నవంబర్ 15, 16 తేదీల్లో అరుదైన గ్రహ సంయోగాలు.. ఈ రాశుల వారికి భారీ ప్రయోజనాలు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 12, 2026న కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించడంతో ఇప్పటికే అక్కడ సంచరిస్తున్న గురుడు, కేతువులతో కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. నవంబర్ 15న కుజ-కేతువుల యుతి, నవంబర్ 16న కుజ-గురువుల సమీప సంయోగం చోటుచేసుకోనున్నాయి.
జ్యోతిష్య రంగంలో నవంబర్ మాసం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోబోతుండగా, ముఖ్యంగా నవంబర్ 12న సాహసకారకుడు కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే ఈ రాశిలో దేవగురు బృహస్పతి, కేతువు సంచరిస్తున్నారు. దీనివల్ల నవంబర్ మధ్యలో కుజుడు, గురుడు, కేతువుల కలయికతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.

ఖగోళ, జ్యోతిష్య గణనల ప్రకారం నవంబర్ 12న కుజుడు సింహ రాశిలో గోచరిస్తాడు. ఆ తర్వాత నవంబర్ 15న కుజ-కేతువుల యుతి, నవంబర్ 16న కుజ-గురులు అత్యంత సమీపానికి రావడం జరుగుతుంది. సింహ రాశిలో ఏర్పడుతున్న ఈ త్రిగ్రహ సంయోగం ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. కొన్ని రాశుల వారికి కెరీర్లో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తే, మరికొందరికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మేష రాశి:
మేష రాశి వారికి ఈ కాలం చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ జాతకంలో ఐదవ స్థానంలో ఈ గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీనివల్ల విద్య, ప్రేమ మరియు సంతాన సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. ఉద్యోగంలో సరికొత్త బాధ్యతలు మీ ముందుకు వస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తాము పడుతున్న శ్రమకు తగిన మంచి ఫలితాలను అందుకుంటారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ ముగ్గురు గ్రహాల కలయిక ఆత్మవిశ్వాసాన్ని, సాహసాన్ని రెట్టింపు చేస్తుంది. మీ రాశి నుంచి మూడవ స్థానంలో ఈ యోగం రూపుదిద్దుకుంటోంది. ఈ సమయంలో గతంలో నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని లాభాలు అందుకుంటారు. తోబుట్టువులతో సత్సంబంధాలు బలపడతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది. మీ జాతకంలో రెండవ స్థానంలో ఈ త్రిగ్రహ ప్రభావం ఉంటుంది. దీనివల్ల ధన పరమైన లాభాలు అందే అవకాశం ఉంది. కుటుంబంలో ఎప్పట్నుంచో వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. మీ మృదువైన మాటతీరుతో క్లిష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేయించుకుంటారు.
తులా రాశి:
తులా రాశి వారికి ఈ గ్రహాల సంయోగం లాభాల పంట పండిస్తుంది. మీ రాశి నుంచి పదకొండవ స్థానమైన లాభ స్థానంలో ఈ యుతి ఏర్పడుతోంది. ఫలితంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా వేతన సవరణకు సంబంధించి కీలక చర్చలు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు కుదురుతాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. మీ రాశికి తొమ్మిదవ స్థానంలో కుజ, గురు, కేతువుల ప్రభావం పడనుంది. ఈ సమయంలో దైవిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మారాలని ఆలోచించే వారికి అత్యుత్తమ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
గ్రహాల స్వభావంపై అవగాహన ముఖ్యం
ఈ యుతిని కేవలం శుభ ఫలికాల కోణంలోనే చూడలేమని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కుజుడు శక్తికి, సాహసానికి ప్రతీక అయితే, గురుడు జ్ఞానాన్ని, విస్తరణను సూచిస్తాడు. ఇక కేతువు వైరాగ్యానికి, ఆకస్మిక మార్పులకుకారకుడిగా చెబుతారు. కాబట్టి ఈ గ్రహాల కలయికను బట్టి జీవితంలో వచ్చే మార్పులను సమతుల్యంగా స్వీకరించడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


