెనిజులాలో ప్రస్తుతం లక్షలాది బారెళ్ల చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ట్యాంకర్లలో, భారీ స్టోరేజ్ ట్యాంకుల్లో ఉన్న ఈ చమురును ఎగుమతి చేయకుండా గత డిసెంబర్ నుంచి ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజా ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్‌ను ట్రంప్ ఆదేశించారు. "స్టోరేజ్ షిప్పుల ద్వారా ఈ చమురును నేరుగా అమెరికాలోని అన్లోడింగ్ డాక్స్‌కు తరలిస్తాం" అని ట్రంప్ వెల్లడించారు.
సైనిక చర్య - వెనిజులా స్పందన
అమెరికా డిమాండ్లకు తలొగ్గకపోతే మరిన్ని సైనిక చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మదురోను పట్టుకునేందుకు అమెరికా జరిపిన మెరుపు దాడిలో కనీసం 24 మంది వెనిజులా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, వెనిజులా ఉన్నతాధికారులు అమెరికా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. మదురో అరెస్టును 'కిడ్నాప్'గా అభివర్ణించడమే కాకుండా, దేశంలోని అపారమైన చమురు సంపదను దోచుకోవడానికే అమెరికా ఈ కుట్ర పన్నిందని వారు ఆరోపిస్తున్నారు.
చమురు దిగ్గజాలతో భేటీ
వెనిజులాలో మారిన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా తన తదుపరి అడుగులను వేగంగా వేస్తోంది. ఇందులో భాగంగా ఎక్సాన్ (Exxon), షెవ్రాన్ (Chevron), కోనోకో ఫిలిప్స్ (ConocoPhillips) వంటి దిగ్గజ చమురు కంపెనీల ప్రతినిధులతో వైట్ హౌస్‌లో శుక్రవారం ట్రంప్ భేటీ కానున్నారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 1.5 శాతం మేర పతనం కావడం గమనార్హం.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


