Iran Israel Conflict : పశ్చిమాసియాలో అలజడులు! అమెరికాపై ఇరాన్​ ప్రతీకారం.. భారత్​ మౌనంపై సోనియా ఆగ్రహం

Iran war : పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అదుపుతప్పుతున్నాయి. ఇరాన్ అగ్రనేత అయతొల్లా అల్​ ఖమేనీ మరణానంతరం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్, అమెరికా లక్ష్యాలపై దాడులను తీవ్రం చేసింది. మరోవైపు ఈ పూర్తి వ్యవహారంపై భారత్​ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత సోనియా గాంధీ తప్పుబట్టారు.

Published on: Mar 3, 2026, 10:45:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద సోమవారం రాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం భవనంపై నుంచి దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి వ్యాపించింది. ఇజ్రాయెల్ సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో దాడులకు గురైన వాషింగ్టన్ దౌత్య కార్యాలయాల జాబితాలో ఇది తాజా చేరిక!

ఇరాన్​పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా నిరసనలు..
ఇరాన్​పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా నిరసనలు..

రియాద్‌లోని విదేశీ మిషన్లు ఉండే 'డిప్లొమాటిక్ క్వార్టర్'లో నల్లటి పొగ రావడాన్ని తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. రెండు డ్రోన్ల ద్వారా అమెరికా ఎంబసీపై దాడి జరిగిందని, దీనివల్ల భవనానికి స్వల్ప నష్టం వాటిల్లడంతో పాటు చిన్నపాటి మంటలు చెలరేగాయని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ట్రంప్ ప్రతీకార హెచ్చరిక.. రంగంలోకి సైన్యం!

ఈ దాడిని, శనివారం నుంచి ఇరాన్ జరుపుతున్న దాడుల్లో ఆరుగురు అమెరికా సైనికులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రతీకారం తీర్చుకుంటామని మంగళవారం ప్రతిజ్ఞ చేశారు. అయితే, అవసరమైతే సైన్యాన్ని యుద్ధరంగంలోకి దింపుతామని సోమవారం ప్రకటించిన ఆయన తాజాగా మాట మర్చారు. ఆ అవసరం రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఏదేమైనా పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు చల్లారడానికి 4 నుంచి 5 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, సౌదీలోని జెడ్డా, రియాద్, ధహ్రాన్ ప్రాంతాల్లో ఉన్న అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఎంబసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ప్రాంతంలోని మిలిటరీ స్థావరాలకు వెళ్లే ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.

కువైట్, జోర్డాన్, ఇరాక్‌లలోనూ ఉద్రిక్తతలు!

సోమవారం కువైట్, జోర్డాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరిగాయి. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని ఎంబసీ సిబ్బందిని ముందుజాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ వద్ద నిరసనకారులు భద్రతా దళాలతో రెండో రోజూ ఘర్షణ పడ్డారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఆందోళనకారులు రాళ్లు రువ్వగా, భద్రతా దళాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. అంతకుముందు రోజు, గ్రీన్ జోన్ ఏరియాలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారని అధికారులు ఆరోపించారు.

ఇప్పటివరకు ఇరాన్‌లోని పలు నగరాలపై అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 555 మంది మరణించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతమంతా ప్రతీకార దాడులు చేస్తోంది. అదే సమయంలో ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్​ జలసంధిని మూసివేసింది. ఇది ప్రపంచ దేశాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

దుబాయ్‌లో ఇరాన్ 'డబుల్ స్ట్రైక్'

అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో మరింత లోతుకు వ్యాపిస్తోంది. దుబాయ్‌లో అమెరికా, ఆస్ట్రేలియా బలగాలకు సంబంధించిన స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. అమెరికా దళాలతో సంబంధం ఉన్న ఒక భవనాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అయితే, అక్కడ జరిగిన నష్టం లేదా ప్రాణనష్టంపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

దుబాయ్ సమీపంలోని ఆస్ట్రేలియా సైనిక స్థావరం ‘అల్ మిన్హాద్’పై ఇరాన్ దాడులు చేసినట్లు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ధృవీకరించారు. కాగా అక్కడ ఉన్న 100 మందికి పైగా ఆస్ట్రేలియా సైనికులు సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఇరాన్ 'ఆపరేషన్ ట్రూత్‌ఫుల్ ప్రామిస్ 4'

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్​జీసీ) తాము "ఆపరేషన్ ట్రూత్‌ఫుల్ ప్రామిస్ 4"లో భాగంగా అమెరికా బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. దుబాయ్‌తో పాటు ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి.

ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికాకు 13 సైనిక స్థావరాలు, సుమారు 30,000 నుంచి 40,000 మంది సైనికులు ఉన్నారు.

ఖమేనీ మరణంపై భారత్ మౌనం - సోనియా గాంధీ ఆగ్రహం

మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీ హత్యపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న మౌనాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఓ జాతీయ వార్తా సంస్థ కాలమ్‌లో ఆమె రాస్తూ.. "ప్రభుత్వ మౌనం తటస్థత కాదు, బాధ్యతల నుంచి పారిపోవడమే," అని విమర్శించారు. ఇరాన్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలు కేవలం వ్యూహాత్మకమే కాదు, నాగరికతతో ముడిపడి ఉన్నవని ఆమె గుర్తు చేశారు.

1994లో కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం రాకుండా ఇరాన్ అడ్డుకున్న విషయాన్ని సోనియా గుర్తు చేశారు. చాబహార్ ఓడరేవు, జహెదాన్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత్ ఉనికికి ఇరాన్ సహకారం కీలకమని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో ఇరాన్‌తో ఉన్న లోతైన బంధాన్ని ప్రస్తుత మోదీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

ఒక విదేశీ అగ్రనేతను చర్చల సమయంలో హత్య చేస్తే, దానికి నిరసన తెలపకపోవడం భారత విదేశీ విధానంపై అనుమానాలు రేకెత్తిస్తోందని ఆమె రాశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More