July Monthly Horoscope: జూలై రాశి ఫలాలు.. కెరీర్, ప్రేమ, ఆర్థిక పరిస్థితిపై గ్రహాల ప్రభావం.. వారికి ఊహించని లాభాలు!
జూలై నెలలో గ్రహాల సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, మరికొందరికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు, పెట్టుబడిదారులు, ఉద్యోగస్తులకు అనేక రాశుల్లో అనుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్త నెల ఆరంభం కానుంది. ఈ తరుణంలో మనసులో అందరి మెదిలే ఒకే ఒక్క ప్రశ్న.. జూలై నెలలో మన రాశికి ఏం జరగనుంది? ఉద్యోగంలో పదోన్నతులు దక్కుతాయా, వ్యాపారంలో లాభాలు వస్తాయా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతోంది? గ్రహాల సంచారం ఆధారంగా ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ వెల్లడించిన జూలై మాస ఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జూలై నెలలో పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది?
మేష రాశి:
జూలై నెలలో సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావంతో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ప్రేమ వ్యవహారాల్లో నెల ఆరంభంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురైనా, కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయి. విద్యార్థులకు ఈ నెల ఉత్సాహంగా సాగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు లాభిస్తాయి, అయితే అనవసర ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తలనొప్పి సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి.
వృషభ రాశి:
ఈ నెల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. హార్మోన్ల అసమతుల్యత, యూరిక్ యాసిడ్ లేదా రక్తంలో చక్కెర స్థాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సరైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించడం ఉత్తమం. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
మిథున రాశి:
ఆరోగ్య పరంగా ఈ నెల మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ప్రేమ, సంతాన విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కొత్త పరిచయాల విషయంలో తొందరపాటు వద్దు, పాత బంధాలను కాపాడుకోండి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మాటల్లో స్పష్టత ఉంటుంది, పెట్టుబడులకు ఇది మంచి సమయం.
కర్కాటక రాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. తండ్రి సహకారం లభిస్తుంది, అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మొత్తం మీద ఈ నెల మీకు శుభసూచికంగా కనిపిస్తోంది.
సింహ రాశి:
నెల మొదటి పక్షంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. 15వ తేదీ తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మనసులో చిన్నపాటి ఆందోళన ఉండవచ్చు. ఆదాయం పెరిగినా, ఆధ్యాత్మిక లేదా శుభకార్యాల కోసం ధనం ఖర్చవుతుంది. బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం లాభదాయకం.
కన్యా రాశి:
గతంతో పోలిస్తే ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే, నెల రెండో భాగంలో ప్రభుత్వ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకండి.
తులా రాశి:
కెరీర్, వ్యాపారంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులు లేదా చట్టపరమైన చిక్కుల నుంచి ఉపశమనం లభించవచ్చు. రాజకీయ, పరిపాలనా రంగాల్లో ఉండేవారికి ఇది మంచి సమయం. అధికారుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్పుడప్పుడు చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
వృశ్చిక రాశి:
ఈ నెల మీకు అన్ని విధాలా పురోభివృద్ధిని ఇస్తుంది. పాత సమస్యలు తొలగిపోతాయి, వృత్తిలో అధికారుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ పనుల్లో జాప్యం ఉండదు. ఆరోగ్యం మెరుగుపడి, ఉత్సాహంగా ఉంటారు.
ధనుస్సు రాశి:
ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తత అవసరం. నెల ద్వితీయార్థంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనుల్లో జాగ్రత్తగా ఉండండి. తండ్రి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండండి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా, సహనంతో ముందుకు వెళ్ళండి.
మకర రాశి:
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వివాహితులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌లో స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు సమగ్ర ప్రణాళికతో అడుగు వేయండి.
కుంభ రాశి:
ఆరోగ్యం, ప్రేమ, సంతానం, వ్యాపారం అన్ని అంశాల్లో ఫలితాలు బాగుంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అయితే, అంతర్గత శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. ఒత్తిడి అనిపించినా, సమయం గడిచేకొద్దీ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది.
మీన రాశి:
గతంతో పోలిస్తే ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులకు ఇది సరైన సమయం. విద్యార్థులకు ఈ నెల స్వర్ణయుగం వంటిది. పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు, ప్రభుత్వ పనుల్లోనూ మీకు ఆశించిన సహకారం అందుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


