...
...
Next Story

ITR filing last date : ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును కేంద్రం పొడిగిస్తుందా?

Income tax return filing : అసెస్మెంట్ ఇయర్ 2026-27 ఐటీఆర్ దాఖలుకు జులై 31 చివరి తేదీ. ఈసారి డెడ్​లైన్ పొడిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషం వరకు ఆగితే ఎదురయ్యే పెనాల్టీలు, నష్టాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Jul 27, 2026, 09:59:51 IST
Advertisement

అసెస్మెంట్ ఇయర్ (ఏవై) 2026-27కి సంబంధించి ఇన్​కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్​) దాఖలు చేయడానికి జులై 31 ఆఖరి తేదీ. గడువు సమయం దగ్గర పడుతుండటంతో.. గత ఏడాదిలాగే ఈసారి కూడా ప్రభుత్వం ఐటీఆర్ దాఖలు గడువును పెంచుతుందా? లేదా? అని పన్ను చెల్లింపుదారులు ఆలోచిస్తున్నారు.

ఐటీఆర్​ ఫైలింగ్​ అప్డేట్స్..
ఐటీఆర్​ ఫైలింగ్​ అప్డేట్స్..

గత ఏడాది ఐటీఆర్ ఫామ్‌లు ఆలస్యంగా రావడం, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడం, పన్ను చెల్లింపుదారుల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. కానీ, ఈసారి పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి.

ఆదాయపు పన్ను శాఖ ఈసారి ఐటీఆర్ ఫామ్‌లను నిర్ణీత సమయానికే అందుబాటులోకి తెచ్చింది. వివిధ కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు గడువు తేదీలను నిర్ణయించింది. అంతేకాకుండా, ఈ-ఫైలింగ్ పోర్టల్ కూడా చాలా స్మూత్‌గా పనిచేస్తోంది. ఈ కారణాల వల్ల ఈసారి గడువు పొడిగింపు ఉండే అవకాశాలు దాదాపు లేనట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఐటీఆర్​ ఫైలింగ్ గడువు ఎందుకు పెంచకపోవచ్చు?

గతంతో పోలిస్తే ఈసారి పన్ను చెల్లింపుదారులకు రిటర్న్స్ దాఖలు చేయడానికి తగినంత సమయం లభించింది.

ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఫామ్‌లను, ఫైలింగ్ సాధనాలను చాలా ముందుగానే అందుబాటులోకి తెచ్చింది.

దీనితో పన్ను చెల్లింపుదారులు గత ఏడాది కంటే ముందే ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించగలిగారు.

"గడువు పొడిగిస్తారనే ప్రచారాలు చూసి ఫైలింగ్‌ను వాయిదా వేసుకోవద్దు. సాంకేతిక సమస్యలు లేదా ఇతర పాలనాపరమైన అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆదాయపు పన్ను శాఖ గతంలో గడువు పెంచింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప, జులై 31నే ఆఖరి తేదీగా భావించి రిటర్న్స్ దాఖలు చేయడం సురక్షితంస" అని నిపుణులు స్పష్టం చేశారు.

కేటగిరీల వారీగా వేర్వేరు గడువులు..

జులై 31, 2026: ఐటీఆర్​-1, ఐటీఆర్-2 (ప్రధానంగా వేతన జీవులు, ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు)

ఆగస్టు 31, 2026: ఐటీఆర్-3, ఐటీఆర్-4 (ఆడిట్ అవసరం లేని వ్యాపారులు, ప్రొఫెషనల్స్)

అక్టోబర్ 31, 2026: ఖాతాలను తప్పనిసరిగా ఆడిట్ చేయించాల్సిన పన్ను చెల్లింపుదారులు

ఇలా వేర్వేరు తేదీలను కేటాయించడం వల్ల పీక్ సీజన్‌లో పోర్టల్‌పై తీవ్రమైన రద్దీ తగ్గుతుంది.

సాంకేతిక లోపాలు లేని ఈ-ఫైలింగ్ పోర్టల్..

ఐటీఆర్​ ఈ ఫైలింగ్​ పోర్టల్​లో గతంలో లాగిన్ కాకపోవడం, సర్వర్ స్లో కావడం వంటి సమస్యలు వచ్చేవి. కానీ ఈసారి ఈ-ఫైలింగ్ పోర్టల్ ఎంతో వేగంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా పనిచేస్తోంది. లాగిన్‌లు, ఐటీఆర్ ఫైలింగ్‌లు, పేమెంట్ గేట్‌వే, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ యాక్సెస్ వంటి అంశాలను ప్రభుత్వం ప్రత్యక్ష డ్యాష్‌బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాబట్టి గడువు పెంచడానికి ఎలాంటి బలమైన కారణం కనిపించడం లేదు.

గడువు ముగిసే వరకు ఆగితే జరిగే నష్టాలు..

పన్ను రిటర్న్స్ దాఖలును చివరి నిమిషం వరకు వాయిదా వేయడం వల్ల అనేక రకాల ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి:

లేట్ ఫీజు (పెనాల్టీ): జులై 31 దాటితే ఐటీ చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం లేట్ ఫీజు పడుతుంది.

మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉంటే రూ. 1,000 వరకు లేట్ ఫీజు చెల్లించాలి.

ఆదాయం రూ. 5 లక్షలు దాటితే రూ. 5,000 వరకు ఆలస్య రుసుము పడుతుంది.

వడ్డీ భారం: చెల్లించాల్సిన పన్ను బాకీలు ఉంటే, బకాయి మొత్తంపై నెలకు 1% వడ్డీ పడుతుంది.

నష్టాల సర్దుబాటు అవకాశం కోల్పోవడం: గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసే రిటర్న్​లు వ్యాపారం లేదా పెట్టుబడుల్లో వచ్చిన నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశాన్ని కోల్పోతారు.

రిఫండ్ ఆలస్యం: త్వరగా ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి రిఫండ్‌లు కూడా త్వరగా ఖాతాల్లో జమ అవుతాయి. ఆలస్యం చేస్తే రిఫండ్ రావడం మరింత ఆలస్యమవుతుంది.

తప్పులను దిద్దుకునే సమయం ఉండదు: ఫారమ్ 26ఏఎస్, ఏఐఎస్ లేదా టీఐఎస్ డేటాలో ఏవైనా తేడాలు ఉంటే చివరి నిమిషంలో సరిచేసుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.

సమయానికి ఫైలింగ్ పూర్తి చేయడం వల్ల లేట్ ఫీజులు, వడ్డీల భారం తప్పడమే కాకుండా చివరి నిమిషపు హడావుడి, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అందుకే జులై 31 2026 గడువుకు ముందే మీరు ఐటీఆర్​ ఫైలింగ్​ని పూర్తి చేయడం ఉత్తమం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks