Iran War : ‘సరదా సరదాకే అటాక్​ చేసేస్తాం చూసుకోండి’- ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​..

Kharg Island attack : ఇరాన్‌లోని ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌పై మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ప్రతిదాడులకు దిగుతుండటంతో, మూడో వారంలోకి ప్రవేశించిన ఈ యుద్ధం అంతర్జాతీయ చమురు మార్కెట్లను కుదిపేస్తోంది.

Published on: Mar 15, 2026 10:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన 'ఖార్గ్ ఐలాండ్'పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించడమే కాకుండా, హర్ముజ్ జలసంధిని కాపాడేందుకు మిత్రదేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. అటు టెహ్రాన్ సైతం తన ప్రతిస్పందనను తీవ్రతరం చేస్తామని ప్రతిజ్ఞ చేయడంతో, ఆదివారం నాటికి ఈ యుద్ధం ముగిసే సూచనలేవీ కనిపించడం లేదు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​..

ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు: ‘సరదా కోసం మరిన్ని దాడులు’

ఎన్​బీసీ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్, అమెరికా జరిపిన దాడుల్లో ఖార్గ్ ఐలాండ్‌లోని మెజారిటీ భాగం ఇప్పటికే పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. "మేము దానిని కేవలం సరదా కోసం (జస్ట్​ ఫర్​ ఫన్​) మరికొన్ని సార్లు అటాక్​ చేయొచ్చు," అని ఆయన హెచ్చరించడం గమనార్హం.

యుద్ధాన్ని ముగించేందుకు టెహ్రాన్ ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఓవైపు చెబుతూనే, ఇరాన్​ చమురు ఉత్పత్తికి అత్యంత కీలకమైన ఐలాంట్​పై దాడులు చేస్తామని ట్రంప చెప్పడం సర్వత్రా చర్చకు దారితీసింది.

గతంలో ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన ట్రంప్, ఇప్పుడు మరింత దూకుడుగా వ్యాఖ్యలు చేయడం దౌత్యపరమైన ప్రయత్నాలకు విఘాతంగా మారింది. మధ్యప్రాచ్య మిత్రదేశాలు చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించాలని చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఖార్గ్ ఐలాండ్ నష్టంపై భిన్న వాదనలు..

అమెరికా ఇటీవలే ఖార్గ్ ఐలాండ్‌పై దాడి చేసింది. దీని ద్వారా జరిగిన నష్టంపై ఇరాన్ తక్కువ చేసి చెబుతోంది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఆ ద్వీపంలో నౌకాదళ మైన్ స్టోరేజ్ సెంటర్లు, క్షిపణి బంకర్లతో సహా 90కి పైగా సైనిక లక్ష్యాలను తాము కొట్టామని పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ రక్షణ శాఖ శనివారం యూఏఈ వైపు 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను ప్రయోగించింది. దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్, అబుదాబిలోని ఖలీఫా పోర్ట్ వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో నివసించే వారు ఇళ్లు ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించింది.

హర్ముజ్ జలసంధి: ప్రపంచానికి ముప్పు..

ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు ప్రధాన మార్గమైన హర్ముజ్ జలసంధిని అడ్డుకోగలిగే సామర్థ్యం ఇరాన్ వద్ద ఉండటం అమెరికా, దాని మిత్రదేశాలకు పెద్ద సమస్యగా మారింది. ఈ యుద్ధం కారణంగా చమురు సరఫరాలో మునుపెన్నడూ లేని విధంగా అంతరాయం ఏర్పడి, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. "హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు ఆ మార్గాన్ని రక్షించుకోవాలి.. మేము కూడా చాలా సహాయం చేస్తాం," అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ముదురుతున్న పోరు: పౌరుల మరణాలు..

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్- అమెరికా ఇరాన్‌పై గగనతల దాడులు ప్రారంభించినప్పటి నుంచి, ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా మరణించారు. వీరిలో అత్యధికులు ఇరాన్ పౌరులే. శనివారం ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో ఒక ఫ్యాక్టరీపై జరిగిన దాడిలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

అటు ఇరాన్ దళాలు కూడా ప్రతిదాడులను కొనసాగిస్తున్నాయి. శనివారం యూఏఈలోని ప్రధాన ఇంధన కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. అలాగే బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో, అమెరికా పౌరులు వెంటనే ఇరాక్ విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. యూఏఈలోని ఓడరేవులు, డాక్‌లు, "అమెరికా స్థావరాల" నుంచి పౌరులు ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించింది.

మొజ్తబా క్షేమంగా ఉన్నారు..

అత్యున్నత నాయకుడు అయితొల్లా మోజ్తబా ఖమేనీ అనారోగ్యంపై అమెరికా చేస్తున్న వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. "కొత్త సుప్రీం లీడర్‌కు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు," అని స్పష్టం చేశారు.

అయితే, ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

అంతర్జాతీయ చమురు మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ యుద్ధం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More