VinFast VF MPV 7 : విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- ఎలక్ట్రిక్ కారు ఎలా ఉందంటే..
VinFast VF MPV 7 : వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'విన్‌ఫాస్ట్' భారత మార్కెట్లోకి తన మూడొవ ప్రాడక్ట్‌గా 'వీఎఫ్ ఎంపీవీ 7'ను విడుదల చేయబోతోంది. వియత్నాం ప్లాంట్‌లో ఈ కారును నడిపిన మా ప్రతినిధి అందిస్తున్న పూర్తి స్థాయి రివ్యూ మీకోసం..
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 కారును వియత్నాంలోని కంపెనీ భారీ ప్లాంట్‌లో నడిపే అవకాశం హెచ్‌టీ ఆటోమొబైల్ టీమ్‌కి లభించింది. అక్కడ పరీక్షించింది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎల్‌హెచ్‌డీ) వెర్షన్ అయినప్పటికీ, భారత్‌లోకి రాబోయే రైట్ హ్యాండ్ డ్రైవ్ (ఆర్‌హెచ్‌డీ) వెర్షన్ కూడా దాదాపు ఇదే పనితీరును కలిగి ఉంటుంది. అయితే, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫీచర్ల పరంగా చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వీఎఫ్ ఎంపీవీ 7 ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ చూసేయండి..

విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- విజువల్ ఇంపాక్ట్, డిజైన్..
మొదటి చూపులోనే వీఎఫ్ ఎంపీవీ 7 తన భారీ పరిమాణంతో ఆకట్టుకుంటుంది. దీని కొలతలు చూస్తే:
- పొడవు: 4,740 ఎంఎం
- వెడల్పు: 1,872 ఎంఎం
- ఎత్తు: 1,734 ఎంఎం
- వీల్‌బేస్: 2,840 ఎంఎం
ఈ డైమెన్షన్స్ కారుకు రోడ్డుపై మంచి ప్రెజెన్స్‌ని ఇస్తాయి. ముందు భాగంలో విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ 'వీ' ఆకారపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ ఉన్నాయి. మధ్యలో బ్రాండ్ లోగో వెలుగుతూ కనిపిస్తుంది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వర్టికల్ డిజైన్‌లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి ముందు గ్రిల్ క్లోజ్ చేసి ఉంటుంది. కింది వైపున బ్లాక్ థీమ్‌తో కూడిన గ్రిల్ ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 19- ఇంచ్ ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ వీల్స్ డిజైన్ గతంలో వచ్చిన వీఎఫ్ 6, వీఎఫ్ 7 కంటే భిన్నంగా ఉంది. డోర్ హ్యాండిల్స్ సాధారణ పద్ధతిలోనే ఉన్నాయి. వెనుక వైపు డిజైన్ చూడటానికి ‘టాటా సియెర్రా’ను గుర్తు చేస్తుంది. వెనుక వైపు కూడా వెడల్పైన కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- క్యాబిన్ స్పేస్, సౌకర్యాలు..
ఇదొక ఎంపీవీ కాబట్టి లోపల స్పేస్ ప్రధాన అంశంగా మారుతుంది. విన్‌ఫాస్ట్ ఇందులో రాజీ పడలేదు.
ముందు వరుస: ఇక్కడ ప్రత్యేకమైన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లేదు. దానికి బదులుగా 10.1- ఇంచ్ సెంటర్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. అన్ని కంట్రోల్స్ టచ్ ద్వారానే ఉండటం యువతకు నచ్చవచ్చు కానీ, ఫిజికల్ బటన్స్ ఇష్టపడే వారికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు.
రెండవ వరుస: ఇక్కడ హెడ్ రూమ్, లెగ్ రూమ్ చాలా విశాలంగా ఉన్నాయి. సీట్లు మెత్తగా, ప్రీమియం లెదరెట్ నాణ్యతతో ఉండటంతో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
మూడవ వరుస: ఎంపీవీల్లో థర్డ్ రోలో స్పేస్ తక్కువగా ఉండటం సాధారణం, కానీ వీఎఫ్ ఎంపీవీ 7లో మూడవ వరుసలో కూడా ఇద్దరు వ్యక్తులు ఇరుకుగా అనిపించకుండా కూర్చోవచ్చు.
