...
...
Next Story

Monsoon : కనిపించని మేఘాల జాడ! రుతుపవనాల ఆలస్యానికి కారణం ఏంటి? వర్షాలు పడేదెప్పుడు?

southwest monsoon delay : భారతదేశంలో నైరుతి రుతుపవనాల గమనం నెమ్మదించింది. జూన్ 1 నుంచి 17 మధ్య దేశవ్యాప్తంగా సగటు కంటే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

Published on: Jun 20, 2026 10:43 AM IST
Advertisement

దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, సామాన్య ప్రజలను ఊరించిన నైరుతి రుతుపవనాలు అడుగుపెడుతూనే ముఖం చాటేసాయి! సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళను తాకాల్సిన రుతుపవనాలు.. ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసిన దానికంటే ఇది ఐదు రోజులు ఆలస్యం. అయితే, కేరళలో ప్రవేశించిన మొదటి వారంలో దేశంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ, ఆ తర్వాత వీటి గమనం పూర్తిగా మందగించింది. జూన్ 1 నుంచి జూన్ 17 వరకు దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలను పరిశీలిస్తే.. దీర్ఘకాలిక సగటు వర్షపాతం కంటే ఏకంగా 38 శాతం తక్కువగా నమోదైంది! రుతుపవనాలు ఇలా సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోవడం ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

బలహీన పడ్డ రుతుపవనాలు.. కారణం ఏంటి? (IMD)
బలహీన పడ్డ రుతుపవనాలు.. కారణం ఏంటి? (IMD)

భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా వాటా నైరుతి రుతుపవనాలదే. జూన్ మొదటి వారంలో చురుగ్గా సాగిన వీటి ప్రయాణం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా బలహీనపడటంతో అక్కడికక్కడే స్తంభించిపోయింది.

రుతుపవనాల పురోగతిని అడ్డుకుంటున్నది ఏంటి?

బంగాళాఖాతంలో ఎలాంటి బలమైన వాతావరణ వ్యవస్థ ఏర్పడకపోవడమే రుతుపవనాల గమనం ఆగిపోవడానికి ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

“ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎలాంటి వాతావరణ వ్యవస్థ లేదు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లోకి రుతుపవనాలు ముందుకు దూసుకెళ్లాలన్నా, అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ తీరం వైపు రుతుపవనాలను లాగాలన్నా.. బంగాళాఖాతంలో కచ్చితంగా ఒక అల్పపీడనం లేదా ద్రోణి ఏర్పడాల్సి ఉంటుంది,” అని ప్రైవేట్ వాతావరణ సంస్థ 'స్కైమెట్' వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ వివరించారు.

అయితే, జూన్ 22 లేదా 23 తర్వాతే రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన వ్యవస్థ ఏర్పడే సూచనలు ఉన్నాయని, దీనివల్ల జూన్ 25 నాటికి ముంబైకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

రుతుపవనాలు మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయి?

అలాగే, కేరళ, కర్ణాటక తీరప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగి, ఆ తేమతో కూడిన వాతావరణం క్రమంగా ఉత్తర దిశగా ముంబై వైపు విస్తరిస్తుంది.

జులై మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయా?

జూన్ 29 నుంచి జులై 5 మధ్య కాలంలో రుతుపవనాలు మరింత బలోపేతం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయంలో బలమైన రుతుపవన గాలుల కారణంగా దక్షిణ కేరళలోని పశ్చిమ కనుమలు, కొంకణ్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ వర్షాలు దేశం లోపలి భాగాలకు విస్తరిస్తాయి.

రాబోయే వారాల్లో బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడన వ్యవస్థ.. రుతుపవనాలకు మళ్లీ కొత్త జీవాన్ని పోస్తుందని, దేశవ్యాప్తంగా వర్షపాత కొరతను తీరుస్తుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ముంబైకి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి?

ముంబై సహా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ సరైన రుతుపవన వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల వరకు రుతుపవనాలు పెద్దగా ముందుకు సాగే అవకాశం లేదని ఐఎండీ స్పష్టం చేసింది.

“ప్రస్తుతం అరేబియా సముద్రంలో తేమ శాతం చాలా తక్కువగా ఉంది. జూన్ 23 నుంచి పశ్చిమ తీరం వైపు రుతుపవనాలు పురోగమించే అవకాశం ఉందని భావిస్తున్నాము,” అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర తెలిపారు.

నిజానికి జూన్ 8నే మహారాష్ట్రలో రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ పొడి వాతావరణం కారణంగా.. మహారాష్ట్ర ప్రభుత్వం ముందే స్పందించి, వర్షాలు సరిగ్గా పడేవరకు రైతులు తొందరపడి విత్తనాలు చల్లవద్దని సలహా ఇచ్చింది. సాధారణ పరిస్థితుల్లో అయితే జూన్ 11 నాటికే ముంబైని రుతుపవనాలు తాకాల్సి ఉంది.

మరోవైపు తీవ్రమైన వేసవి, రుతుపవనాలు సరిగ్గా లేకపోవడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో తాగు నీటి సమస్యలు మొదలయ్యాయి. ముంబై, గోవా వంటి ప్రాంతాల్లో అధికారులు నీటి వినియోగంపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం నెల రోజుల సరఫరా చేయగలిగేంత నీరు మాత్రమే ఉందని చెబుతున్నారు.

ఈ సమస్య తగ్గాలన్నా, రైతులు సకాలంలో పంటలు పండిచాలన్నా.. నైరుతి రుతుపవనాలు బలపడాల్సిన అవసరం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe