చాణక్య నీతి: పుట్టినప్పుడే రాసిపెట్టి ఉంటుంది.. మనిషి జీవితంలో మార్చలేని ఆ 5 విషయాలు!
చాణక్య నీతి 29 జూన్ 2026: మనిషి జీవితంలో కొన్ని కీలక అంశాలు మనం పుట్టకముందే నిర్ణయించబడతాయని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. అవేమిటి? మన నియంత్రణలో లేని ఆ ఐదు విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
విధి నిర్ణయం.. చాణక్యుడి అమూల్యమైన సూత్రం: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసిన మేధావి ఆచార్య చాణక్య. ఆయన రచించిన 'నీతి శాస్త్రం' ఇప్పటికీ జీవిత పాఠాలను నేర్పిస్తూనే ఉంది. ఒక శ్లోకంలో చాణక్యుడు మనిషి జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన విషయాలను వివరించారు.

శ్లోకం:
ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ |
పంచైతాని హి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః ||
దీని అర్థం చాలా లోతైనది. ఒక జీవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతని ఆయుష్షు, చేసే పనులు (కర్మ), సంపద, విద్య మరియు మరణం అనే ఐదు విషయాలు ముందే నిర్ణయించబడతాయని చాణక్యుడు చెబుతున్నారు. వీటిని మార్చడం మనిషికి సాధ్యం కాదు.
గర్భంలోనే ఖరారయ్యే ఆ ఐదు విషయాలు
ఆయుష్షు: మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడన్నది ముందే నిర్ణయించబడుతుంది. దీనిపై ఎవరికీ అధికారం లేదు.
కర్మ: మనిషి తన జీవిత కాలంలో ఎలాంటి పనులు చేస్తాడనేది కూడా పూర్వజన్మ సుకృతం లేదా విధి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
సంపద: ఒక వ్యక్తి జీవితంలో ఎంత ధనం సంపాదిస్తాడు, ఎంత ఆర్థిక స్థితిని కలిగి ఉంటాడనేది విధి లిఖితం.
విద్య: మనిషి ఎంతవరకు జ్ఞానాన్ని పొందుతాడు, ఏ రంగంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు అనేది కూడా ముందే నిర్ణీతమవుతుంది.
మరణం: పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం. ఏ సమయంలో, ఎలా మరణిస్తాడనేది ఎవరికీ తెలియదు, కానీ అది ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది.
కర్మ సిద్ధాంతం: మనిషి పాత్ర ఏంటి?
చాలామందికి ఒక సందేహం రావచ్చు "అన్నీ ముందే నిర్ణయమైతే, ఇక మనం కష్టపడటం ఎందుకు?" అని. చాణక్యుడి దృష్టిలో 'కర్మ'కు చాలా ప్రాధాన్యత ఉంది. మనిషి తన బుద్ధిని ఉపయోగించి మంచి పనులు చేయడం తన ప్రాథమిక బాధ్యత. ఫలితం గురించి ఆశించకుండా, సంకల్పంతో చేసే పనులు మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయి.
"మంచి పనులు చేసే వారికి శుభ ఫలితాలు, చెడు పనులు చేసే వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి," అని చాణక్యుడు హెచ్చరించారు. అంటే, విధి నిర్ణయించినప్పటికీ, ఆ విధిని అనుభవించే క్రమంలో మన ప్రవర్తన, క్రమశిక్షణ మన భవిష్యత్తును మెరుగుపరచగలవు.
అకాల మరణం మార్చుకోగలమా?
జీవితంలో సుమారు 101 సార్లు మరణానికి సంబంధించిన పరిస్థితులు ఎదురవుతాయని చాణక్యుడు పేర్కొన్నారు. అందులో ఒకసారి మాత్రమే 'కాల మరణం' (సహజ మరణం) సంభవిస్తుంది, మిగిలినవి అకాల మరణాలు. సరైన జీవనశైలి, మంచి కర్మలతో అకాల మరణాల వంటి దురదృష్టకర సంఘటనల నుండి బయటపడవచ్చు. ఏదేమైనా, ఒక వ్యక్తి తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును తన సత్కర్మల ద్వారా ప్రభావితం చేయగలడు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


