Women’s Day 2026 : వారసత్వ ఆస్తిలో హక్కుల గురించి మహిళలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

Women's property rights : ఆస్తి యాజమాన్యం, వారసత్వ విషయాల్లో మహిళల హక్కుల గురించి అవగాహన కలిగి ఉండటం నేడు చాలా అవసరం. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తి పంపిణీ, విల్లు లేనప్పుడు ఆస్తి పంపిణీ ఎలా జరుగుతుందో వివరించే కొన్ని కీలక న్యాయపరమైన విశ్లేషణలు ఇక్కడ ఉన్నాయి..

Published on: Mar 8, 2026, 13:30:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. వారసత్వ- ఆస్తి హక్కుల విషయంలో మహిళలకు ఉన్న న్యాయపరమైన రక్షణలను గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఉమ్మడి ఆస్తి యాజమాన్యం, వారసత్వ క్రమం, విల్లును సవాలు చేయడం వంటి అంశాలపై స్పష్టత ఉండటం వల్ల మహిళలు సరైన నిర్ణయాలు తీసుకోగలరు.

వారసత్వ ఆస్తి హక్కుల గురించి మహిళలు ఇవి తెలుసుకోవాలి.. (ChatGPT generated image)
వారసత్వ ఆస్తి హక్కుల గురించి మహిళలు ఇవి తెలుసుకోవాలి.. (ChatGPT generated image)

హిందూ వారసత్వ చట్టం ప్రకారం వివిధ పరిస్థితుల్లో మహిళలకు ఉండే హక్కులపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రశ్న 1: నా భర్త, నేను గురుగ్రామ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను ఉమ్మడిగా కలిగి ఉన్నాము. మాకు పిల్లలు లేరు. ప్రస్తుతం నా భర్త కోమాలో ఉన్నారు. ఒకవేళ ఆయన విల్లు రాయకుండా మరణిస్తే, ఆయన 50% వాటా పూర్తిగా నాకు చెందుతుందా?

సమాధానం: మీ భర్త విల్లు రాయకుండా మరణిస్తే.. ఆయనకు పిల్లలు లేనందున.. ఆయన 50% వాటా మీ ఇద్దరి మధ్య అంటే మీకు, మీ అత్తగారికి (ఆయన తల్లి బతికి ఉంటే) సమానంగా పంచుతారు. ఒకవేళ మీ భర్త కంటే ముందే ఆయన తల్లి మరణించి ఉంటే, అప్పుడు మాత్రమే ఆయన 50% వాటా పూర్తిగా మీకు చెందుతుంది.

ప్రశ్న 2: నా తండ్రి 2025లో మరణించారు. ఆయనకు దిల్లీ, పానిపట్‌లో రెండు ఆస్తులు ఉన్నాయి. విల్లు రాయకుండా మరణించిన ఆయనకు నేను, నా సోదరుడు, చనిపోయిన నా మరో సోదరుడి కుటుంబం (భార్య- ఇద్దరు పిల్లలు) ఉన్నాము. హిందూ చట్టం ప్రకారం నా హక్కులేంటి?

సమాధానం: హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. మీరు, మీ ఇద్దరు సోదరులు మీ తండ్రి ఆస్తిలో సమానంగా మూడో వంతు వాటాకు అర్హులు. మీ ఒక సోదరుడు మీ తండ్రి కంటే ముందే మరణించినందున, ఆయనకు రావాల్సిన మూడో వంతు వాటా ఆయన వారసులకు అంటే ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు సమానంగా చెందుతుంది.

ప్రశ్న 3: మా అమ్మకు కొన్ని స్వయంకార్జిత ఆస్తులు ఉన్నాయి. నా సోదరుడు అమ్మను సరిగ్గా చూసుకోవడం లేదు, కాబట్టి ఆ ఆస్తులన్నీ నాకే చెందాలని ఆమె కోరుకుంటోంది. ఆమె ఏం చేయాలి?

సమాధానం: మీ తల్లి ఒక చెల్లుబాటు అయ్యే విల్లు రాసి, తన స్వయంకార్జిత ఆస్తులన్నీ మీకే చెందాలని స్పష్టంగా పేర్కొనవచ్చు. లేదా ఆమె బతికి ఉండగానే గిఫ్ట్ డీడ్ లేదా ఇతర చట్టపరమైన బదిలీ ద్వారా ఆ ఆస్తులను మీ పేరు మీద చేయవచ్చు. దీనివల్ల ఆమె మరణానంతరం ఆస్తి పంపిణీలో మీ సోదరుడికి వాటా వచ్చే అవకాశం ఉండదు.

ప్రశ్న 4: నా భార్య ఇటీవల విల్లు రాయకుండా మరణించింది. మాకు పిల్లలు లేరు. ఆమెకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంట్లో మేము ఉంటున్నాము. ఇప్పుడు నా బావగారు ఆ ఇల్లు ఖాళీ చేయమని కోరుతున్నారు. ఆ ఇల్లు నాకు చెందుతుందా లేదా ఆయనకు హక్కు ఉంటుందా?

సమాధానం: హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. ఒక మహిళ విల్లు రాయకుండా, పిల్లలు లేకుండా మరణించినప్పుడు, ఆమెకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఆమె భర్తకు స్వయంచాలకంగా చెందదు. అది ఆమె తండ్రి వారసులకు వెళుతుంది. కాబట్టి, మీ బావగారు ఆ ఆస్తిలో వాటా కోరవచ్చు. అయితే ఆయన ఒక్కడే వారసుడు కాకపోవచ్చు, మీ మామగారికి ఇతర వారసులు ఎవరైనా ఉంటే వారందరికీ అందులో వాటా ఉంటుంది.

ప్రశ్న 5: నా స్నేహితురాలు రాధ ప్రమాదంలో మరణించింది. ఆమెకు ఒక ఫ్లాట్ ఉంది, అది ఆమె స్వయంగా సంపాదించుకున్నది. రాధ భర్త సుధీర్, ఆయన తల్లిదండ్రులు ముందే మరణించారు. వారికి పిల్లలు లేరు. ఇప్పుడు రాధ తల్లిదండ్రులు ఆ ఫ్లాట్ తమదే అంటున్నారు, కానీ సుధీర్ తమ్ముడు ఆ ఫ్లాట్ తనకే చెందుతుందని వాదిస్తున్నాడు. ఎవరికి హక్కు ఉంటుంది?

సమాధానం: హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం.. ఒక హిందూ మహిళ విల్లు రాయకుండా, పిల్లలు లేకుండా మరణించినప్పుడు, ఆమె భర్త అంతకు ముందే చనిపోయి ఉంటే.. ఆమె స్వయంకార్జిత ఆస్తి ఆమె తల్లిదండ్రులకు చెందదు. అది ఆమె భర్త, వారసులకు చెందుతుంది. కాబట్టి, ఇక్కడ ఆ ఫ్లాట్ రాధ భర్త అయిన సుధీర్ తమ్ముడికే చెందుతుంది, రాధ తల్లిదండ్రులకు కాదు.

జీఈయూఎస్​ లా అసోసియేట్స్​కి చెందిన మేనేజింగ్​ అసోసియేట్​ మోనా దివాన్​ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More