...
...
Next Story

Zerodha vs Groww : జెరోధా వర్సెస్​ గ్రో.. ముదిరిన మ్యూచువల్ ఫండ్స్ వార్! అసలేం జరిగింది?

Mutual Funds : భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షించే జెరోధా, గ్రో సంస్థల మధ్య బిజినెస్ మోడల్స్​పై బహిరంగ యుద్ధం మొదలైంది. డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం వెనుక అసలు కథ, సాధారణ ఇన్వెస్టర్లకు చేకూరే లాభనష్టాల విశ్లేషణ.

Published on: Jul 10, 2026 12:19 PM IST
Advertisement

భారతదేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్యను, ముఖ్యంగా యువతను మ్యూచువల్ ఫండ్స్ వైపు నడిపించడంలో డిస్కౌంట్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషించాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో సైతం ఐటీ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు లక్షలాది మంది ఈ యాప్స్ ద్వారానే ప్రతి నెలా 'సిప్' రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లుగా వెలుగొందుతున్న జెరోధా, గ్రో సంస్థల మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యాపార యుద్ధం మొదలైంది! మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులలో "డైరెక్ట్ ప్లాన్స్ మాత్రమే ఉండాలా.. లేక కమీషన్ వచ్చే రెగ్యులర్ ప్లాన్స్ కూడా అవసరమా?" అనే అంశంపై ఇరు కంపెనీల అధినేతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాహాబాహీకి దిగారు.

పేరు ఎత్తకుండా నితిన్ కామత్ వేసిన బాణం..

జెరోధా వర్సెస్ గ్రో..
జెరోధా వర్సెస్ గ్రో..

జెరోధా వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ చేసిన ఒక పోస్ట్ ఈ వివాదానికి దారితీసింది. తాము 2010లో డిస్కౌంట్ బ్రోకరేజ్ మోడల్‌ను ప్రారంభించినప్పుడు, ఇన్వెస్టర్ పెట్టే పెట్టుబడి పరిమాణంతో సంబంధం లేకుండా ఒకే రకమైన ఫ్లాట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన గుర్తుచేశారు. ఇదే సూత్రాన్ని మ్యూచువల్ ఫండ్స్‌కూ వర్తింపజేస్తూ పూర్తిగా ఉచితంగా, ఎటువంటి కమీషన్లు లేని 'డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్' ప్లాన్లను మాత్రమే అందించేలా 'కాయిన్' ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చామని చెప్పారు.

ఇన్వెస్టర్ల సొమ్ముపై పర్సంటేజ్ ఆధారంగా ఫీజులు వసూలు చేసే ఏ ప్లాట్‌ఫామ్ కూడా తమను తాము "డిస్కౌంట్" లేదా "తక్కువ ఖర్చు" అని చెప్పుకోలేవని నితిన్ కామత్ విమర్శించారు. తమ కాయిన్ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం రూ.1.6 లక్షల కోట్ల విలువైన డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఆస్తులను నిర్వహిస్తోందని, దీనివల్ల కస్టమర్లకు వేల కోట్ల రూపాయల కమీషన్లు మిగిలాయని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఆయన ఇక్కడితో ఆగలేదు.

"మాతో పాటు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ సేవలను ప్రారంభించిన చాలా ప్లాట్‌ఫామ్‌లు కాలగర్భంలో కలిసిపోయాయి లేదా తమ రూట్ మార్చాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న కొన్ని సంస్థలు కూడా డైరెక్ట్ ప్లాన్స్ ఇవ్వాలా వద్దా అనే గందరగోళంలో పడ్డాయి," అని కామత్ వ్యాఖ్యానించారు.

నితిన్ కామత్ విమర్శలపై గ్రో సంస్థ వెంటనే స్పందించింది. తమ మ్యూచువల్ ఫండ్ సేవలపై మార్కెట్లో అనవసర గందరగోళం, తప్పుడు సమాచారం ప్రచారంలోకి వస్తున్నాయని మండిపడింది.

"డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటికీ గ్రో ప్లాట్‌ఫామ్‌కు గుండెకాయ లాంటివి. అందులో ఎలాంటి మార్పు లేదు," అని గ్రో యాజమాన్యం అధికారికంగా స్పష్టం చేసింది.

తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుతం 1 కోటికి పైగా ఇన్వెస్టర్లు సుమారు రూ.1.9 లక్షల కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కలిగి ఉన్నారని, దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్ తమదేనని గ్రో గుర్తుచేసింది. సొంతంగా రీసెర్చ్ చేసుకుని పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఎప్పటికీ ఉచితంగా, జీరో కమీషన్‌తోనే డైరెక్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చింది.

అసలు 'గ్రో ప్రైమ్' అంటే ఏంటి?

మరి జెరోధా ఎందుకు విమర్శలు చేస్తోంది? గ్రో కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన 'గ్రో ప్రైమ్' లేదా 'ఎమ్ఎఫ్ ప్రైమ్' అనే ఆప్షనే దీనికి కారణం. ఇదొక ఐచ్ఛిక సేవ. మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని, ఏ ఫండ్స్ కొనాలో, ఎప్పుడు నిధులు ఉపసంహరించుకోవాలో తెలియని ఇన్వెస్టర్ల కోసం గ్రో దీనిని తీసుకొచ్చింది. ఈ ప్రైమ్ ప్లాన్ ఎంచుకునే వారికి నిపుణుల సలహాలు, పోర్ట్‌ఫోలియో రివ్యూలు, పరిశోధన ఆధారిత సిఫార్సులు లభిస్తాయి. కానీ, ఇందుకు ప్రతిఫలంగా ఇన్వెస్టర్లు ‘రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్’లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇక్కడే అసలు లింక్ ఉంది! రెగ్యులర్ ప్లాన్లలో డిస్ట్రిబ్యూటర్ కమీషన్లు కలిసి ఉంటాయి. ఈ కమీషన్లు ఇన్వెస్టర్ ఆస్తుల నుంచి ఎక్స్​పెన్స్ రేషియో రూపంలో కట్ అవుతాయి. దీర్ఘకాలంలో చూస్తే ఈ చిన్న కమీషన్ మొత్తం ఇన్వెస్టర్లకు వచ్చే లాభాల్లో భారీ వ్యత్యాసాన్ని చూపిస్తుంది.

రెండు వేర్వేరు వ్యాపార విధానాల ఘర్షణ..

జెరోధా వర్సెస్​ గ్రో మధ్య నడుస్తున్న పోరు కేవలం మాటల యుద్ధం కాదు, రెండు విభిన్న వ్యాపార తత్వాల ఘర్షణ. జెరోధా మొదటి నుంచి కస్టమర్ల స్వయం నిర్ణయ పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఎవరి సలహాలు లేకుండా సొంతంగా రీసెర్చ్ చేసుకునే వారికి ఫ్లాట్ బ్రోకరేజ్ చార్జీలతో పారదర్శక సేవలు అందించడం జెరోధా శైలి. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు లలిత్ కేష్రీ, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఈషాన్ బన్సాల్‌లు 2016లో స్థాపించిన గ్రో సైతం మొదట డైరెక్ట్ ఫండ్స్ ద్వారానే పాపులర్ అయినప్పటికీ, ఇప్పుడు వెల్త్ మేనేజ్‌మెంట్ వైపు అడుగులు వేస్తూ అటు సలహాలు ఇస్తూనే ఇటు కమీషన్లు పొందే మోడల్ వైపు మళ్లుతోంది.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఈ వివాదం ద్వారా సాధారణ ఇన్వెస్టర్లు తెలుసుకోవాలిన ముఖ్యమైన పాఠం ఒకటే. మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు అది 'డైరెక్ట్' ప్లానా లేక 'రెగ్యులర్' ప్లానా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. డైరెక్ట్ ప్లాన్లలో కమీషన్లు ఉండవు కాబట్టి దీర్ఘకాలంలో లాభాలు ఎక్కువగా వస్తాయి. ఒకవేళ మీకు మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేక, నిపుణుల సలహాలు కావాలనుకుంటే మాత్రమే కమీషన్ భరిస్తూ రెగ్యులర్ ప్లాన్లను ఎంచుకోవాలి. మీ అవసరానికి తగ్గట్టుగా ఏ ప్లాట్‌ఫామ్ సరైనదో ఎంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe