...
...
Next Story

Yamaha Aerox E : 117 కి.మీ రేంజ్​తో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- ధర, ఫీచర్లు..

Yamaha Aerox E electric scooter : భారతీయ ప్రీమియం టూ-వీలర్ మార్కెట్లోకి యామహా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఏరాక్స్-ఇ’ని విడుదల చేసింది. రూ. 2.82 లక్షల భారీ ధరతో, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఫీచర్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు ఇక్కడ చూద్దాము.

Published on: Jul 9, 2026, 06:43:47 IST
Advertisement

భారతీయ టూ-వీలర్ మార్కెట్లో జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం యామహాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ బైక్‌లు, స్కూటర్లను పరిచయం చేసే యామహా.. ఇప్పుడు దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ స్పోర్ట్స్ మ్యాక్సీ స్కూటర్ 'ఏరాక్స్' మోడల్‌ను ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘యామహా ఏరాక్స్-ఇ’ పేరుతో విడుదలైన ఈ ప్రీమియం ఈవీ స్కూటర్ ప్రారంభ ధరను ఏకంగా రూ. 2.82 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు.

యమహా ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్..
యమహా ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్..

ప్రస్తుతం యామహా సంస్థ నుంచి భారత మార్కెట్లో లభిస్తున్న అన్ని మోడళ్ల కంటే ఇదే అత్యంత ఖరీదైనది కావడం విశేషం. అండ్ భారత మార్కెట్లో యామహా నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఇది.

యమహా ఏరాక్స్ ఇ- పవర్‌ఫుల్ మోటార్.. రిమూవబుల్ బ్యాటరీలు..

యమహా ఏరాక్స్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ సాధారణ ఈవీల లాంటిది కాదు. ప్యూర్ పర్ఫార్మెన్స్ కోసం దీనిని డిజైన్ చేశారు. ఇందులో 9.5 కేడబ్ల్యూ (12.9 హెచ్​పీ) గరిష్ట సామర్థ్యం గల పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను వాడారు. ఇది గరిష్టంగా 48 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిటీ ట్రాఫిక్‌లో గానీ, హైవేలపై గానీ ఈ స్కూటర్ రాకెట్‌లా దూసుకుపోతుంది. ఇక రేంజ్ విషయానికొస్తే.. ఇందులో 1.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన రెండు డిటాచబుల్ (బయటకు తీయగల) బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ ఏకంగా 117 కిలోమీటర్ల (ఐడీసీ రేంజ్) దూరం ప్రయాణిస్తుందని యామహా వెల్లడించింది. బ్యాటరీలను స్కూటర్ నుంచి విడిగా తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే సదుపాయం ఉండటం వల్ల అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

యమహా ఏరాక్స్ ఇ- రైడింగ్ మోడ్స్ అండ్ ప్రీమియం హార్డ్‌వేర్..

లుక్స్ పరంగా ఈ ఏరాక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత పెట్రోల్ మోడల్‌ను తలపిస్తుంది. సిగ్నేచర్ ట్విన్-ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, అగ్రెసివ్ టెయిల్ ల్యాంప్ డిజైన్‌తో ఇది రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. స్కూటర్ చుట్టూ బ్లూ యాక్సెంట్లు ఇచ్చి ఇది ఈవీ అని గుర్తుపట్టేలా చేశారు. పెట్రోల్ వెర్షన్‌లోని ఎల్‌సీడీ డిస్‌ప్లే స్థానంలో ఇప్పుడు సరికొత్త కలర్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జోడించారు. దీనికి స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎమ్ఎస్ అలర్ట్లు, వాతావరణ సమాచారాన్ని స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు. అయితే సీటు కింద బ్యాటరీ ప్యాకులు పెట్టడం వల్ల అండర్-సీట్ స్టోరేజ్ సామర్థ్యం 24.5 లీటర్ల నుంచి 15 లీటర్లకు తగ్గింది.

యమహా ఏరాక్స్ ఇ- ధరలు ఇలా..

యామహా ఏరాక్స్-ఇ ప్రస్తుతానికి తొలి విడతగా దిల్లీ, బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై నగరాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లోని డీలర్‌షిప్‌లకు వచ్చే అవకాశం ఉంది.

ధర విషయానికొస్తే.. భారత మార్కెట్లో లభిస్తున్న ప్రధాన ఎలక్ట్రిక్ స్కూటర్లయిన ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450 అపెక్స్, టీవీఎస్ ఎక్స్​లతో పోలిస్తే ఏరాక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర చాలా ఎక్కువ.

సాధారణ ఈవీ వినియోగదారుల కంటే, ఎక్కువ బడ్జెట్ పెట్టి అయినా సరే బ్రాండ్ వాల్యూ, అదిరిపోయే స్పోర్ట్స్ లుక్, మోటార్ సైకిల్ లాంటి రైడింగ్ పర్ఫార్మెన్స్ కోరుకునే ప్రీమియం బైక్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని యామహా ఈ ప్రయోగానికి పూనుకుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks