Electric Bike : రూ. 20వేల తేడా- కానీ చాలా డిఫరెంట్! ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఏది బెస్ట్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 వర్సెస్ అల్ట్రావైలెట్ ఎఫ్77.. ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఏది బెస్ట్? దేని రేంజ్ ఎక్కువ? దేని ధర తక్కువ? ఎందులో ఫీచర్లు ఎక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశపు ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు క్లాసిక్ వారసత్వంతో వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ అందరిని ఆకర్షిస్తుంటే.. మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ, పవర్‌తో అల్ట్రావైలెట్ ఎఫ్77 దూసుకెళుతోంది. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వీటి పనితీరు మాత్రం పూర్తి భిన్నం. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఆర్ఈ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 వర్సెస్ అల్ట్రావైలెట్ ఎఫ్77- ధరల వ్యత్యాసం ఎంత?
ధర పరంగా చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 కొంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6: రూ. 2.79 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).
అల్ట్రావైలెట్ ఎఫ్77 (Mach 2/SuperStreet): రూ. 2.99 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).
కేవలం ₹20 వేల వ్యత్యాసమే ఉన్నప్పటికీ, ఈ రెండు బైక్‌లు వేర్వేరు రకాల రైడర్లను ఆకర్షిస్తున్నాయి.
అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన ఈ తొలి ఎలక్ట్రిక్ బైక్‌లో బీఏఏఎస్ సర్వీస్ కూడా ఉంది. ఫలితంగా కొనుగోలు ధర భారీగా తగ్గుతుంది.
ఆర్ఈ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 వర్సెస్ అల్ట్రావైలెట్ ఎఫ్77- పనితీరు, రేంజ్..
సాంకేతిక వివరాల పరంగా చూస్తే, అల్ట్రావైలెట్ ఎఫ్77 స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6:
ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని ప్రధానంగా సిటీ రైడింగ్ కోసం రూపొందించారు. ఇందులో 3.91 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 154 కిలోమీటర్ల (ఐడీసీ) రేంజ్‌ను ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. కేవలం 65 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
అల్ట్రావైలెట్ ఎఫ్77:
ఇది ప్యూర్ పెర్ఫార్మెన్స్ మెషీన్. దీనిలోని 10.3 కేడబ్ల్యూహెచ్ భారీ బ్యాటరీ ప్యాక్ 231 కిలోమీటర్ల (డబ్ల్యూఎంటీసీ) రేంజ్‌ను అందిస్తుంది. 40.2 బీహెచ్పీ పవర్, 100 ఎన్ఎం టార్క్‌తో ఇది గంటకు 155 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. వేగం, దూరం రెండింటిలోనూ ఇది ఫ్లయింగ్ ఫ్లీ కంటే ఎంతో ముందుంది.
ఆర్ఈ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 వర్సెస్ అల్ట్రావైలెట్ ఎఫ్77- ఫీచర్లు, రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్..
టెక్నాలజీ విషయంలో కూడా ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి:
అల్ట్రావైలెట్ ఎఫ్77: ఇందులో గ్లైడ్, కాంబాట్, బాలిస్టిక్ అనే మూడు రైడ్ మోడ్స్ ఉన్నాయి. డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు దీనిని ఒక రేసింగ్ బైక్‌లా మారుస్తాయి. 5-ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేలో నావిగేషన్, రైడ్ అనలిటిక్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6: రాయల్ ఎన్‌ఫీల్డ్ దీనిని సరళంగా, హుందాగా రూపొందించింది. ఇందులో కూడా ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇవి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్త పడ్డారు.
ఆర్ఈ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 వర్సెస్ అల్ట్రావైలెట్ ఎఫ్77- మీకు ఏ బైక్ సరిపోతుంది?
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 :
మీరు రోజూ ఆఫీసుకి వెళ్లడానికి, సిటీ ట్రాఫిక్‌లో తేలికగా నడపడానికి ఒక స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకుంటే ఇది సరైన ఛాయిస్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ వాల్యూ, తక్కువ ధర దీని ప్రధాన ఆకర్షణ.
అల్ట్రావైలెట్ ఎఫ్77 :
మీకు స్పీడ్ అంటే ఇష్టమా? లాంగ్ రైడ్స్ వెళుతుంటారా? అదిరిపోయే యాక్సిలరేషన్ కావాలా? అయితే రూ. 20 వేలు అదనంగా ఖర్చు చేసి ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం ఉత్తమం. ఇది కేవలం ప్రయాణానికే కాదు, ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బ్యాటరీని ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చా?
అవును, సాధారణ ఛార్జర్‌తో ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ అందించే ఫాస్ట్ ఛార్జర్‌తో 65 నిమిషాల్లో 80% ఛార్జింగ్ పూర్తవుతుంది.
2. అల్ట్రావైలెట్ ఎఫ్77లో ఉన్న రైడ్ మోడ్స్ వల్ల ఉపయోగం ఏంటి?
రైడ్ మోడ్స్ ద్వారా మీరు బైక్ పవర్ డెలివరీని మార్చుకోవచ్చు. ఉదాహరణకు, 'గ్లైడ్' మోడ్ సిటీలో ఎక్కువ రేంజ్ ఇస్తుంది, 'బాలిస్టిక్' మోడ్ గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
3. ఈ రెండు బైక్‌లలో దేనికి మెయింటెనెన్స్ తక్కువ?
సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లన్నింటికీ మెయింటెనెన్స్ తక్కువే. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు దేశవ్యాప్తంగా విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉండటం వల్ల ఫ్లయింగ్ ఫ్లీ వినియోగదారులకు కొంత సౌకర్యంగా ఉండవచ్చు.
4. లాంగ్ రైడ్స్ (హైవే ప్రయాణాలు) కోసం ఏది మంచిది?
పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ (231 కి.మీ), గరిష్ట వేగం ఉన్నందున అల్ట్రావైలెట్ ఎఫ్77 హైవే ప్రయాణాలకు చాలా మెరుగ్గా ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


