Interesting Facts : విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని విమానాలు తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ 'ఎయిర్ న్యూజిలాండ్' మాత్రం అందుకు భిన్నంగా నలుపు రంగు విమానాలను నడుపుతోంది. అసలు విమానాలకు తెలుపు రంగు ఎందుకు వేస్తారు? ఈ సంస్థ మాత్రం నలుపును ఎందుకు ఎంచుకుంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 13, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ప్రయాణించిన లేదా మీరు చూసిన విమానాలు దాదాపు తెలుపు రంగులోనే ఉంటాయి! వైట్​ కాకుండా వేరే రంగులోని విమానాలను చూడటం చాలా అరుదు! ఇంతకి.. విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? ఇక్కడ తెలుసుకుందాము.

విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?
విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

అంతేకాదు.. ఈ మధ్యకాలంలో ఆకాశంలో వైట్​ విమానల మధ్య ఒక బ్లాక్​ జెట్​ కనిపించి, అందరిని ఆకర్షిస్తోంది. అది “ఎయిర్​ న్యూజిలాండ్​” సంస్థకు చెందినది. ప్రపంచంలోనే అత్యధికంగా నలుపు రంగు విమానాలను కలిగిన సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. అందరు తెలుపు వాడుతుంటే, ఈ సంస్థ నలుపును ఎందుకు ఎంచుకుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఇక్కడ తెలుసుకోండి..

అసలు విమానాలు తెల్ల రంగులో ఎందుకు ఉంటాయి?

చల్లదనం కోసం: తెల్లటి రంగు సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. విమానం రన్‌వేపై ఉన్నప్పుడు కేబిన్ లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఇది కాపాడుతుంది. నలుపు రంగు అయితే వేడిని పీల్చుకుని విమానం త్వరగా వేడెక్కేలా చేస్తుంది.

బరువు తక్కువ: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! తెల్లటి రంగు వేయడానికి తక్కువ లేయర్లు సరిపోతాయి. నలుపు రంగుకు ఎక్కువ కోటింగ్స్ అవసరం. దీనివల్ల విమానం బరువు పెరిగి ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది.

రిపేర్లు సులభం: విమానం బాడీపై ఎక్కడైనా పగుళ్లు ఉన్నా, ఆయిల్ లీక్ అవుతున్నా తెల్లటి రంగుపై స్పష్టంగా కనిపిస్తుంది. నలుపు రంగుపై వీటిని గుర్తించడం కష్టం.

పక్షుల నుంచి రక్షణ: ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పక్షులు తెల్లటి విమానాన్ని సులభంగా గుర్తించగలవు. దీనివల్ల పక్షులు విమానాన్ని ఢీకొనే ప్రమాదం తగ్గుతుంది.

మరి ఎయిర్ న్యూజిలాండ్ ఎందుకు నలుపును ఎంచుకుంది?

ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఎయిర్ న్యూజిలాండ్ మాత్రం నలుపు రంగును ఎంచుకోవడానికి ప్రధాన కారణం వారి జాతీయ గుర్తింపు!

రగ్బీ టీమ్ గౌరవార్థం: 2007లో ఫ్రాన్స్‌లో జరిగిన రగ్బీ వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్ ఐకానిక్ రగ్బీ జట్టు ‘ఆల్ బ్లాక్స్’కు మద్దతుగా మొదటిసారి బోయింగ్ 777 విమానాన్ని నలుపు రంగులోకి మార్చారు.

సంస్కృతిలో భాగం: న్యూజిలాండ్ వాసులకు నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. వారి క్రీడా జెర్సీల నుంచి బూట్ల వరకు దాదాపు అన్నీ నలుపు రంగులోనే ఉంటుంది. అందుకే ఇది వారి జాతీయ రంగుగా మారిపోయింది.

బ్రాండింగ్ పవర్: ఆకాశంలో అన్ని విమానాలు తెల్లగా ఉన్నప్పుడు, నలుపు విమానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది సంస్థకు విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఎయిర్​ న్యూజిలాండ్​.. (Travel Trade- Newzeland)
ఎయిర్​ న్యూజిలాండ్​.. (Travel Trade- Newzeland)

నలుపు రంగు వల్ల నష్టాలున్నాయా?

ఎయిర్ న్యూజిలాండ్ అధికారుల ప్రకారం.. నలుపు రంగు వల్ల విమానం పనితీరులో పెద్దగా తేడాలేమీ లేవని తేలింది. తెల్లటి విమానాలతో పోల్చి చూసినప్పుడు ఇంధన వినియోగం లేదా నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వారు పేర్కొన్నారు.

ఎయిర్​ న్యూజిలాండ్​ వద్ద ప్రస్తుతం 115 విమానాలు ఉండగా, ప్రతి మోడల్‌లో కనీసం ఒక్కటైనా నలుపు రంగు విమానం ఉండేలా చూసుకుంటున్నారు.