ఇతర ఫీచర్లు: డెడికేటెడ్ ఏసీ వెంట్స్, టైప్-ఏ, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్స్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, లార్జ్ స్టోరేజ్ ఏరియా వంటివి ప్రాక్టికాలిటీని పెంచాయి.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- మిస్ అయిన ఫీచర్లు..
హెచ్‌టీ ఆటో టీమ్ టెస్ట్ చేసిన వెర్షన్‌లో భారతీయ కస్టమర్లు ఎక్కువగా కోరుకునే సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, అడాస్ వంటి ఫీచర్లు లేవు. విన్‌ఫాస్ట్ ఈ ఎలక్ట్రిక్ కారు 'అడాస్ రెడీ' అని చెబుతోంది, అంటే భారత వెర్షన్‌లో ఈ ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. అలాగే భారత వాతావరణానికి తగినట్టుగా ఏసీని మరింత శక్తివంతం చేయనున్నారు.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- పర్ఫార్మెన్స్, డ్రైవింగ్ అనుభవం..
వీఎఫ్ ఎంపీవీ 7 లో 60.13 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది.
పవర్: 201 బీహెచ్పీ, 280 ఎన్ఎం టార్క్.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఛార్జింగ్: 10-70% ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లో అవుతుంది.
డ్రైవింగ్ సమయంలో పవర్ డెలివరీ చాలా స్మూత్‌గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు బరువు వల్ల ప్రారంభ వేగం కొంచెం నెమ్మదిగా ఉన్నా, ఒకసారి స్పీడ్ అందుకున్న తర్వాత దూసుకెళుతుంది. మేము చేసిన టెస్ట్‌లో 0-100 కి.మీ వేగాన్ని 10.5 సెకన్లలో అందుకుంది. గరిష్ట వేగం 162 కి.మీ వరకు వెళ్లగలిగాము. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- హ్యాండ్లింగ్, సేఫ్టీ..
పెద్ద కారు అయినప్పటికీ కార్నరింగ్, లేన్ చేంజ్ చేసేటప్పుడు కారు చాలా స్థిరంగా ఉంది. బాడీ రోల్ ఉన్నప్పటికీ, హ్యాండ్లింగ్ నాణ్యత మెరుగ్గా ఉంది. సేఫ్టీ పరంగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఏ), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి ఫీచర్లు భద్రతను కల్పిస్తాయి. అయితే క్యాబిన్ లోపలికి బయట శబ్దాలు రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- రివ్యూ..
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 ఒక క్లీన్ అండ్ ప్రాక్టికల్ ఫ్యామిలీ ఎంపీవీ. ఇది చూడటానికి ప్రీమియంగా ఉంటుంది. ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ విన్‌ఫాస్ట్ దీనికి సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను జోడించి, ధరను అందుబాటులో ఉంచితే భారత్‌లో కియా క్యారెన్స్, బీవైడి వంటి కార్లకు ఇది సింహస్వప్నం కానుంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- పాజిటివ్ పాయింట్స్..
- ప్రీమియం, మినిమలిస్ట్ డిజైన్.
- విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు.
- శక్తివంతమైన బ్యాటరీ, మంచి రేంజ్.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7- నెగిటివ్ పాయింట్స్..
క్యాబిన్ లోపలికి బయట శబ్దాలు రావడం.
ఫిజికల్ కంట్రోల్ బటన్స్ లేకపోవడం.
ప్రస్తుత వెర్షన్‌లో సన్‌రూఫ్, అడాస్, 360-డిగ్రీ కెమెరా లేకపోవడం.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 ఎలక్ట్రిక్ కారు ఈ నెల 15న లాంచ్కానుంది. ఆ టైమ్‌లో దీని రేంజ్, ధరపై వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


