...
...
Next Story

Woman kills husband : భర్తను చంపి బాత్‌రూమ్ కింద పాతిపెట్టిన భార్య.. 45 రోజుల పాటు హైడ్రామా!

UP Crime news : యూపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ, తన భర్తను ప్లాన్ ప్రకారం చంపేసి, బాత్​రూమ్​లో పాతేసింది! అనంతరం అదృశ్యమైన భర్త కోసం బాధపడుతున్నట్టు నటించింది. చివరికి 45 రోజుల తర్వాత పోలీసులకు దొరికిపోయింది.

Published on: Jul 4, 2026, 06:45:38 IST
Advertisement

ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాలో ఒక మహిళ తన భర్తను కిరాతకంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోని బాత్‌రూమ్ ఫ్లోర్ కింద పాతిపెట్టి సిమెంట్‌తో కప్పేసింది. అనంతరం భర్త కనిపించడం లేదంటూ 45 రోజుల పాటు నాటకాలు ఆడింది! చివరికి పోలీసులకు చిక్కింది.

అసలేం జరిగింది?

ఆగ్రాలో భర్తను చంపిన భార్య.. 45 రోజుల పాటు..
ఆగ్రాలో భర్తను చంపిన భార్య.. 45 రోజుల పాటు..

ఆగ్రాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. దహతోరా ప్రాంతంలో నివసించే 44 ఏళ్ల సురేంద్ర శర్మ, ఆయన భార్య రూబీ శర్మలకు 16 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేంద్ర శర్మకు మద్యపానం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మే నెలలో ఒకరోజు రూబీ పక్కా ప్లాన్ ప్రకారం తన ఇద్దరు కుమార్తెలను సురేంద్ర పెద్దన్నయ్య ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత భర్తకు ఇష్టమైన ఖీర్ (పరమాన్నం)లో నిద్రమాత్రలు కలిపి తినిపించింది. అతను స్పృహ కోల్పోగానే గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసింది.

బాత్‌రూమ్ కింద సమాధి.. కొత్త టైల్స్!

హత్య చేసిన మరుసటి రోజు ఉదయం రూబీ ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లోని బాత్‌రూమ్ ఫ్లోర్‌ను తవ్వి భర్త శవాన్ని అందులో వేసి మట్టితో పూడ్చేసింది. అంతటితో ఆగకుండా, ఆ ప్రదేశంపై సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయించి, కొత్తగా టైల్స్ వేయించింది. ఇందుకోసం ఆమె ముందే మేస్త్రీ, కూలీలను కూడా మాట్లాడి ఉంచడం గమనార్హం.

45 రోజుల పాటు నాటకం..

సురేంద్ర శర్మకు సంబంధించిన పాత కేసు ఒకదాని వెరిఫికేషన్ కోసం శుక్రవారం పోలీసులు హఠాత్తుగా వారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రూబీ తీవ్ర ఆందోళనకు గురై భయపడుతూ కనిపించింది. వెంటనే అక్కడికి వచ్చిన సురేంద్ర సోదరుడు తన అనుమానాలను పోలీసులకు వివరించాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఇల్లంతా తనిఖీ చేయగా, బాత్‌రూమ్‌లో కొత్తగా వేసిన టైల్స్, ప్లాస్టరింగ్ వారి దృష్టిని ఆకర్షించాయి.

పోలీసులు రూబీని తమదైన శైలిలో విచారించగా, ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీనితో పోలీసులు కార్మికుల సహాయంతో బాత్‌రూమ్ ఫ్లోర్‌ను పగలగొట్టి, లోపల కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం నిందితురాలు రూబీ శర్మను ఆగ్రా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ హత్యలో, శవాన్ని దాచడంలో ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో హరిపర్వత్ ఏసీపీ హేమంత్ పటేల్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.

ఈ దారుణ ఉదంతం ఫిబ్రవరి 2025లో జరిగిన సంచలనాత్మక 'బ్లూ డ్రమ్' మర్డర్ కేసును గుర్తుకు తెస్తోంది. ఆ కేసులో ముస్కాన్ రాజ్‌పుత్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన తన భర్త సౌరభ్‌ను చంపి, ముక్కలుగా నరికి, బ్లూ కలర్ డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో సీల్ చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks