...
...
Next Story

Iran war : 'మంగళవారం రాత్రి 8 గంటలు'.. ఇరాన్​కి ట్రంప్​ అల్టిమేటం- ఆ తర్వాత భస్మమే!

Trump Iran War : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం లోగా శాంతి ఒప్పందం కుదరని పక్షంలో ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ప్రకటించారు. దీనిపై ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తూ, అమెరికా చర్యలు ఆ దేశాన్ని నరకంలోకి నెడతాయని హెచ్చరించింది.

Published on: Apr 6, 2026, 09:11:16 IST
Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. మంగళవారం లోగా వాషింగ్టన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో టెహ్రాన్ విఫలమైతే, 'ఇరాన్ మొత్తాన్ని పేల్చివేస్తాను' అని ట్రంప్ అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ పౌరులకు జీవనాధారమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తానని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ నేరాల చర్చకు దారితీస్తోంది. ట్రంప్​ హెచ్చరికలకు ఇరాన్​ భయపడటం లేదు! ట్రంప్​ తాను చెప్పింది చేస్తే, ప్రతిచర్యగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలపై తాము కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ట్రంప్ ఏమన్నారంటే?

డొనాల్డ్​ ట్రంప్​.. (via REUTERS)
డొనాల్డ్​ ట్రంప్​.. (via REUTERS)

అమెరికా మీడియా సంస్థలతో వరుస ఇంటర్వ్యూల్లో మాట్లాడిన ట్రంప్, రాబోయే 48 గంటల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే "మేము ఆ దేశం మొత్తాన్ని పేల్చివేస్తున్నాం" అని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు (ఈస్టర్న్ టైమ్​) ఛాన్స్​ ఇస్తున్నట్టు వెల్లడించారు.

‘యాక్సియోస్’, 'ఫాక్స్ న్యూస్' నివేదికల ప్రకారం.. "ఒప్పందం చేసుకోకపోతే అక్కడ ప్రతి వస్తువును నేలమట్టం చేస్తాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్ ఇప్పటికే చిన్నాభిన్నమైందని, ప్రతిరోజూ పరిస్థితి మరింత దిగజారుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.. "వారు ప్రతిరోజూ మరిన్ని వంతెనలు, మరిన్ని పవర్ ప్లాంట్లు నిర్మించుకోవాల్సి వస్తుంది. చరిత్రలో ఏ దేశం కూడా ఇలాంటి దెబ్బను తిని ఉండదు," అని హెచ్చరించారు.

సామాన్య పౌరుల ప్రాణనష్టంపై వస్తున్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. అక్కడి ప్రభుత్వ వ్యతిరేకులు తమ దాడులకు మద్దతు ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. "ప్రజలు భయంతో బతుకుతున్నారు. మేము యుద్ధం మధ్యలో వదిలేస్తామని వారు భయపడుతున్నారు, కానీ మేము వెనక్కి తగ్గం," అని యాక్సియోస్‌తో అన్నారు.

ట్రూత్ సోషల్ వేదికగా ఘాటు హెచ్చరిక..

ట్రంప్​ హెచ్చరికలతో ఉద్రిక్తతలు చల్లబడే సూచనలు కనిపించడం లేదు. గత రెండు వారాలుగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీల మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మార్గాన్ని తెరిచేందుకు బదులుగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ట్రంప్ విధించిన గడువును పొడిగించేందుకు లేదా కనీసం పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మధ్యవర్తులు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తున్నారు.

ఇరాన్ ధీటైన ప్రతిస్పందన..

ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. "మీ నిర్లక్ష్యపు చర్యలు అమెరికాలోని ప్రతి కుటుంబాన్ని 'నరకం'లోకి లాగుతున్నాయి," అని మండిపడ్డారు. ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించాలని, ఈ ప్రమాదకరమైన ఆటను ఆపాలని గాలిబాఫ్ డిమాండ్ చేశారు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ఏమిటి?

మంగళవారం రాత్రి 8 గంటల లోగా (ఇండియాలో బుధవారం) శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తామని ట్రంప్ 48 గంటల గడువు విధించారు.

2. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది?

ట్రంప్ చర్యలు అమెరికాను నరకంలోకి నెడతాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. ఒకవేళ దాడులు జరిగితే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై తాము కూడా ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

3. ప్రస్తుతం మధ్యవర్తులు చర్చల విషయంలో ఎంతవరకు సఫలమయ్యారు?

పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ తెరవాలనే అమెరికా డిమాండ్‌పై ఇరు దేశాల మధ్య ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు. మధ్యవర్తులు కనీసం పాక్షిక ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe