ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడూ ఎందుకు కప్పి ఉంచుతారు? ఝార్ఖండ్‌లోని ఈ మహామాయ ఆలయం ప్రత్యేకత ఇదే!

ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఉన్న హాపాముని మహామాయ ఆలయం శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టతతో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే మండా పూజ, భక్తులు నిప్పులపై నడిచే అరుదైన ఆచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

Published on: Jul 6, 2026, 11:01:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. చాలామందికి ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఉన్న ఈ ఆలయం గురించి తెలియదు. ఈ హాపాముని మహామాయ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి నిలయం అని చెప్పొచ్చు. శతాబ్దాల చరిత్రను ఈ ఆలయం కలిగి ఉంది. పైగా, ఇక్కడ వింత ఆచారాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. మరి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడూ ఎందుకు కప్పి ఉంచుతారు? ఝార్ఖండ్‌లోని ఈ మహామాయ ఆలయం ప్రత్యేకత ఇదే! (pinterest)
ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడూ ఎందుకు కప్పి ఉంచుతారు? ఝార్ఖండ్‌లోని ఈ మహామాయ ఆలయం ప్రత్యేకత ఇదే! (pinterest)

పురాతన క్షేత్రం

హాపాముని మహాదేవ క్షేత్రం ఝార్ఖండ్‌లోని లోహార్‌డాగా రోడ్డు మార్గంలో వెళ్తుంటే, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న ఈ పురాతన హాపాముని మహామాయ దేవాలయం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకుంటే అపారమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. పూజలు మాత్రమే కాదు, ఇక్కడ అద్భుతమైన ఆచారాలు కూడా ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.

నిప్పుల మీద భక్తుల ప్రయాణం

శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో ఇక్కడ జరిగే మండా పూజ చాలా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తి పారవశ్యంలో మునిగిపోయిన భక్తులు నిప్పుల మీద చెప్పులు లేకుండా నడిచి అచంచలమైన విశ్వాసాన్ని చాటుకుంటారు. ఈ అరుదైన ఆచారం చూడడానికి రెండు కళ్లు చాలవు. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

ఆలయ చరిత్ర

ఈ ఆలయ చరిత్ర క్రీస్తుశకం 908 నాటిది. నాగవంశీ రాజు గజఘంట్‌రాయ్ చేతుల మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత 1931లో రాజా మోహన్‌రాయ్ తనయుడు శివదాస్ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. గుమ్లాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఝార్ఖండ్ ప్రాచీన సంస్కృతికి, ధార్మిక వారసత్వానికి ఇది సజీవ సాక్ష్యం.

అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడూ ఎందుకు కప్పి ఉంచుతారు?

మహామాయ ఆలయంలో అమ్మవారి విగ్రహం విషయంలో ఒక వింత ఆచారం ఉంది. అమ్మవారి విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అమ్మవారిని నేరుగా చూసినట్లయితే కళ్లు పోతాయని, దృష్టి మందగిస్తుందని అంటారు. అందుకనే అమ్మవారికి వస్త్రాలు మార్చేటప్పుడు పూజారులు కూడా కళ్లకు గంతలు కట్టుకుంటారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారం భక్తులలో ఒక దైవికమైన భయాన్ని, భక్తిని కలిగిస్తుంది.

ఈ ఆలయం వెనక ఉన్న వీరగాథ

ఆలయ చరిత్ర ఒక విషాదమైన వీరగాథతో ముడిపడి ఉంది. లార్క ఉద్యమం సమయంలో బజ్జూరాం అనే భక్తుడు అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు, శత్రువులు ఆయన కుటుంబ సభ్యుల ప్రాణాలను తీశారు. తన సహచరుడు రాదోరాం ద్వారా ఈ విషయాన్ని బజ్జూరాం తెలుసుకుంటాడు. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. యుద్ధంలో తనను తాను నిరూపించుకున్నా, అమ్మవారి హెచ్చరికను పాటించకుండా వెనక్కి తిరిగి చూడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ఇప్పటికీ కూడా వీరి సమాధులు భక్తుల పూజలు అందుకుంటున్నాయి.

తంత్ర విద్యలకు నిలయం

ఈ ఆలయం మతపరమైన కేంద్రం మాత్రమే కాదు, శక్తి ఆరాధనలో కీలకమైన తాంత్రిక క్షేత్రం కూడా. ఆలయ ప్రధాన నిర్మాణం ఇప్పటికీ పాతకాలపు పద్ధతిలో ఉండడం మరో విశేషం. ఝార్ఖండ్ యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వానికి ఈ ఆలయం చిహ్నంగా నిలుస్తుంది. ఒక్కసారైనా ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందవచ్చని అంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More