నేటి నుంచి ఆషాఢ మాసం మొదలు.. ఈ నెలలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఆషాఢ మాసం 2026 ప్రారంభమైంది. ఈ నెలలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఆషాఢ మాసం విశిష్టత, శయని ఏకాదశి, చాతుర్మాసం, గురు పూర్ణిమ, బోనాల పండుగ ప్రాముఖ్యత, గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య కారణాలు, చేయాల్సిన దానధర్మాలు, పాటించాల్సిన నియమాలు, తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈరోజు నుంచి ఆషాఢ మాసం మొదలైంది. చాలామంది ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు. ఈ కాలంలో వర్షాలు కూడా పడతాయి. అయితే ఆషాఢ మాసం ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. అలాగే ఆషాఢంలో కొన్ని పనులు చేస్తే చాలా మంచిది. మరి కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఆషాఢ మాసంలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? ఆషాఢ మాసం విశేషాలతో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శుభకార్యాలు జరపరు
శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే, ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు. ముఖ్యంగా పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరపకూడదని చెబుతారు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా కొంతకాలం దూరంగా ఉండాలని, పెళ్లయిన అమ్మాయి పుట్టింటికి వెళ్లాలని పెద్దలు అంటారు. అలాగే ఈ కాలంలో అత్తా-కోడళ్ల మధ్య మనస్పర్థలు, గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే అత్తగారు, కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని పెద్దలు చెబుతారు.
ఆషాఢ మాసం అంటే అనారోగ్య మాసమా?
ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసంగా కూడా భావిస్తారు. ఈ కాలంలో విపరీతమైన ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయి. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు కలుషితమవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు.
ఆషాఢంలో కొత్త నీరు తాగితే జ్వరాలు, తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. ఈ నెలలో మహిళలు గర్భం దాల్చడం మంచిది కాదాని విశ్వాసం ఉంది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే ఉద్దేశంతో అలాంటి సూచనలు చేశారని చెబుతారు.
ఆషాఢ మాసం విశేషాలు
ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయని ఏకాదశి అని అంటారు. చాతుర్మాసం కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది.
తెలంగాణలో అయితే బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆషాఢం అంటే ఏంటి?
ఆషాఢం అంటే అజేయమైనది, అపరాజితమైనది అనే అర్థాలు ఉన్నాయి. అందుకే ఆషాఢ మాసాన్ని విజయం, మానసిక దృఢత్వానికి ప్రతీకగా పెద్దలు పేర్కొంటారు.
గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
ఆషాఢ మాసంలో కచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. పిల్లలు, పెద్దలు అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. దీని వెనుక ఆరోగ్య సంబంధిత కారణం కూడా ఉంది.
వానాకాలం ప్రారంభమైనప్పుడు వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. దీంతో శరీరంలో పిత్త దోషం పెరుగుతుందని ఆయుర్వేదంలో చెబుతారు. చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని అధిక ఉష్ణం తగ్గి చల్లదనం లభిస్తుంది. ఔషధ గుణాలు ఉన్న గోరింటాకు కాళ్లు, చేతుల చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుందని, అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు.
ఆషాఢ మాసంలో ఏం చేయాలి?
ఆషాఢ మాసంలో దానధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతారు. అలాగే జపాలు, పారాయణాలు, దేవుని ఆరాధన చేస్తే పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.
గురు పూర్ణిమ
ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గురు పూర్ణిమను జరుపుకుంటాము. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆ రోజు పూజించడం వల్ల అనేక విధాలుగా శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


