సోమవతి అమావాస్య జూన్ 14న, 15న? తేదీ, శుభ సమయం, దానాలతో పాటు ఈ ఆర్థిక పరిహారాలు తెలుసుకోండి
ఈ ఏడాది జూన్ 15న అత్యంత పవిత్రమైన సోమవతి అమావాస్య వచ్చింది. ఈ రోజున పితృదేవతల ఆశీస్సులు, లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడచ్చో ఈ కథనంలో చూద్దాం.
హిందూ సంప్రదాయంలో సోమవతి అమావాస్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అమావాస్య తిథి సోమవారం నాడు వచ్చినప్పుడు దానిని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. సాధారణ అమావాస్యలతో పోలిస్తే దీనికి ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువ. ముఖ్యంగా 2026 సంవత్సరంలో వచ్చే ఈ మొదటి సోమవతి అమావాస్య 'అధిక మాసం'లో రావడం వల్ల దీని ప్రాధాన్యత వంద రెట్లు పెరిగిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన పరమశివుడిని, పార్వతీ దేవిని అలాగే పితృదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలిగిపోయి సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి.

శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, శక్తి కొద్దీ దానధర్మాలు చేయడం వల్ల అక్షయ పుణ్యఫలాలు దక్కుతాయి. ఈ రోజున చేసే జపతపాలు మనిషిని పాపాల నుంచి విముక్తుడిని చేస్తాయి.
సోమవతి అమావాస్య తిథి విశేషాలు
పంచాంగ గణన ప్రకారం.. అధిక మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి జూన్ 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం 08 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.. సోమవతి అమావాస్య వ్రతాన్ని జూన్ 15వ తేదీ సోమవారం నాడు ఆచరించాలి. అయితే, పితృకార్యాలు, తర్పణాలు విడవడానికి మాత్రం జూన్ 14వ తేదీ ఆదివారం అనుకూలమైన రోజని పండితులు స్పష్టం చేస్తున్నారు.
స్నాన, దానాలకు శుభ ముహూర్తాలు
ఈ పవిత్రమైన రోజున నదీ స్నానాలు చేయడానికి, దానాలు ఇవ్వడానికి బ్రహ్మ ముహూర్తం ఎంతో శ్రేష్ఠమైనది. జూన్ 14న తెల్లవారుజామున 04 గంటల 04 నిమిషాల నుంచి 04 గంటల 44 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అలాగే అదే రోజు మధ్యాహ్నం 03 గంటల 56 నిమిషాల నుంచి సాయంత్రం 05 గంటల 20 నిమిషాల వరకు అమృత కాలం ఉంటుంది. ఈ సమయాల్లో పూజలు, జపాలు చేయడం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.
సోమవతి అమావాస్య విశిష్టత
ఈ రోజున రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలిగిపోయి ప్రశాంతత లభిస్తుంది. శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి. పితృదేవతల ఆశీస్సులు లేకపోతే ఎంత సంపాదించినా కలిసిరాదని అంటారు. అందుకే ఈ అమావాస్య నాడు పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇస్తే పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. వారి ఆశీస్సుల వల్ల వంశాభివృద్ధి, కుటుంబంలో సంతోషం కలుగుతాయి.
ఆర్థిక ఇబ్బందులు తొలిగి ధనలాభం కలిగేందుకు పరిహారాలు
జీవితంలో ఎదురవుతున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి, వ్యాపారంలో నష్టాలను అధిగమించడానికి సోమవతి అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.
లక్ష్మీదేవికి పూజ: అమావాస్య సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆమెకు పసుపు రంగు గవ్వలను సమర్పించాలి. ఒకవేళ పసుపు గవ్వలు దొరకకపోతే తెల్లటి గవ్వలకు పసుపు రాసి ఉపయోగించవచ్చు. రాత్రంతా ఆ గవ్వలను పూజా స్థలంలోనే ఉంచి, మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా డబ్బులు పెట్టే లాకర్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నిరంతరం ధన ప్రవాహం ఉంటుంది.
రావి చెట్టు దగ్గర దీపం: అమావాస్య సాయంత్రం వేళ రావి చెట్టు మొదట్లో ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలిగిపోవడమే కాకుండా, ధనానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది.
చేపలకు ఆహారం: ఈ రోజున సమీపంలోని నది లేదా చెరువుకు వెళ్లి అక్కడ ఉన్న చేపలకు చక్కెర కలిపిన గోధుమ పిండి గుళికలను ఆహారంగా వేయడం చాలా మంచిది. ఈ చిన్న పని చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోయి సంపద పెరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం పౌరాణిక గ్రంథాలు, జ్యోతిష్య నమ్మకాలపై ఆధారపడి ఉంది. దీనిని సాధారణ సమాచారం కోసమే ఇస్తున్నాం. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


