...
...
Next Story

WhatsApp : ఒక్క మెసేజ్​ పంపినా డబ్బులు కట్టాలి.. ఆ వాట్సాప్ యూజర్లకు షాక్!

వాట్సాప్ బిజినెస్ వేదికగా కస్టమర్లతో సంభాషించే కంపెనీలకు మెటా షాకిచ్చింది. ఉచిత సేవలకు కోత విధిస్తూ అక్టోబర్ 1 నుంచి కొత్త ప్లాట్‌ఫామ్ ఫీజులను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ వివరాలు..

Published on: Oct 1, 2026, 14:02:44 IST
Advertisement

డిజిటల్ యుగంలో కస్టమర్ సేవలు, మార్కెటింగ్ కోసం వాట్సాప్‌పై ఆధారపడుతున్న భారతీయ వ్యాపార సంస్థలకు, స్టార్టప్‌లకు మెటా బిగ్ షాక్ ఇచ్చింది! వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా పంపే మెసేజ్‌లకు ఒక లిమిట్ విధించి, అది దాటితే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. సొల్యూషన్ ప్రొవైడర్లు లేదా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా కస్టమర్లతో మాట్లాడే కంపెనీలు అక్టోబర్ 1 నుంచి డబ్బులు కట్టాల్సిందే అని తేల్చిచెప్పింది.

వాట్సాప్ బిజినెస్​ వాడుతున్నారా? డబ్బులు కట్టాల్సిందే! (AI generated image for representational purposes only)
వాట్సాప్ బిజినెస్​ వాడుతున్నారా? డబ్బులు కట్టాల్సిందే! (AI generated image for representational purposes only)

ఇప్పటివరకు కస్టమర్ సర్వీస్ విండోలో ఉచితంగా లభించిన అనేక సేవలకు ఇకపై కంపెనీలు జేబుల నుంచి డబ్బులు చెల్లించక తప్పదు. అయితే సాధారణ వాట్సాప్ వినియోగదారులకు ఈ నిర్ణయంతో ఎలాంటి సంబంధం లేదు. వారి వ్యక్తిగత చాటింగ్‌లు ఎప్పటిలాగే పూర్తి ఉచితంగా కొనసాగుతాయి.

నెలవారీ ఉచిత కోటా తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే!

మెటా ప్రకటించిన నూతన విధానం ప్రకారం.. ప్రతి బిజినెస్ ఫోన్ నంబర్‌కు నెలకు 1,000 'సర్వీస్ మెసేజ్‌లు' మాత్రమే ఉచితంగా లభిస్తాయి. ఈ పరిమితి దాటిన తర్వాత పంపే ప్రతి మెసేజ్‌కు నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ మెసేజ్ రేట్ల విషయంలో ఎలాంటి బల్క్ డిస్కౌంట్లు లేదా వాల్యూమ్ టైర్లు ఉండవని మెటా స్పష్టం చేసింది.

భారతదేశంలో అమల్లోకి వచ్చిన కొత్త రేట్ల వివరాలు..

సర్వీస్ మెసేజ్‌లు: 1,000 ఉచిత కోటా ముగిసిన తర్వాత వాట్సాప్​లో ప్రతి డెలివరీ అయిన మెసేజ్‌కు రూ. 0.115 వసూలు చేస్తారు.

యుటిలిటీ మెసేజ్‌‌లు: ఆర్డర్ కన్ఫర్మేషన్, డెలివరీ అప్‌డేట్స్ వంటి సమాచారం కోసం పంపే మెసేజ్‌లకు కూడా ఒక్కో దానికి రూ. 0.115 చెల్లించాలి.

మార్కెటింగ్ మెసేజ్‌లు: ప్రమోషనల్ ఆఫర్లు, ప్రకటనల కోసం పంపే ప్రతి మెసేజ్‌కు రూ. 0.8631 ఛార్జ్ చేస్తారు.

(గమనిక: ఈ ధరలకు థర్డ్ పార్టీ ప్రొవైడర్లు విధించే అదనపు పన్నులు, ఫీజులు వర్తిస్తాయి.)

'యుటిలిటీ' సేవలకు ఇక ఛార్జీల బాదుడు..

సాధారణంగా కస్టమర్ ఒక కంపెనీకి మెసేజ్ పంపిన తర్వాత 24 గంటల ఉచిత సపోర్ట్ విండో ప్రారంభమవుతుంది. గతంలో ఈ 24 గంటల సమయంలో బిజినెస్ ఏజెంట్లు లేదా ఏఐ బాట్‌లు పంపే నాన్-టెంప్లేట్ సర్వీస్ మెసేజ్‌లకు మెటా ఎటువంటి రుసుము వసూలు చేయలేదు. అయితే అక్టోబర్ 1 నుంచి ఈ విండోలో పంపే యుటిలిటీ మెసేజ్‌లతో సహా అన్ని రకాల సంభాషణలను ఛార్జబుల్ కేటగిరీ కిందకే తీసుకువచ్చారు.

పేమెంట్ మోడ్ తప్పనిసరి.. లేదంటే అకౌంట్ బ్లాక్!

కొత్త నిబంధనల అమలు నేపథ్యంలో మెటా వ్యాపార సంస్థలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న కంపెనీలు తమ ఖాతాలో సరైన పేమెంట్ విధానాన్ని జోడించాల్సి ఉంటుంది.

ఏఐ చాట్‌లకు వేరే లెక్క!

వ్యాపారాల కోసం మెటా తీసుకొచ్చిన ‘మెటా బిజినెస్ ఏజెంట్’ సేవలకు వేరే ఛార్జింగ్ మోడల్ అమల్లో ఉంటుంది. ఏఐ సాంకేతికత ఆధారంగా కస్టమర్లకు ఆటోమేటిక్ సమాధానాలు ఇచ్చే ఈ సేవలకు 1 మిలియన్ టోకెన్లకు (ఏఐ ప్రాసెస్ చేసే టెక్ట్స్ పరిమాణం) 2 డాలర్లు (సుమారు రూ. 167) వసూలు చేస్తారు. కస్టమర్ వాట్సాప్ యాడ్ ద్వారా చాట్ ప్రారంభించినా, అక్కడ ఏఐ ఏజెంట్ ఇచ్చే స్పందనలకు ఈ టోకెన్ ఛార్జీలు వేరుగా పడతాయి.

ఈ కొత్త ధరల విధానం వల్ల భారతదేశంలో డీ-టు-సీ బ్రాండ్లు, ఈ-కామర్స్ సంస్థలు, స్టార్టప్‌ల కస్టమర్ సపోర్ట్ నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks